Krishna District: గన్నవరంలో గుట్టు వీడింది.. అధికారులే నివ్వెరపోయారు..
కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో రేషన్ మాఫియా బాగోతం బహిర్గతమైంది. పోలీసులు, సివిల్ సప్లై అధికారులు సంయుక్త దాడిలో 50 కేజీల బరువున్న 500 బస్తాల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపగా, బాధ్యులపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపా

కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో రేషన్ మాఫియా బాగోతం వెలుగులోకి వచ్చింది. గోదాంలో భారీగా నిల్వ చేసిన బియ్యం బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకోవడంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రభుత్వం పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన విషయం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. అధికారులు దాడి చేసిన సమయంలో, అక్కడ 50 కేజీల బరువున్న 500 బస్తాలు వరుసగా కుప్పలుగా కనిపించాయి. ఈ దృశ్యం చూసి గ్రామస్తులు..ఇంత పెద్ద ఎత్తున అక్రమ రేషన్ నిల్వలు ఉంటాయని ఊహించలేదు అంటూ షాక్‌కు గురయ్యారు.
ఇటీవలి కాలంలో గన్నవరం మండలం రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికంగా ఉండాల్సిన సరుకు గోదాముల నుంచి బయటకు చేరి బ్లాక్ మార్కెట్‌లోకి వెళ్తోందన్న అనుమానాలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధికారులు పహారా కఠినం చేశారు. గత రాత్రి పోలీసులు, సివిల్ సప్లై శాఖ సంయుక్త బృందం సమాచారం ఆధారంగా సూరంపల్లిలో సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో రహస్యంగా నిల్వ ఉంచిన 500 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం బియ్యం బరువు సుమారు 25 టన్నులు ఉంటుందని అధికారులు తెలిపారు. బియ్యం మార్కెట్ విలువ లక్షల్లో ఉంటుందని అంచనా.
సీజ్ చేసిన బియ్యం బస్తాలను సివిల్ సప్లై గోదాంలకు తరలించారు. ఈ అక్రమ నిల్వల వెనక ఎవరు ఉన్నారు, ఎలా సేకరించారు, ఎక్కడికి తరలించాలనుకున్నారు అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. సంబంధిత రేషన్ వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.పేదలకు ఇచ్చే రేషన్ సరుకును ఇలా దాచిపెట్టి అమ్ముకోవడం దారుణం అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల నోటి నుండి అన్నం లాక్కుంటున్న రేషన్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




