Afghanistan Crisis: తాలిబన్ 2.0 ప్రారంభం అవుతోంది..ఇది మళ్ళీ ఉగ్రవాదులకు ఊపిరి అందిస్తుందా? అంతర్జాతీయ నిపుణులు ఏమంటున్నారు?

Afghanistan Crisis: తాలిబన్ 2.0 ప్రారంభం అవుతోంది..ఇది మళ్ళీ ఉగ్రవాదులకు ఊపిరి అందిస్తుందా? అంతర్జాతీయ నిపుణులు ఏమంటున్నారు?
Afghanistan Crisis

రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతిని నెలకొల్పుతామని చెబుతున్న అమెరికా తన లక్ష్యం పూర్తి చేయకుండానే తిరిగి వెళ్ళిపోయింది. అక్కడి  తమ సైన్యాన్ని అమెరికా ఉపసంహరించుకుంది.

KVD Varma

|

Aug 18, 2021 | 2:34 PM

Afghanistan Crisis: రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతిని నెలకొల్పుతామని చెబుతున్న అమెరికా తన లక్ష్యం పూర్తి చేయకుండానే తిరిగి వెళ్ళిపోయింది. అక్కడి  తమ సైన్యాన్ని అమెరికా ఉపసంహరించుకుంది. మరోవైపు, తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను తిరిగి ఆక్రమించింది. ప్రపంచంలోని దేశాలు కాబూల్‌లోని తమ రాయబార కార్యాలయాలను ఖాళీ చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుండి తమ పౌరులను తరలించడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబూల్ విమానాశ్రయంలో గందరగోళ వాతావరణం నెలకొంది. మారిన పరిస్థితిలో, ప్రపంచం ముందు అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ని తాలిబాన్ స్వాధీనం చేసుకోవడం ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఉగ్రవాదం పెరుగుతుందా? చైనా, పాకిస్తాన్ మధ్య జుగల్‌బందీని తాలిబాన్లు ఎంత బలోపేతం చేస్తారు? ఈ మార్పు భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ ప్రశ్నలకు అంతర్జాతీయ మీడియాలోనూ.. జాతీయ మీడియాలోనూ నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

ప్రపంచంలో ఉగ్రవాదం పెరుగుతుందా?

గతంలో 1996 నుండి 2001 వరకు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను పాలించినప్పుడు, తాలిబాన్లు అల్-ఖైదా వంటి తీవ్రవాద సంస్థలను వృద్ధి చెందడానికి అనుమతించాయి. ఈ సమయంలో ఒసామా బిన్ లాడెన్ ప్రపంచ ఉగ్రవాదిగా ఎదిగాడు. ఈసారి తాలిబాన్లు ప్రపంచం ముందు శాంతి గురించి మాట్లాడుతుండవచ్చు, కానీ నిపుణులు అల్-ఖైదా -తాలిబాన్లను ఒకరినుంచి ఒకరిని వేరు చేయలేరని నమ్ముతారు. అల్-ఖైదా , ఐసిస్ (ISIS) వంటి సంస్థలు తాలిబాన్ నుంచి తెర వెనుక నుండి సహాయాన్ని స్వీకరిస్తూనే ఉంటాయి. దీంతో ప్రపంచంలో ఉగ్రవాదం పెరుగుతుందనే భయం ఉంది.

మూడులక్షల మంది ఆప్ఘన్ భద్రతా దళాల యోధులను..కేవలం 60 వేల మంది తాలిబాన్ యోధులు పారిపోయేలా చేయగలిగిన విధానం.. ఇప్పుడు తీవ్రవాద సమూహాల మనోబలాన్ని పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  దాదాపు చనిపోయిన ఐసిస్ (ISIS) మళ్లీ తేజోవంతం కావచ్చు. తాలిబాన్ ఈ విజయం దక్షిణాఫ్రికాలోని అనేక దేశాలలో విస్తరించిన చిన్న ఉగ్రవాద సంస్థలలో కొత్త శక్తిని నింపగలదు. ఇవన్నీ కలిస్తే, ప్రపంచంలో ఉగ్రవాదం పెరగడం ఖాయం. అల్-ఖైదా, బోకో హరామ్, అల్ సాహాబ్, తెహ్రిక్-ఇ-తాలిబాన్, హక్కానీ ఫ్యాక్షన్ వంటి అనేక సంస్థలు ఏకం కావచ్చు. దీనితో పాటు, పాకిస్తాన్‌లో క్రియాశీలకంగా ఉన్న జైష్-అహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు కూడా తల ఎగరేయగలవు.

తాలిబాన్ ప్రభుత్వానికి చైనా గుర్తింపు ఇచ్చింది.. రాబోయే కాలంలో చైనా జోక్యం పెరుగుతుందా?

తాలిబాన్ 1.0 కంటే తాలిబాన్ 2.0 ప్రపంచానికి మరింత ప్రజాస్వామ్యంగా నిరూపించడానికి ప్రయత్నిస్తోంది. తాలిబాన్ 1.0 సమయంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచం నుండి వేరుగా నిలిచింది. అప్పుడు తాలిబానీ పాలనను కేవలం 3 దేశాలు మాత్రమే గుర్తించాయి. ఈసారి చైనా తాలిబాన్లను గుర్తించిన మొదటి అలాగే అతిపెద్ద దేశం. తాలిబన్లతో స్నేహపూర్వక సంబంధాలను నెలకొల్పడానికి చైనా తన ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పశ్చిమ ఆసియా, మధ్యప్రాచ్య దేశాలకు చైనా కొత్త స్నేహితుడిని పొందుతుంది. ఈ ప్రాంతంలో చైనా ఒక ప్రధాన శక్తిగా అవతరించే అవకాశం ఉంది.

చైనా ఆఫ్ఘన్ కు స్నేహహస్తం అందించడంపై నిపుణులు ఇలా చెబుతున్నారు. ”ఆఫ్ఘనిస్తాన్ చైనాకు కొత్త పెట్టుబడి మైదానం. అందుకే ఆఫ్ఘనిస్తాన్‌తో స్నేహపూర్వక సంబంధాలను నిర్మించుకోవాలని చైనా ఖచ్చితంగా కోరుకుంటుంది. పాకిస్తాన్ ఇప్పటికే చైనాతో ఉంది. ప్రస్తుత పరిస్థితిలో, చైనా రెండు చేతుల్లోనూ లడ్డూలు ఉన్నట్లే!” అదే సమయంలో, భవిష్యత్తులో, తాలిబాన్లు చైనాకే ముప్పుగా మారిపోయే పరిస్థితులనూ కొట్టిపారేయలేమని వారు అంటున్నారు. తాలిబాన్లు తరువాత చైనాకు వ్యతిరేకంగా ఉయ్‌ఘర్ ముస్లింలను ప్రేరేపించడానికి ప్రయత్నించవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఈ మార్పు నుండి పాకిస్తాన్ ఏ రకంగా లబ్ధిపొందగలదు?

యురేషియా (యూరప్- ఆసియా)లో రష్యా, చైనా, అమెరికా, ఇండియా , నాటో ఉన్న విధానం.. దానిలో పాకిస్తాన్ పాత్ర చాలా పరిమితంగా ఉండడం గురించి నిపుణులు చెబుతున్నారు. ఇకపై ఆ పరిస్థితి మారొచ్చని వారంటున్నారు. తాలిబాన్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ మొత్తం ప్రాంతంలో పాకిస్తాన్ పాత్ర పెరుగుతుంది.

పాకిస్తాన్ ఇప్పుడు చైనాకు, అమెరికాకు వ్యూహాత్మక దేశంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రష్యా తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి ఉత్తర దేశాలను ఆఫ్ఘనిస్తాన్‌ను ఆనుకుని తన బఫర్ జోన్‌గా పరిగణిస్తుంది. దీని కారణంగా, ఈ ప్రాంతాల్లో అమెరికా ఎడ్జ్ సాధించే అవకాశాలు చాలా తక్కువ. అమెరికా కోసం, పాకిస్తాన్ మాత్రమే వ్యూహాత్మక ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తుంది. అదేవిధంగా, అమెరికా..చైనా పాకిస్తాన్ పట్ల సానుభూతి కలిగి ఉన్నాయి. పాకిస్తాన్ పట్ల రష్యా వైఖరి కూడా తటస్థంగా ఉంది. ఈ కారణంగా, గత రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్‌స్పాట్‌గా లేని పాకిస్థాన్ ఇప్పుడు కేంద్రంలోకి వస్తుంది. రష్యా, అమెరికా, చైనా దేశాలు ఇప్పుడు  ఆఫ్ఘనిస్తాన్ .. పాకిస్తాన్‌కు సంబంధించి విదేశాంగ విధానాన్ని మార్చవలసి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు, పిల్లల మానవ హక్కుల పరిస్థితి ఏమిటి?

తాలిబాన్ తన అనాగరిక నిర్ణయాలకు ప్రసిద్ధి చెందింది. తాలిబాన్ 1.0 సమయంలో, మహిళలు బురఖా ధరించడాన్ని తప్పనిసరి చేశారు.  నేరస్థులను కూడలి వద్ద బహిరంగంగా శిక్షించారు. మళ్లీ అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే గోడలపై మహిళల పెయింటింగ్‌లు తెల్లగా పెయింట్ చేశేసారు. ఇళ్ళు దోపిడీ గురవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, ఆఫ్ఘనిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పెరుగుతుందని నిపుణులు భయపడుతున్నారు. యుఎస్ మిలిటరీకి సహాయం చేసిన వ్యక్తులు ఇప్పుడు తాలిబాన్ల లక్ష్యంగా ఉంటారు.

ఆఫ్ఘనిస్తాన్ గురించి ఐక్యరాజ్యసమితి ఏమంటోంది?

యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుత పరిస్థితుల గురించి ఆగస్టు 16 న అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. ప్రపంచ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. తీవ్రవాద సంస్థలకు ఆఫ్ఘనిస్తాన్ సురక్షిత స్వర్గంగా ఉపయోగించబడకుండా చూసుకోవడానికి అంతర్జాతీయ సమాజం ఏకం కావాలని గుటెర్రెస్ అన్నారు. అదేవిధంగా సంయమనం పాటించాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని, మానవతా అవసరాలను తీర్చడంపై దృష్టి పెట్టాలని తాలిబాన్‌లకు ఆయన పిలుపునిచ్చారు.

ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న ఒక రోజు తర్వాత, ఐక్యరాజ్యసమితి ఆఫ్ఘనిస్తాన్‌లో సైనిక ఘర్షణలో చిన్నారుల మరణాలపై ఒక నివేదికను కూడా విడుదల చేసింది. నివేదిక ప్రకారం, జనవరి 2019 నుండి డిసెంబర్ 2020 వరకు సాయుధ పోరాటం కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌లో 1635 మంది పిల్లలు మరణించారు. 4,135 మంది పిల్లలు శారీరకంగా వికలాంగులయ్యారు. ఈ సంఖ్య 2021 మొదటి 6 నెలల్లో అత్యధికం. ఈ సమయంలో మరణించిన లేదా గాయపడిన ప్రతి ముగ్గురిలో ఒకరు చిన్నారి కావడం గమనార్హం.  ఈ సమయంలో 6,470 బాలల హక్కుల ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. వీటిలో సగం కేసులకు తాలిబాన్లదే నేరుగా బాధ్యత అని చెప్పవచ్చు.

ఇప్పుడు భారత్ ఏం చేయాలి?

ఈ మొత్తం పరిస్థితిలో భారతదేశానికి పెద్దగా ఎంపికలేవీ లేవని నిపుణులు అంటున్నారు. ఒకవేళ భారతదేశం తాలిబన్లతో సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ, తాలిబాన్లు భారతదేశానికి విధేయులుగా మారే అవకాశం లేదు. తాలిబన్లలో పాకిస్తాన్, చైనా జోక్యం చేసుకోవడమే దీనికి ప్రత్యక్ష కారణం. తాలిబాన్లకు ముందు, ఆఫ్ఘనిస్తాన్‌లో భారతదేశానికి ముఖ్యమైన పాత్ర ఉంది. చైనా పాకిస్తాన్‌తో దానికి పెద్దగా మంచి సంబంధాలు లేవు.  కానీ ఇప్పుడు విషయం పూర్తిగా విరుద్ధంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం అమెరికాకు తన సామీప్యాన్ని పెంచింది. రష్యా నుండి దూరంగా ఉంది. ఇది భారతదేశంపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. భారతదేశానికి మళ్లీ 90 ల పరిస్థితికి చేరుకునే ప్రమాదం ఉంది. ప్రస్తుతం భారతదేశానికి, వేచి ఉండి చూడటం మంచి వ్యూహమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అదేవిధంగా, తాలిబాన్ల నుండి భారతదేశానికి ప్రత్యక్ష ముప్పు లేదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం భారతదేశానికి అతిపెద్ద ముప్పు చైనా. చైనా తాలిబన్లతో సంబంధాలను ఎలా పెంచుకుంటుంది అనేది.. భారతదేశానికి చాలా ముఖ్యం. భారతదేశానికి మరొక ముప్పు పిఒకె ప్రాంతం. 370 రద్దు తర్వాత భారతదేశం కాశ్మీర్‌ను నియంత్రించిన విధానం భారతదేశానికి మేలు చేసింది. అయితే, పీఓకే ప్రాంతంలో పాకిస్తాన్, చైనాల నుంచి పొంచి ఉన్న ముప్పు దృష్ట్యా  భారతదేశం మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

Also Read: Afghanistan Crisis: రెక్కలపైనే కాదు.. విమానం చక్రాల్లో కూడా కూర్చుని.. ఇప్పుడు వారు మాంసం ముద్దలుగా..

Afghanistan Crisis: యాక్షన్.. రియాక్షన్.. తాలిబన్ల చెర నుంచి మరో నగరాన్ని స్వాధీనం చేసుకున్న ఆఫ్ఘన్ సైన్యం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu