Jagga Reddy: నా వల్లే ప్రాబ్లమ్ అయితే నేను వెళ్లిపోతా.. భావోద్వేగంతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ వీడనున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే అదే నిజమనిపిస్తోంది.
MLA Jagga Reddy: కాంగ్రెస్ పార్టీ(Congress)లో ముసలం రాజుకుంటోంది. పీసీసీ చీఫ్(TPCC) రేవంత్ రెడ్డి(Revanth Reddy) నియమితులైన నాటి నుంచి సీనియర్ నేతలందరూ ఒక్కొక్కరుగా ఆక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఆయనపై కినుక వహిస్తూ.. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ వీడనున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే అదే నిజమనిపిస్తోంది. రేపు సంగారెడ్డి కార్యకర్తలతో సమావేశమై, సంచలన నిర్ణయం ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ మేరకు శుక్రవారం తన ముఖ్య అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యనేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. వారి నుంచి కీలక సమాచారం తీసుకున్నారని, రేపు మరోసారి సంగారెడ్డిలో కార్యకర్తతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నది. మొత్తంమీద పార్టీకి రాజీనామా చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది.
ఇవాళ జరిగిన ముఖ్యనేతల సమావేశంలో జగ్గారెడ్డి బావోద్వేగానికి లోనట్లు సమాచారం. తనవల్లే ప్రాబ్లమ్ అయితే వెళ్లిపోతానని.. తనను కోవర్ట్ అని ప్రచారం చేస్తున్నారంటూ పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గత మంగళవారం సంగారెడ్డిలో జరిగిన సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో బాగున్నాయంటూ సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. పెండ్లీడుకొచ్చిన ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనతో కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని, పథకం కింద ప్రభుత్వ పరంగా రూ.1,01,116 అందజేయడం సంతోషకర విషయమని కొనియాడారు.
తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేను అయినప్పటికీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రశంసిస్తున్నట్టు పేర్కొన్నారు. మంచి పనులు ఎవరి చేసినా మెచ్చుకోవడంలో తప్పేముందని జగ్గా రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని ప్రశంసించడంపై మింగుడుపడని రాష్ట్ర నాయకత్వం ఆయనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నట్లుగా జగ్గారెడ్డి వర్గీయులు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి జగ్గారెడ్డికి మధ్య పొసగడం లేదు. రేవంత్‌రెడ్డివి ఒంటెత్తు పోడకలంటూనే బహిరంగానే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుసార్లు రేవంత్‌రెడ్డిపై అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి. అంతేకాకుండా బహిరంగ వేదికగా కూడా రేవంత్ తీరును ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే జగ్గారెడ్డి పార్టీ కార్యకర్తలతో భేటీ కానుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Read Also…. Minister Harish Rao: గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల బ్రాండ్ మరింత పెంచాలి..పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి…