AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Population Day 2021: రోజు రోజుకు పెరిగిపోతున్న ప్రపంచ జనాభా.. 2050 నాటికి ఎంత జనాభా పెరుగుతుందో తెలుసా..?

World Population Day 2021: ప్రపంచ వ్యాప్తంగా జనాభా రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా ఇండియా, చైనా లాంటి దేశాలకు ఇది కొన్ని ప్రయోజనాలు, కొన్ని నష్టాలను కలిగిస్తోంది..

World Population Day 2021: రోజు రోజుకు పెరిగిపోతున్న ప్రపంచ జనాభా.. 2050 నాటికి ఎంత జనాభా పెరుగుతుందో తెలుసా..?
Population Control
TV9 Telugu Digital Desk
| Edited By: Subhash Goud|

Updated on: Jul 11, 2021 | 10:34 AM

Share

World Population Day 2021: ప్రపంచ వ్యాప్తంగా జనాభా రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా ఇండియా, చైనా లాంటి దేశాలకు ఇది కొన్ని ప్రయోజనాలు, కొన్ని నష్టాలను కలిగిస్తోంది. అధిక యువ శక్తితో ఇలాంటి దేశాలు అభివృద్ధిలో దూసుకుపోయేందుకు అవకాశాలు ఉన్నా.. అదే అధిక జనాభా ఈ దేశాలకు భారంగా కూడా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా ప్రతియేటా పెరుగుతూనే ఉంది. అందుకే జనాభా పెరుగుదల, దాని పరిణామాలపై అవగాహన కలిగించేందుకు ప్రత్యేకించి ఓ రోజును కేటాయించారు. జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతున్నారు. 1989లో ఐక్య రాజ్యసమితి ఈ రోజును ప్రారంభించింది.

1987 జూలై 11 నాటికి ప్రంపచ జనాభా 500 కోట్లకు చేరింది. అందువల్లే ఆ రోజును ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 35 శాతానికి పైగా జనాభా.. ఇండియా, చైనాలోనే ఉన్నారు. ఎప్పుడో 1850లో ప్రపంచ జనాభా 100 కోట్లను దాటింది. 2020 మార్చి నాటికి 780 కోట్లను దాటినట్లు అంచనా. వచ్చే 30 ఏళ్లలో 900 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2050  నాటికి 970 కోట్లు, 2055 నాటికి 1000 కోట్లకు చేరుతుందనే అంచనా ఉంది.

దేశంలో కరోనా కారణంగా చేపట్టని జనగణన

మన దేశంలో కరోనా మహమ్మారి కారణంగా తాజాగా జనగణన చేపట్టలేదు. 2011 లెక్కల ప్రకారం భారతదేశం జనాభా 1,21,05,69,573. ప్రస్తుతం 135 నుంచి 140 కోట్ల దాకా ఉంటుందని అంచనా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే 2020 జూలై 9 నాటికి భారత జనాభా 1,38,02,70,828 కోట్లుగా ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది ఇండియా, చైనా, అమెరికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ సహా 9 దేశాల్లో ఉంటారని అంచనా ఉంది.

జనాభా పెరిగే కొద్దీ భూమికి భారమే..

ప్రపంచ జనాభా పెరిగే కొద్దీ భూమికి భారమేనని నిపుణులు చెబుతున్నారు. కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. అడవులు అంతరించిపోతున్నాయి. నదుల ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోంది. మానవుల అత్యాశ కారణంగా భూమికి అంతా నష్టమే జరుగుతోంది. ప్రపంచ దేశాల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోంది. ఆహార కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. ఆకలి చావులు తీవ్రమవుతున్నాయి. వ్యవసాయంలో యంత్రాలు, పురుగు మందుల వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు రోజూ వేల టన్నులు పెరిగిపోతున్నాయి. ఇలా జనాభా పెరుగుదల వల్ల ఎన్నో నష్టాలు తప్పడం లేదు.

భారత్‌లో యువ జనాభా ఎక్కువే..

కాగా, భారత్‌ల యువ జనాభా ఎక్కువే. తద్వారా భారత్‌ త్వరగా అభివృద్ధి చెందేందుకు వీలవుతుంది. 2025 నాటికి జనాభాలో భారత్, చైనాను దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇండియాలో జనాభా నియంత్రణ అమలు కచ్చితంగా లేకపోవడమే ఇందుకు కారణం. నిజానికి ప్రపంచంలో కుటుంబ నియంత్రణ పథకాలను అధికారికంగా ప్రవేశపెట్టింది భారత్‌లోనే. 1950లోనే కోట్లు ఖర్చు చేసింది. కానీ ఫలితాలు కనిపించలేదు. ఇప్పటికైనా కుటుంబ నియంత్రణా చర్యలు కఠినంగా పాటించకపోతే ఇండియాలో తీవ్రమైన కరవు పరిస్థితులు రావచ్చనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అభివృద్ధి దేశాల్లో మరణాల సంఖ్య తగ్గముఖం

జపాన్‌ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మరణాల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టినట్లు గుర్తించారు.వైద్య రంగంలో అక్కడ వచ్చే అధునాతన మార్పుల వల్ల మరణాలు తగ్గి.. జనాభా సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది ఆ దేశాలకు భారంగా మారుతోంది. జపాన్‌లో ముసలివారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం భూమిపై 40 కోట్ల మందికి ఆహారం దొరకడం లేదు. ఆఫ్రికా లాంటి దేశాల్లో ఆకలికి తోడు.. మురికి వాడల్లలో రకరకాల వ్యాధులు వస్తున్నాయి.

అవగాహన కల్పించాలి

ఒక వైపు కుటుంబ నియంత్రణ పాటిస్తూ, మరో వైపు యువతను అభివృద్ధి వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది. జనాభా విషయంలో అవగాహన కల్పించాలి. జనాభా పెరిగితే ఎలాంటి నష్టాలు ఉంటాయో యువతకు అవగాహన కల్పించాలి.