Satya Nadella: అమెరికాలో పద్మ భూషణ్ అవార్డు అందుకున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. భారత్‌కు సేవ చేస్తానంటూ..

ఈ ఏడాది గణతంత్ర వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వం.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు ‘పద్మ భూషణ్‌’ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. 17 మంది అవార్డు గ్రహీతలలో ఆయన ఒకరిగా ఎంపికయ్యారు.

Satya Nadella: అమెరికాలో పద్మ భూషణ్ అవార్డు అందుకున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. భారత్‌కు సేవ చేస్తానంటూ..
Microsoft CEO Satya Nadella
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 20, 2022 | 12:38 PM

భారతదేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డును అందుకోవడం తనకు గౌరవంగా భావిస్తున్నానని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. సాంకేతిక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, వృద్ధి ప్రమాణాలను పెంచేందుకు భారతదేశ ప్రజలతో కలిసి పనిచేయడం కోసం ఎదురు చూస్తున్నానని సత్య నాదెళ్ల తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టివి నాగేంద్ర ప్రసాద్ నుంచి.. విశిష్ట సేవలకు గాను భారత ప్రభుత్వం అందించిన పద్మభూషణ్‌ పురస్కారాన్ని సత్య నాదెళ్ల అందుకున్నారు. ఈ ఏడాది గణతంత్ర వేడుకల సందర్భంగా భారత ప్రభుత్వం.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు ‘పద్మ భూషణ్‌’ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. 17 మంది అవార్డు గ్రహీతలలో ఆయన ఒకరిగా ఎంపికయ్యారు. అయితే.. రాష్ట్రపతి అందించే ఈ అవార్డును స్వీకరించడానికి సత్యనాదెళ్ల అనివార్య కారణాల వల్ల భారత్‌కు రాలేకపోయారు. దీంతో ఆయనకు అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ ఈ అవార్డును బహూకరించారు. పద్మ భూషణ్‌ అవార్డు అందుకున్న అనంతరం సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. పద్మభూషణ్ అవార్డును అందుకోవడం, ఎంతో మంది అసాధారణ వ్యక్తులతో గుర్తింపు పొందడం గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతికతతో కూడుకున్న అభివృద్ధిని సాధించడంలో సహాయపడటానికి, భారతదేశ ప్రజలతో కలిసి పని చేయడం కోసం తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో భారతదేశాన్ని సందర్శించాలని యోచిస్తున్నట్లు సత్య నాదెళ్ల తెలిపారు.

ఈ సమావేశంలో భారతదేశంలో సమ్మిళిత వృద్ధికి సాధికారత కల్పించడంలో డిజిటల్ టెక్నాలజీ పోషిస్తున్న కీలక పాత్రపై నాదెళ్ల ప్రసాద్‌తో చర్చించారు. మైక్రోసాఫ్ట్ ప్రకారం భారతదేశ వృద్ధి – ప్రపంచ రాజకీయ, సాంకేతిక రంగాల గురించి చర్చించారు. మనం చారిత్రక ఆర్థిక, సామాజిక, సాంకేతిక మార్పుల కాలంలో జీవిస్తున్నామని, మార్పులు అవసరమని.. దాని తనవంతు సహాయం అందిస్తానని డాక్టర్ ప్రసాద్‌తో తన భేటీ అనంతరం నాదెళ్ల అన్నారు. రాబోయే దశాబ్దంలో డిజిటల్ టెక్నాలజీతోనే అభివృద్ధి సాధ్యమని.. భారతీయ పరిశ్రమలు, సంస్థలు సాంకేతికత వైపు మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. గొప్ప ఆవిష్కరణలు, చురుకుదనం, స్థితిస్థాపకతకు దారి తీస్తుందని నాదెళ్ల చెప్పారు.

హైదరాబాద్‌లో జన్మించిన నాదెళ్ల ఫిబ్రవరి 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా నియమితులయ్యారు. జూన్ 2021లో ఆయన కంపెనీ ఛైర్మన్‌గా కూడా నియమితులయ్యారు. బోర్డుకు ఎజెండాను రూపొందించే పనిలో ఆయన నాయకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏటా ప్రకటించే భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డులు ఒకటి. అవార్డులు మూడు విభాగాలలో ఇ్తారు. పద్మవిభూషణ్ (అసాధారణమైన – విశిష్ట సేవలకు), పద్మభూషణ్ (అత్యున్నత స్థాయికి చెందిన విశిష్ట సేవ), పద్మశ్రీ (విశిష్ట సేవ).

కాగా, నాదెళ్ల 2023 జనవరిలో భారతదేశాన్ని సందర్శించాలని యోచిస్తున్నారని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. దాదాపు మూడేళ్లలో ఆయన తొలిసారిగా దేశాన్ని సందర్శించనున్నారని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..