Bangladesh: ‘నమాజ్‌ వేళల్లో దుర్గా పూజలో సంగీత వాయిద్యాలు మోగించొద్దు’.. మతసామరస్యానికి బంగ్లా పిలుపు

నమాజ్‌, అజాన్‌ వేళల్లో సంగీత వాయిద్యాలు వాయించవద్దని హిందూ కమిటీలకు బంగ్లాదేశ్‌ హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఎండీ జహంగీర్ ఆలం చౌదరి విజ్ఞప్తి చేశారు. పూజ కమిటీలు కూడా తమ అభ్యర్థనను అంగీకరించాయని ఆయన తెలిపారు..

Bangladesh: 'నమాజ్‌ వేళల్లో దుర్గా పూజలో సంగీత వాయిద్యాలు మోగించొద్దు'.. మతసామరస్యానికి బంగ్లా పిలుపు
Md Jahangir Alam Chowdhury
Follow us

|

Updated on: Sep 13, 2024 | 8:41 AM

ఢాకా, సెప్టెంబర్ 13: నమాజ్‌, అజాన్‌ వేళల్లో సంగీత వాయిద్యాలు వాయించవద్దని హిందూ కమిటీలకు బంగ్లాదేశ్‌ హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఎండీ జహంగీర్ ఆలం చౌదరి విజ్ఞప్తి చేశారు. పూజ కమిటీలు కూడా తమ అభ్యర్థనను అంగీకరించాయని ఆయన తెలిపారు. ఢాకా సెక్రటేరియట్‌లో దుర్గాపూజకు ముందు శాంతిభద్రతలను సమీక్షించిన అనంతరం చౌదరి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దసరా సందర్భంగా బంగ్లాదేశ్‌లో ఈ ఏడాది మొత్తం 32,666 వేదికలు ఏర్పాటు చేయనున్నాట్లు తెలిపారు. వీటిలో 157 మండపాలు ఢాకా సౌత్ సిటీలో, 88 నార్త్ సిటీ కార్పొరేషన్లలో ఉంటాయని ఢాకా ట్రిబ్యూన్ నివేదించినట్లు పేర్కొన్నారు. గతేడాది కంటే ఈ సారి మరింత ఎక్కువ మండపాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు (గతేడాది 33,431 ఏర్పాటు చేశారు). మతసామరస్యం అవసరమని, ఆజాన్, నమాజ్ సమయాలలో దుర్గాపూజకు సంబంధించిన కార్యక్రమాలను, ముఖ్యంగా సౌండ్ సిస్టమ్‌లను స్విచ్ ఆఫ్‌లో ఉంచాలని హిందూ కమ్యునిటీలను కోరామని, నిర్వహకులు కూడా అంగీకరించారని తెలిపారు. నమాజ్ చేసే సమయంలో ఇటువంటి కార్యకలాపాలు నిలిపివేయాలని, ఆజాన్‌కు ఐదు నిమిషాల ముందు నుంచి పూజాది కార్యకలాపాలకు విరామం పాటించాలన్నారు.

మాజీ ప్రధాని షేక్ హసీనా బహిష్కరణ తర్వాత ఆ దేశంలోని మైనారిటీ హిందూ సమాజంపై దాడులు పెరిగిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన వారాల వ్యవధిలోనే అక్కడ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో బంగ్లాదేశ్‌లోని మతపరమైన మైనారిటీల, ముఖ్యంగా హిందువుల భద్రత గురించి ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఇటీవల షా షోరాన్‌ మందిరంలో దాడులు జరిగాయి. దీంతో మత పరమైన ప్రదేశాల భద్రత సందేహాస్పదంగా మారింది. దీనిపై చౌదరిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. షా పోరాన్‌ మందిరంపై జరిగిన దాడి గురించి తనకు తెలియదన్నారు. అయితే భద్రత గురించి చర్యలు తీసుకోవడం తన బాధ్యత అన్నారు. భద్రత విషయంలో చట్టపరమైన చర్యలు అమలు చేసేవారికి అదేశాలు ఇవ్వబడ్డాయన్నారు. విగ్రహాల తయారీ నుంచి దసరా చివరి రోజు వరకు పూజా నిర్వాహకులకు భద్రత కల్పిస్తామని చౌదరి హామీ ఇచ్చారు. పూజ మండపాల వద్ద 24 గంటల భద్రతపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. సంఘ విద్రోహ శక్తుల చెడు కార్యకలాపాలను అరికడతామని అని ఆయన మీడియాకు తెలిపారు. బంగ్లాలో అతిపెద్ద మతపరమైన పండుగ అయిన దుర్గాపూజకు ముందు దేశంలో శాంతిభద్రతలపై జరిగిన సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ మత సామరస్యానికి పిలుపునిచ్చారు. దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ముహమ్మద్ యూనస్ మాట్లాడుతూ.. ‘మనది మత సామరస్యం ఉన్న దేశం. మత సామరస్యాన్ని ధ్వంసం చేసే ఏ చర్యను సహించబోం. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దు. ఎవరైనా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని సమాజంలో అస్తవ్యస్తమైన వాతావరణాన్ని సృష్టిస్తే, ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని గురిచేస్తున్నాం’ అని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.