మొదట తాలిబన్ల జోరుకు అడ్డుకట్ట వేయండి…ఆఫ్ఘన్ దళాలకు అమెరికా హితవు.. కాబూల్ కు మరింత సాయం
తాలిబన్ల జోరును ఆఫ్ఘన్ దళాలు తగ్గించాలని అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కోరారు. తాలిబన్లు మరింత ముందుకు చొచ్చుకు రాకుండా కాబుల్ తదితర నగరాల చుట్టూ ఆఫ్ఘానిస్తాన్ దళాలను మోహరించాలని ఆయన సూచించారు...
తాలిబన్ల జోరును ఆఫ్ఘన్ దళాలు తగ్గించాలని అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కోరారు. తాలిబన్లు మరింత ముందుకు చొచ్చుకు రాకుండా కాబుల్ తదితర నగరాల చుట్టూ ఆఫ్ఘానిస్తాన్ దళాలను మోహరించాలని ఆయన సూచించారు. ఈ దిశగా అవి అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ కూడా వెల్లడించింది. ఇది మంచిదేనని, తొలుత తాలిబన్ల కన్నా తామే శక్తిమంతులమని ఆఫ్ఘన్ నిరూపించుకోవాల్సి ఉందని ఆస్టిన్ అభిప్రాయపడ్డారు. కాబుల్ నుంచి అమెరికా బలగాలు ఆగస్టు 31 నాటికి పూర్తిగా ఉపసంహరించుకోవచ్చునని తెలుస్తోందని. అయితే పరిస్థితిని బట్టి కొంతకాలం పొడిగించినా పొడిగించవచ్చునని కూడా ఆయన సూచనప్రాయంగా చెప్పారు. అమెరికా సేనల ఉపసంహరణ కారణంగానే తాలిబన్లు పేట్రేగుతున్నారన్నారు.
వారు ఇప్పటికే ఆఫ్ఘన్ లో సగం జిల్లాలను ఆక్రమించుకున్నట్టు వార్తలు వస్తున్నాయన్నారు. ప్రొవిన్షియల్ రాజధానులపై కూడా వారి కన్ను పడినట్టు కనిపిస్తోందని ఆస్టిన్ పేర్కొన్నారు. ఇలా ఉండగా ఆఫ్ఘన్ సైనికులకు మద్దతుగా అమెరికా తాలిబాన్లపై తమ వైమానిక దాడులను కొనసాగిస్తోంది. కాబూల్ లోని దళాలకు ఆర్థిక సహాయం కూడా చేస్తామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. ఆ దేశంలో శరణార్ధుల అవసరం కోసం ఎమర్జెన్సీ ఫండ్ నుంచి 100 మిలియన్ డాలర్ల సాయాన్ని అందజేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఆఫ్ఘన్ స్పెషల్ ఇమ్మిగ్రేషన్ వీసా అప్లికెంట్లకు కూడా ఈ సాయాన్ని ఉద్దేశించారు. అటు-తమపై అమెరికా వైమానిక దాడులను తాలిబన్లు ఖండించారు. ఇది తమకు-అమెరికాకు గతంలో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని వారు నిరసన ప్రకటించారు. ఇందుకు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందన్నారు.అటు- అమెరికా వైమానిక దాడులతో తాలిబన్ల జోరు తగ్గినట్టు తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి : రెండు డోసులతోనే డెల్టా కు చెక్..!రానున్న మరో ప్రమాదకరమైన మూడు వేరియంట్లు..:Control Delta with two doses Video.