Telangana: ‘ఏం తప్పు చేశానమ్మా?’ ఊరి బయట చిమ్మ చీకట్లో చెట్ల పొదల్లో ఆడ శిశువు ఆక్రందనలు
అన్ని చోట్ల దేవుడు ఉండలేక అమ్మను సృష్టించినట్లు అందరూ చెబుతారు. అమ్మ ప్రేమ ముందు అన్నీ దిగదుడుపే. అలాంటి మాతృ హృదయం కూడా కలుషితమై పోతుంది. బండరాయిలా మారిపోతుంది. పేగు ప్రేమను కాదనుకుని చేజేతులా కన్న బిడ్డలను మృత్యువుకి అప్పగిస్తున్నారు నేటి తరం అమ్మలు. ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటి మరో బాధకర సంఘటన..
దేవరకద్ర, సెప్టెంబర్ 12: అన్ని చోట్ల దేవుడు ఉండలేక అమ్మను సృష్టించినట్లు అందరూ చెబుతారు. అమ్మ ప్రేమ ముందు అన్నీ దిగదుడుపే. అలాంటి మాతృ హృదయం కూడా కలుషితమై పోతుంది. బండరాయిలా మారిపోతుంది. పేగు ప్రేమను కాదనుకుని చేజేతులా కన్న బిడ్డలను మృత్యువుకి అప్పగిస్తున్నారు నేటి తరం అమ్మలు. ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటి మరో బాధకర సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం చోటు చేసుకుంది. తెల్లవారు జామున ఊరి బయట చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన పసికందు ఆక్రమందనలు మిన్నంటాయి. ఒక్కసారిగా అంతా పరుగుపరుగున వచ్చారు. కానీ కన్నతల్లి మాత్రం దరిదాపుల్లో లేకుండా పారిపోయింది. వివరాల్లోకెళ్తే..
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామ సమీపంలోని చెట్ల పొదల్లో బుధవారం ఉదయం 6:30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును వదిలేసి వెళ్లిపోయారు. తెల్లవారు జామున దేవరకద్ర సహకార సంఘం అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి వాకింగ్‌కి వెళ్తుండగా.. రోడ్డు పక్కల శిశువు ఏడుపు వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా గోతం బస్తాలో అప్పుడే పుట్టిన ఆడ శిశువు కనిపించింది. శిశువుకు చీమలు పట్టి, కుట్టి ఉండటం చూసి వెంటనే చేతుల్లోకి తీసుకుని రక్షించాడు. అనంతరం అంగన్‌వాడీ కార్యకర్త విజయలక్ష్మికి సమాచారం అందించాడు. ఆమె అక్కడికి చేరుకొని పసికందును స్థానిక దవాఖానకు తరలించి, వైద్యం అందించింది. గాయాలకు చికిత్స చేసి, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్సై నాగన్న శిశువును ఐసీడీఎస్ కేంద్రానికి తరలించారు.
మరో ఘటన: వరాహానికి పాలిచ్చిన గోమాత
జాతి వైరం మరచి వరాహానికి ఓ ఆవు పాలిచ్చి ఆకలి తీర్చింది. ఈ సంఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో చోటుచేసుకుంది. బుధవారం స్థానిక శ్రీ సాయివాణి కల్యాణమండపం ప్రాంగణంలో ఓ ఆవు కూర్చొని సేద తీరుతుంది. ఇంతలో ఓ పంది.. ఆవు వద్దకు వెళ్లి పాలు తాగడం ప్రారంభించింది. సామాన్యంగా ఆవులు ఇతర జంతువులకు పాలు అందించవు. కానీ మాతృత్వానికి మారుపేరుగా చెప్పుకునే గోమాత.. ఆకలితో వచ్చిన పందికి చనుబాలు అందించి ఆకలి తీర్చింది. ఈ విచిత్ర ఘటనను స్థానికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఆవు మాతృత్వాన్ని అందరూ ప్రశంశిస్తున్నారు.