Pak Crisis: శ్రీలంక బాటలో పాకిస్తాన్.. చుక్కలు చూపిస్తున్న నిత్యావసర ధరలు..
Pak Crisis: ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా కోలుకోనేలేదు శ్రీలంక. ప్రభుత్వం మారినా పరిస్థితిలో మార్పు లేదు. తాజాగా శ్రీలంక బాటలోనే పయనిస్తోంది
Pak Crisis: ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా కోలుకోనేలేదు శ్రీలంక. ప్రభుత్వం మారినా పరిస్థితిలో మార్పు లేదు. తాజాగా శ్రీలంక బాటలోనే పయనిస్తోంది మన పొరుగు దేశం పాకిస్తాన్. ఆర్థిక సంక్షోభం మరింత ముదిరి దివాలా స్థితికి చేరింది. పెట్రోల్, డీజిల్‌తో పాటు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వంటనూనెల ధరలు భగ్గుమంటున్నాయి. పాకిస్తాన్ కరెన్సీ రోజురోజుకీ పతనమవుతుండటంతో.. విదేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకోవడానికి నానా తంటాలు పడుతోంది. గత కొన్ని నెలలుగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న పాకిస్థాన్.. ఇప్పుడు దివాలా స్థితికి చేరింది. మే 25 నుంచి ఇప్పటివరకు పెట్రోల్ ధరలను 60 రూపాయల మేర పెంచింది పాక్ ప్రభుత్వం. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 209రూపాయలు..డీజిల్ ధర 204రూపాయలుగా ఉంది.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి, దివాళా నుంచి రక్షించుకోవడానికి పాకిస్తాన్ ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు స్నేహపూరిత దేశాల నుంచీ ఆర్థిక సహకారాన్ని కోరుతోంది. సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్‌ను సాయం కోసం అభ్యర్థిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి ప్యాకేజీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఐతే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించే అవకాశం లేదంటున్నారు పాకిస్తాన్ ఆర్థికమంత్రి మిఫ్తా ఇస్మాయిల్.
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డామని మార్కెట్లకు బూస్ట్ ఇచ్చేలా ట్వీట్ చేశారు. ఐతే ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు ప్రధాని షాబాజ్ షరీఫ్ ఎప్పుడైనా పొదుపు చర్యలు ప్రకటించవచ్చన్నారు. ఇక RDA మూసివేత గురించి వచ్చిన నివేదికలను కూడా ఇస్మాయిల్ కొట్టిపారేశారు. విదేశీ కరెన్సీ ఖాతాల ఫ్రీజ్, ప్రైవేట్ లాకర్లను స్వాధీనం చేసుకునే ఆలోచన లేదన్నారు. దేశంలోని అన్ని ఆర్థిక ఆస్తులను రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.