PM Modi: మీలో అన్నను చూసుకుంటున్నాను! ప్రధాని మోదీపై భూటాన్ ప్రధాని ప్రశంసల వర్షం
భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, ప్రధాని మోడీని తన అన్నయ్య మరియు గురువుగా అభివర్ణిస్తూ ప్రశంసించారు. భారత్-భూటాన్ మధ్య బలమైన సంబంధాన్ని స్మరించుకుంటూ, మోడీ నాయకత్వంలో భారతదేశం సాధించిన అభివృద్ధిని కొనియాడారు. "మేక్ ఇన్ ఇండియా," "డిజిటల్ ఇండియా" వంటి కార్యక్రమాలను ప్రశంసించారు. భూటాన్ అభివృద్ధిలో భారత సహకారం కోసం ఆయన మోడీ సహకారాన్ని కోరారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ తనకు అన్నయ్య, గురువు లాంటి వారని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్ కంక్లేవ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టోబ్గే మాట్లాడుతూ..”ఇండియా, భూటాన్ మధ్య బలమైన ఆధ్యాత్మిక బంధం ఉంది. అందులో ఒకటి బోధిసత్వుల పట్ల వారికి ఉన్న ప్రగాఢ గౌరవం. ప్రధాని మోదీ నాకు పెద్దన్న లాంటి వారు, ఆయన తన తెలివితేటలు, ధైర్యసాహసాలు, కరుణతో కేవలం పదేళ్లోనే భారత్‌ను ప్రగతి పథంలో నడిపించారు.
సందేహం లేకుండా నేను మీలో ఒక అన్నను చూసుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ నా వెన్నంటి ఉంటూ నన్ను నడిపిస్తుంటారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఇండియాలో పెద్ద సంఖ్యలో ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఉన్నత శిఖరాలకు చేరుకుంది. మోదీ నాయకత్వంలో భారతదేశం వికసిత్ భారత్‌గా మారుతోంది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటివి ఇండియాకు మోదీ ఇచ్చిన బహుమతులు. నాయకత్వం అంటే బిరుదులు, పదవులు కాదు.. దార్శనికత, ధైర్యం, మార్పును ప్రేరేపించే సామర్థ్యం.
నాయకత్వం అంటే పరివర్తన, సమాజాన్ని సంతోషకరమైన, సంపన్నమైన, శాంతియుతమైన భవిష్యత్తువైపు నడిపించడం. భూటాన్ దేశానికి ఇండియన్స్ నుంచి బలమైన మద్దతు, దాతృత్వం లభించింది. తమ దేశంలోని గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీ ప్రాజెక్ట్‌ను భారతీయులు సందర్శించాలి. అలాగే భూటాన్‌లో ప్రజా సేవ పరివర్తనలో తనకు ప్రధాని మోదీ వ్యక్తిగత మార్గదర్శకత్వం కావాలి” అంటూ భూటాన్ ప్రధాని టోబ్గే అన్నారు. ఆయన తన ప్రసంగాన్ని జైహింద్ అంటూ ముగించారు. టోబ్గే ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ, టోబ్గే ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడూత.. టోబ్గేను తన సోదరుడిగా అభివర్ణించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
