Andhra: రైతు.. పొలం చదును చేస్తుండగా బయటపడిన బకెట్.. ఏముందా అని చూడగా…
టమాట సాగు కోసం భూమి చదును చేస్తుండగా.. మట్టి నుంచి ఓ పాత బకెట్ బయటపడింది. ఆసక్తిగా దానిని బయటకు తీసి చూడగా… అందులో ఉన్న వస్తువులు రైతును షాక్‌కు గురి చేశాయి. వెంటనే ఆయన స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కొద్ది సేపులోనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ టీములు అక్కడికి చేరుకున్నారు.

అది అనంతపురం జిల్లా వేపచర్ల అటవీ ప్రాంతం. అక్కడ ఓ అనువైన స్థలంలో టమాట సాగు చేసేందుకు ఓ రైతు భూమిని చదును చేస్తుండగా… ఓ బకెట్ బయటపడింది. అందులో ఏముందో చూసి రైతు గందరగోళానికి గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. అది మావోయిస్టు డంప్‌గా గుర్తించారు. అక్కడి నుంచి భారీగా డిటోనేటర్లు, తుపాకీ బుల్లెట్లు, ఐరన్ బాల్స్, మావోయిస్టుల డ్రెస్‌తో ఉన్న ఫోటోలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
దాదాపు 15 ఏళ్ల క్రితం వేపచర్ల ప్రాంతంలో మావోయిస్టులు ఉనికి ఉండేది. ఆ కాలంలో ఈ అటవీ ప్రాంతం మావోయిస్టుల రహస్య సమావేశాలు, వారి ఆయుధాలు, సామాగ్రి డంపింగ్ కేంద్రాలుగా ఉపయోగించేవారట. ఎందుకైనా మంచిదని పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో తాజాగా తనిఖీలు చేపట్టారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. పక్క గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి, ఏదైనా అనుమానాస్పద వస్తువులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




