AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Canada Gold Heist: కెనడా చరిత్రలోనే అతిపెద్ద బంగారం దోపిడీ.. పంజాబ్‌లో సూత్రధారి..!

రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన బంగారం దోపిడీ కేసులో భారత్‌కు చెందిన సిమ్రాన్ ప్రీత్ పనేసర్ అనుమానితుడిగా ఉన్నాడు. పంజాబ్ మొహాలీలోని అతని నివాసంపై ఈడీ అధికారులు దాడులు జరిపారు. కేవలం సోదాలే కాదు.. 32 ఏళ్ల సిమ్రాన్ ప్రీత్ పనేసర్‌తో పాటు ఆయన భార్య ప్రీతిని చండీగఢ్ ఈడీ కార్యాలయంలో అధికారులు రోజంతా ప్రశ్నించారు. ఇంతకీ రెండేళ్ల క్రితం టొరంటో విమానాశ్రయంలో ఏం జరిగింది? అంత పెద్ద దొంగతనం ఎలా జరిగింది?

Canada Gold Heist: కెనడా చరిత్రలోనే అతిపెద్ద బంగారం దోపిడీ.. పంజాబ్‌లో సూత్రధారి..!
Canada Gold Heist
Mahatma Kodiyar
| Edited By: Janardhan Veluru|

Updated on: Feb 22, 2025 | 11:49 AM

Share

ఢిల్లీ, 22 ఫిబ్రవరి 2025:  అది 2023 ఏప్రిల్ 17.. కెనడా దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగనంత అతి పెద్ద దొంగతనం జరిగింది. అది కూడా ఏకంగా రూ. 130 కోట్లు (20 మిలియన్ కెనడియన్ డాలర్లు) విలువైన 400 కిలోల బంగారు కడ్డీలు, కరెన్సీ కట్టలు చోరీకి గురయ్యాయి. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఆ బంగారం విలువ భారత కరెన్సీలో రూ. 200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కెనడాలోని టొరంటో నగరంలో ఉన్న పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఈ దొంగతనం జరిగింది. ఇది జరిగి రెండేళ్లు గడిచింది. కానీ ఇప్పుడు మళ్లీ ఈ అంశం కొత్తగా తెరపైకి వచ్చింది. ఇంత భారీ దోపిడీకి సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి సిమ్రాన్ ప్రీత్ పనేసర్‌ భారతీయుడు కావడం ఒక అంశమైతే.. మొహాలీ (పంజాబ్)లోని ఆయన నివాసంపై భారత దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు జరపడంతో మళ్లీ ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేవలం సోదాలే కాదు.. 32 ఏళ్ల సిమ్రాన్ ప్రీత్ పనేసర్‌తో పాటు ఆయన భార్య ప్రీతిని చండీగఢ్ ఈడీ కార్యాలయంలో అధికారులు రోజంతా ప్రశ్నించారు. ఇంతకీ రెండేళ్ల క్రితం టొరంటో విమానాశ్రయంలో ఏం జరిగింది? అంత పెద్ద దొంగతనం ఎలా జరిగింది?

స్విట్జర్లాండ్ నుంచి కెనడాకు బంగారం

2023లో స్విట్జర్లాండ్‌లో విలువైన లోహాల శుద్ధి కర్మాగారమైన వాల్కాంబి నుంచి కెనడాలోని టొరంటో-డొమినియన్ బ్యాంక్ సుమారు 400 కిలోల బంగారం తరలించే ఒప్పందం కుదిరింది. అదే ఏడాది ఏప్రిల్ నెలలో స్విస్ రిటైల్ బ్యాంక్ “రైఫీసెన్ ష్వీజ్” దాదాపు $2.7 మిలియన్ల కెనడియన్ డాలర్ల కరెన్సీ, 53 కేజీల బంగారాన్ని వాంకోవర్ బులియన్ అండ్ కరెన్సీ ఎక్స్ఛేంజ్‌కు కరెన్సీని రవాణా చేయాలనుకుంది. మొత్తంగా 2 స్విట్జర్లాండ్ కంపెనీలు పెద్ద మొత్తంలో బంగారం, కరెన్సీని కెనడాకు సురక్షితంగా తరలించేందుకు బ్రింక్స్ స్విట్జర్లాండ్ లిమిటెడ్ సంస్థ, బ్రింక్స్ ఎయిర్ కెనడా సంస్థలతో ఒప్పందం చేసుకున్నాయి. వాటిని ఒక కంటైనర్‌లో భద్రపరిచి కెనడాలోని టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేర్చడం వరకు సాఫీగానే సాగింది. కానీ ఆ తర్వాతే మొత్తం కథ ఊహించని మలుపు తిరిగింది.

నకిలీ షిప్పింగ్ డాక్యుమెంట్లతో ఘరానా చోరీ

కంటైనర్‌లో కెనడా చేరుకున్న బంగారాన్ని దోచుకునేందుకు చాలా ముందు నుంచే వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 2023 ఏప్రిల్ 17 మధ్యాహ్నం గం. 3.56కు టొరంటో పియర్సన్ ఎయిర్‌పోర్ట్ చేరుకున్న ఎయిర్ కెనడా (Air Canada 881) కార్గో విమానం నుంచి బంగారం, కరెన్సీతో కూడిన కంటైనర్‌ను దించి సాయంత్రం గం. 5.50కు ఎయిర్ కెనడా హోల్డింగ్ ఫెసిలిటీ (కంటైనర్లను తాత్కాలికంగా భద్రపరిచే ప్రాంతం)కు తరలించింది. కాసేపటికే.. అంటే సరిగ్గా సాయంత్రం గం. 6:32కు ఐదు టన్నుల ట్రక్కు ఎయిర్ కెనడా కార్గో బేకు చేరుకుంది. దాని డ్రైవర్ నకిలీ షిప్పింగ్ పత్రాన్ని సమర్పించాడు. ఎయిర్ కెనడా సిబ్బంది ఫోర్క్‌లిఫ్ట్ ఉపయోగించి బంగారం, విదేశీ కరెన్సీతో కూడిన కంటైనర్‌ను ట్రక్కుపైకి ఎక్కించారు. లోడ్ చేసిన తర్వాత, ట్రక్కు హైవే 401లో పశ్చిమాన ఉన్న డిక్సన్ రోడ్‌లో ప్రయాణించి, ఆపై మిల్టన్‌కు ఉత్తరాన ఉన్న గ్రామీణ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. కొన్ని గంటల తర్వాత, బ్రింక్స్ కెనడా ట్రక్ ఆ షిప్‌మెంట్‌ను తీసుకోవడానికి వచ్చింది. ఆ ట్రక్ సిబ్బంది తమ దగ్గరున్న అసలైన షిప్పింగ్ డాక్యుమెంట్లను చూపించారు. ఎయిర్ కెనడా సిబ్బంది ఆ కంటైనర్‌ కోసం వెతికారు. కాసేపటి తర్వాత వారికి అసలు విషయం అర్థమైంది. నకిలీ పత్రాలతో ఆ కంటైనర్‌ను అప్పటికే తీసుకెళ్లిపోయారని గ్రహించిన సిబ్బంది విషయాన్ని కెనడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సాధారణంగా కార్గో విమానాల్లో వచ్చే సరుకును వేబిల్, ఇతర షిప్పింగ్ డాక్యుమెంట్లను చూపించి సంబంధిత వ్యాపార సంస్థలు తీసుకెళ్తుంటాయి. ఆ రకంగా అక్కడ జరిగే రోజువారీ కార్యాకలాపాలను గమనించిన ఘరానా దొంగలు.. ముందు రోజు సముద్ర ఆహార కంటైనర్ కోసం ఉపయోగించిన వేబిల్‌, షిప్పింగ్ డాక్యుమెంట్లలో మార్పులు చేసి.. బంగారం కంటైనర్‌ను కొట్టేశారు.

కెనడాలో తీగలాగితే.. పంజాబ్‌లో డొంక కదిలింది

కెనడా పోలీసుల దర్యాప్తులో ఈ దొంగతనానికి ప్రధాన సూత్రధారి సిమ్రాన్ ప్రీత్ పనేసర్‌గా గుర్తించారు. అతిపెద్ద బంగారు దోపిడీలో పాల్గొన్న 9 మంది అనుమానితులలో పనేసర్ ఒకరు. దొంగతనం జరిగిన వెంటనే ఆయన కెనడా వదిలి భారత్‌కు పారిపోయినట్టు కెనడియన్ రికార్డుల్లో ఉంది. కెనడా అధికారులు ఇచ్చిన సమాచారం.. దర్యాప్తులో వెల్లడైన విషయాల ఆధారంగా ఫిబ్రవరి 21 (శుక్రవారం) నాడు మొహాలీలోని సెక్టార్ 79లోని పనేసర్ ఇంట్లో ఉదయం గం. 7.00 నుంచి ED అధికారులు దాడులు ప్రారంభించారు. ఉదయం గం. 9.00 తర్వాత, పనేసర్, ఆయన భార్య ప్రీతిని చండీగఢ్ ED కార్యాలయంలో ప్రశ్నించారు. ఈడీ విచారణలో ఏం బయటపడింది అన్న విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే తాము పనేసర్ నివాసంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నామని, వాటిని విశ్లేషిస్తున్నామని ఈడీ అధికారులు తెలిపారు. అలాగే హోషియార్‌పూర్‌లోని అతని మామ వ్యాపార సంస్థలను కూడా సోదాలు చేసినట్టు తెలిపారు.

Canada Gold Heist Case

Canada Gold Heist Case

కెనడా దర్యాప్తులో వెల్లడైన సమచారం ప్రకారం దొంగతనం జరిగిన సమయంలో పనేసర్ ‘ఎయిర్ కెనడా’ కార్యకలాపాల నియంత్రణ విభాగంలో తాత్కాలిక పర్యవేక్షకుడిగా ఉన్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరం నుంచి వస్తున్న విమానంలో బంగారం, విదేశీ కరెన్సీతో కూడిన కంటైనర్ వస్తున్న సమాచారం పనేసర్ దగ్గర ఉంది. ఆ సమయంలో సిమ్రాన్‌ప్రీత్ పనేసర్ కెనడాలోని బ్రాంప్టన్‌లో నివసించేవాడు. దోపిడీ జరిగిన వెంటనే పనేసర్ కెనడా వదిలి భారతదేశానికి తిరిగొచ్చేశాడు. దొంగతనం జరిగిన తర్వాత సీసీటీవీలు, ఫోన్ కాల్స్, ఇతర అంశాలను పరిశీలించిన కెనడా దర్యాప్తు అధికారులు బంగారాన్ని తీసుకెళ్లే విమానం గురించే ఎక్కువగా సంభాషించినట్టు గుర్తించారు. ఆ కంటైనర్‌ను అడుగడుగునా ట్రాక్ చేస్తూ.. చివరకు తెలివిగా నకిలీ వే బిల్లులు, డాక్యుమెంట్లతో కంటైనర్‌ను ఎత్తుకెళ్లిపోయారు. ఇప్పుడు ఈడీ దాడులతో రెండేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘరానా చోరీ ఉదంతంలో తదుపరి ఎలాంటి విషయాలు బయటికొస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.