Ukraine-Russia: రష్యా-ఉక్రెయిన్‌ యుద్దానికి కౌంట్‌డౌన్‌.. వరుసగా మూడోరోజు బలగాలు ఆయుధ మోహరింపు

Ukraine-Russia Conflicts: రష్యా - ఉక్రెయిన్‌ మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఆదివారం రష్యా - బెలారస్‌తో కలిసి చేసే అణ్వాయుధ డ్రిల్స్‌ పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపుకు మూడు ప్రత్యేక విమానాలను నడిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

Ukraine-Russia: రష్యా-ఉక్రెయిన్‌ యుద్దానికి కౌంట్‌డౌన్‌.. వరుసగా మూడోరోజు బలగాలు ఆయుధ మోహరింపు
Ukraine Russia Conflicts
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 18, 2022 | 10:09 PM

Ukraine-Russia crisis: రష్యా – ఉక్రెయిన్‌ మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. ఆదివారం రష్యా – బెలారస్‌తో కలిసి చేసే అణ్వాయుధ డ్రిల్స్‌ పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఉక్రెయిన్‌ నుంచి భారతీయుల తరలింపుకు మూడు ప్రత్యేక విమానాలను నడిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రష్యా ఉక్రెయిన్‌ మధ్య యుద్దానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభయ్యింది. బెలారస్‌తో కలసి రష్యా ఆదివారం నిర్వహించబోయే ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులు, క్రూయిజ్‌ మిసైల్స్‌తో డ్రిల్స్‌- వార్‌ టెన్షన్‌ను పెంచేశాయి. బెలారస్‌ అధినేత లుకాషెంకోతో- పుతిన్‌ భేటీ కావడం కలకలం రేపింది. మరోవైపు వరుసగా మూడోరోజు రష్యా బలగాలు ఆయుధ మోహరింపులను, విన్యాసాలను ఉధృతం చేశాయి. లుకాషెంకోతో- పుతిన్‌ స్వయంగా ఈ యుద్ద విన్యాసాలను తిలకించబోతున్నారు. రష్యాకు చెందిన త్రివిధ దళాలు , ప్రత్యేక దళాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.

రష్యా కయ్యానికి కాలు దువ్వుతున్నవేళ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌- ఐరోపా, నాటో దేశాలతోపాటు ఇతర దేశాధినేతలతో వర్చువల్‌ సదస్సు ఏర్పాటు చేయబోతున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌ సరిహద్దుల దగ్గర లక్షా 69వేల నుంచి లక్షా 90వేల మంది సైనికులను రష్యా మోహరించిందని- అమెరికా దౌత్యవేత్త మైఖేల్‌ కార్పెంటర్‌ చెప్పారు. ఉక్రెయిన్‌ సరిహద్దుల దగ్గర నుంచి రష్యా బలగాల ఉపసంహరణలో నిజం లేదన్నారు. రష్యా -ఉక్రెయిన్‌ టెన్షన్‌ మధ్య అమెరికా వైస్‌ప్రెసిడెంట్‌ కమలా హ్యారిస్‌ జర్మనీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. నాటో చీఫ్‌తో ఆమె భేటీ అయ్యారు. తాజా పరిస్థితిపై చర్చించారు. అయితే అమెరికా తీరుపై రష్యా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. యుద్ద విన్యాసాలతో ఎవరు భయపడాల్సిన అవసరం లేదని క్రెమ్లిన్‌ ప్రకటన విడుదల చేసింది.

రష్యా దాడులు చేయొచ్చనే అనుమానంతో ఉక్రెయిన్‌ హైఅలర్ట్‌లో ఉంది. అక్కడ భద్రతను పటిష్టం చేశారు. మరోవైపు యుద్ధమే జరిగితే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అక్కడి ప్రభుత్వం ప్రజలకు చెబుతోంది. అటు ఈ యుద్ధం వినాశనకరంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 22,24,26 తేదీల్లో ఎయిర్‌ ఇండియా ఉక్రెయిన్‌కు మూడు ప్రత్యేక విమానాలను నడిపిస్తోంది. 286 సీట్ల సామర్ధ్యం ఉన్న బోయింగ్‌ 787 విమానాల్లో భారతీయ విద్యార్ధులను తరలిస్తారు. ఉక్రెయిన్‌లో దాదాపు 10 వేల మంది భారతీయులు ఉన్నారు.

Read Also….  Jagga Reddy: నా వల్లే ప్రాబ్లమ్ అయితే నేను వెళ్లిపోతా.. భావోద్వేగంతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు