Andhra Pradesh: ఏం తెలివిరా అయ్యా!.. చూసేందుకు ఆన్‌లైన్ పార్సిళ్లు.. తెరిచి చూస్తే మైండ్ బ్లాంక్..!
Andhra Pradesh: శతకోటి దరిద్రాలకు అనంత కోటి మార్గాలు అన్న నానుడిని అక్రమార్కులు బాగా వంట పట్టించుకున్నట్టున్నారు.
Andhra Pradesh: శతకోటి దరిద్రాలకు అనంత కోటి మార్గాలు అన్న నానుడిని అక్రమార్కులు బాగా వంట పట్టించుకున్నట్టున్నారు. గంజాయి అమ్మకాలకు కొత్త రూపం తీసుకొస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా పోలీసులకు పట్టుబడిన కేసులో.. ఏకంగా ఆన్లైన్లో ఆర్డర్ లో వచ్చే మాదిరిగా పార్సల్ ను తయారు చేసి హ్యాండ్ టు హ్యాండ్ గంజాయి పంపిణీ చేసేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సేల్స్ చేసి సొమ్ము చేసుకుంటున్నాడు.
విశాఖలో గంజాయి అమ్మకాలు కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త మార్గాలతో అక్రమార్కులు గంజాయి సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్దిలపాలెం చైతన్య నగర్ వద్ద గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. కూపీ లాగారు. పక్కా సమాచారంతో దాడులు చేశారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని.. 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఓ బైక్, వాక్యూమ్ మిషిన్, ఆన్‌లైన్ పార్సిల్ కవర్లు, ఓ మొబైల్ ఫోన్ ను గుర్తించి సీజ్ చేశారు.
కొన్నది నాలుగు వేలు.. అమ్మేది 15వేలు..! చైతన్య నగర్ కు చెందిన జి.నాగేశ్వరరావు నాయుడు అనే వ్యక్తి.. ఈ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈజీ గా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో తన మెదడుకు పదును పెట్టాడు. సాధారణంగా గంజాయి అమ్మకాలు చేస్తే పోలీసులకు పట్టుబడి పోతున్నామమన్న సందేహంతో.. ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు సరికొత్త ఉపాయానికి తెరలేపాడు. ఆన్‌లైన్‌లో వాక్యూమ్ మెషిన్, బబూల్ రాపర్స్, ఎన్వలప్స్, ట్రాన్స్పరెంట్ కవర్లు కొనుగోలు చేశాడు. వీటి సహాయంతో గంజాయిని.. పార్సిల్ చేసేవాడు. ఆన్‌లైన్‌లో వస్తువులు బుక్ చేస్తే వచ్చే పార్సిల్ పోలినట్లుగా.. గంజాయి పార్సీళ్లు తయారుచేసి.. ఎవరికీ అనుమానం రాకుండా తన పని ప్రారంభించాడు. చాప కింద నీరులా విశాఖలో గంజాయి విక్రయిస్తూ వస్తున్నాడు. 70 గ్రాముల గంజాయిని వెయ్యి రూపాయలకు అమ్ముతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ లెక్కన చూస్తే.. కిలో గంజాయి దాదాపుగా 15 వేలకు అమ్ముతున్న టు తెలుస్తోంది. అయితే, ఇతను కొంటున్నది మాత్రం కిలో 4 వేలకే అని పోలీసులు గుర్తించారు.
కాగా, నాగేశ్వరరావు రాయుడు గంజాయి అమ్మకాల విధానాన్ని చూసి పోలీసులే విస్తుపోయారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎవరితో లింకులు పెట్టుకున్నాడు..? ఇతని వ్యవహారం ఎలా సాగిపోతున్నది..? నాగేశ్వరరావు దగ్గర ఎవరెవరు కొనుగోలు చేస్తున్నారు? అనే దానిపై కూపీ లాగుతున్నారు.