AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రోన్లు, క్షిపణులతో కువైట్ విమానాశ్రయంపై విరుచుకుపడ్డ ఇరాన్.. భారతీయుడు మృతి!

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించినట్లు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం (జూన్ 3, 2026) ధృవీకరించింది. ఏప్రిల్‌ నెలలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఇరాన్ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.

డ్రోన్లు, క్షిపణులతో కువైట్ విమానాశ్రయంపై విరుచుకుపడ్డ ఇరాన్.. భారతీయుడు మృతి!
Iran Attacks On Kuwait Airport
Balaraju Goud
|

Updated on: Jun 03, 2026 | 8:09 PM

Share

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి ఒక్కసారిగా తారాస్థాయికి చేరాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించినట్లు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం (జూన్ 3, 2026) ధృవీకరించింది. ఏప్రిల్‌ నెలలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఇరాన్ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.

కువైట్, బహ్రెయిన్‌లలోని పలు వ్యూహాత్మక లక్ష్యాలపై ఇరాన్ ఏకకాలంలో క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడింది. ఈ దాడి కారణంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయ సౌకర్యాలు, దౌత్య కార్యాలయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో విమానాశ్రయ సిబ్బంది, ప్రయాణికులతో సహా కనీసం 63 మంది గాయపడినట్లు కువైట్ ఆరోగ్య మంత్రి వెల్లడించారు. దాడి నేపథ్యంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేసిన అనంతరం కువైట్ ఎయిర్‌వేస్ టెర్మినల్ 4 నుండి విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తున్నట్లు పౌర విమానయాన అథారిటీ ప్రకటించింది.

తీవ్రంగా ఖండించిన భారత్

కువైట్ విమానాశ్రయంపై జరిగిన దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. “ఈ దాడిలో ఒక భారత పౌరుడు మరణించడం, పలువురు మన దేశస్థులు గాయపడటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. మధ్యప్రాచ్యంలో ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుండి, పౌరులను, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోకూడదని మేము నిరంతరం స్పష్టంగా చెబుతూనే ఉన్నాము. ఇటువంటి దాడులను వెంటనే విరమించుకోవాలని అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాము” అని భారత్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

బహ్రెయిన్ అప్రమత్తం – రంగంలోకి అమెరికా

బహ్రెయిన్‌లోని యూఎస్ ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్ని, మరో ప్రాంతీయ దేశ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించిన వెంటనే బహ్రెయిన్ సైన్యం అప్రమత్తమైంది. ఇరాన్ ప్రయోగించిన మూడు క్షిపణులను, పలు డ్రోన్‌లను తాము విజయవంతంగా అడ్డుకున్నట్లు బహ్రెయిన్ తెలిపింది. కువైట్‌పైకి ఇరాన్ ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులు కూడా లక్ష్యాలను చేరడంలో విఫలమయ్యాయని, గాలిలోనే ముక్కలైపోయాయని అమెరికా సైన్యం పేర్కొంది.

పెరుగుతున్న చమురు ధరలు

ఈ తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా సైన్యం హోర్ముజ్ జలసంధి సమీపంలో సైనిక చర్యలను ప్రారంభించింది. హోర్ముజ్ జలసంధి చుట్టూ అనిశ్చితి కొనసాగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి చమురు ధరలు ఒక్కసారిగా 2 శాతానికి పైగా పెరిగాయి. గల్ఫ్ దేశాలలో నెలకొన్న ఈ యుద్ధ వాతావరణం అక్కడ నివసిస్తున్న లక్షలాది మంది వలసదారులలో, ముఖ్యంగా భారతీయులలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us