Bipin Rawat: భారత్ గొప్ప దేశభక్తుడిని కోల్పోయింది.. బిపిన్ రావత్ మృతికి సంతాపం తెలిపిన విదేశాలు ఇవే..
Bipin Rawat: భారతదేశ చరిత్రలో చీకటి రోజుగా 2021 డిసెంబర్ 8 వ తేదీ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ గురువారం..
Army Helicopter Crash: భారతదేశ చరిత్రలో చీకటి రోజుగా 2021 డిసెంబర్ 8 వ తేదీ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ గురువారం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయనకు 63 ఏళ్లు. ఈ విషయాన్ని భారత వైమానిక దళం ట్వీట్ ద్వారా ధృవీకరించింది. బిపిన్ రావత్ తో భార్య మధులిక సహా మరో 11 మంది కూడా విమానంలో ఉన్నారు. వారిలో ఒకటి మాత్రమే బతికి ఉంది. రావత్ అకాల మృతికి యావత్ ప్రపంచం సంతాపం తెలియజేసింది. రష్యా, అమెరికా , ఇజ్రాయెల్ నుంచి పాకిస్తాన్ వరకూ అనేక దేశాలు భారత దేశం ఒక గొప్ప దేశ భక్తుడిని కోల్పోయింది అంటూ సంతాపం తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశాయి.
అమెరికా: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ జనరల్ బిపిన్ రావత్ మృతికి సంతాపం తెలిపారు. బ్లింకెన్ మాట్లాడుతూ.. ఈరోజు ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ రావత్, ఆయన భార్య , సహచరులు మరణించినందుకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్న అని చెప్పారు. బిపిన్ రావత్ తన దేశానికి చేసిన సేవ, అమెరికా -భారత్ సంబంధాలను మరింతగా పెంచడానికి చేసిన కృషిని .. జనరల్ రావత్‌ని అసాధారణ నాయకత్వ నైపుణ్యాలను తాము ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామని అన్నారు.
అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ మాట్లాడుతూ.. “భారత-అమెరికా రక్షణ భాగస్వామ్యంపై జనరల్ రావత్ చెరగని ముద్ర వేశారు. ఈ ఏడాది జనరల్ రావత్‌ను కలిసిన సందర్భాన్ని ఆస్టిన్ గుర్తు చేసుకున్నారు.
ఇజ్రాయెల్: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెన్నీ గాంట్జ్ తన ట్వీట్టర్ ద్వారా రావత్ మృతికి సంతాపం తెలిపారు. తాను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ , భారతదేశ ప్రజల తరపున, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, అతని భార్య, ప్రాణాలు కోల్పోయిన వారందరికీ సంతాపం తెలియజేస్తున్నానని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు.
ఇజ్రాయెల్ మాజీ ప్రధాని.. సిడిఎస్ బిపిన్ రావత్ మృతి పట్ల ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంతాపం వ్యక్తం చేశారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య , మరో 11 మంది మరణించడం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డానని చెప్పారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలుపుతూ.. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్విట్ చేశారు. భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ బిపిన్ రావత్ కు నివాళులు అర్పిస్తూ తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో CDS బిపిన్ రావత్ చిత్రాన్ని పోస్ట్ చేశారు.
రష్యా: రష్యా రాయబారి మాట్లాడుతూ.. ఈ రోజు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్, మధులికా రావత్ సహా మరో 11 మంది అధికారుల విషాద మరణం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డానని అన్నారు. అంతేకాదు.. భారతదేశం ఓ గొప్ప దేశభక్తుడిని ,అంకితభావంతో కూడిన వీరుడిని కోల్పోయిందని అన్నారు.
పాకిస్తాన్: సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా ఇతర అధికారుల మృతికి పాకిస్తాన్ ఉన్నత సైనిక అధికారులు సంతాపం తెలిపారు. చాలా విచారకరమైన రోజు.. అంటూ జాయింట్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ నదీమ్ రజా , ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా ట్విట్టర్ ద్వారా తమ సంతాపం తెలిపారు. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ కూడా జనరల్ రావత్ , ఇతర అధికారుల ఆకస్మిక మృతికి సంతాపం తెలిపారు.
బంగ్లాదేశ్: ప్రమాదంలో మరణించిన జనరల్ రావత్ , ఇతర అధికారుల మృతి పట్ల బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. బాంగ్లాదేశ్ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేస్తూ.. బంగ్లాదేశ్ ఒక అద్భుతమైన స్నేహితుడిని కోల్పోయింది. భారతదేశ ప్రజలకు, మృతుల కుటుంబాలకు తమ సంతాపం తెలిపింది.
బ్రిటన్: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జనరల్ బిపిన్ రావత్ మృతికి భారతదేశంలోని బ్రిటన్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ సంతాపం వ్యక్తం చేశారు. ఇది చాలా విచారకరమైన వార్త అంటూ హిందీలో ట్వీట్ చేశారు. జనరల్ రావత్ తెలివైన వ్యక్తి, వీర సైనికుడు. కొన్ని వారాల క్రితమే ఆయనను కలిశాను అంటూ ఎల్లిస్ రావత్ ను గుర్తు చేసుకున్నారు.
శ్రీలంక: శ్రీ లంక ప్రధాని మహీంద రాజపక్స ట్విట్టర్ ద్వారా ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన జనరల్ బిపిన్ రావత్ కు సంతాపం వ్యక్తం చేశారు. భారతదేశ ప్రజలు, ప్రభుత్వం ఈరోజు తమ ప్రియమైన వారిని కోల్పోయిందని అన్నారు. మృతుల కుటుంబాలకు శ్రీలంక తరపున సంతాపం తెలియజేశారు.
భూటాన్: భూటాన్ ప్రధాన మంత్రి లోటే షెరింగ్ హెలికాప్టర్ ప్రమాదంలో CDS బిపిన్ రావత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన చాలా బాధాకరమని అన్నారు. తాను, భూటాన్ ప్రజలు.. కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నామని .. ఈ దుఃఖాన్ని భరించే శక్తి ఆకుటుంబ సభ్యులకు కలగాలని అన్నారు.
తైవాన్ : విదేశాంగ మంత్రిత్వ శాఖ మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు, ఈ క్లిష్ట సమయంలో తైవాన్ భారత్‌కు అండగా ఉంటుందని తెలిపారు.
ఆస్ట్రేలియా : భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ మాట్లాడుతూ, ‘హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన CDS జనరల్ బిపిన్ రావత్, మధులికా రావత్, ఇతర అధికారుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. జనరల్ రావత్ హయాంలో భారత్ , ఆస్ట్రేలియా మధ్య రక్షణ సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయని చెప్పారు.
నేపాల్-: తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా ఇతర సాయుధ దళాల సిబ్బంది మృతి పట్ల నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా సంతాపం తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, పలువురు డిఫెన్స్ అధికారుల విషాద మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు మరియు భారత సాయుధ దళాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు.
యునైటెడ్ నేషన్స్: యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రెస్ ఈ ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత సాయుధ దళాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మందికి సెక్రటరీ జనరల్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.