Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో కట్టప్ప, ఒకప్పుడు తాలిబన్ కసాయి.. ఇప్పుడు వారికి ఆప్తమిత్రుడు..

Afghanistan Crisis: తాలిబన్ల చెరకు చిక్కిన ఆఫ్గనిస్తాన్.. వారి అరాచకానికి అట్టుడికిపోతోంది. తాలిబన్ల పేరు వింటేనే అక్కడి ప్రజలు జడుసుకుంటున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని...

Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో కట్టప్ప, ఒకప్పుడు తాలిబన్ కసాయి.. ఇప్పుడు వారికి ఆప్తమిత్రుడు..
Gul Agha Sherzai
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 24, 2021 | 10:59 PM

Afghanistan Crisis: తాలిబన్ల చెరకు చిక్కిన ఆఫ్గనిస్తాన్.. వారి అరాచకానికి అట్టుడికిపోతోంది. తాలిబన్ల పేరు వింటేనే అక్కడి ప్రజలు జడుసుకుంటున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. చాలా మంది ఆఫ్గన్ ప్రజలు దేశం విడిచి పారిపోయేందుకు తీవ్రంగా ప్రయత్ని్స్తున్నారు. ఈ క్రమంలోనే ఆఫ్గన్ జనాలు కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. తమను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలంటూ ఇతర దేశాలకు చెందిన భద్రతా బలగాలను వేడుకుంటున్నారు. ఇదంతా అక్కడి ప్రజల దయనీయ పరిస్థితికి అద్దం పడుతుంటే.. మరోవైపు అక్కడి రాజకీయాలు కూడా చాలా హాట్‌ హాట్‌గా నడుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఆఫ్గనిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకప్పుడు తాలిబన్లకు పూర్తి వ్యతిరేకి అయిన అతను.. నేడు పూర్తిగా మారిపోయి మద్ధతు పలుకుతున్నాడు. ఇంతకీ ఆ నేత ఎవరు..? అతని కహానీ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆప్ఘన్ రాజకీయాల్లో ఆఘా షేర్జాయ్ పేరు తెలియని వారు ఉండరు. 20 ఏళ్లుగా ఆఫ్గన్ రాజకీయాల్లో కీలక నేత. ఎత్తుగా, దృఢంగా ఉండే గుల్ నేత. ఇతన్ని జబ్బా ద హట్ (స్టార్‌ వార్ సిరీస్‌లో అత్యంత బలమైన గాంగ్‌స్టర్) గా టైమ్స్ పత్రిక వర్ణించింది. కాందహార్, నంగర్ హార్ గవర్నర్‌ గా సేవలు అందించాడు. హేరాత్ గవర్నర్ పదవి కూడా ఇవ్వాలని అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌ ను అడిగాడు. ఆ మూడు ప్రావిన్సుల మీద అతనికి ప్రత్యేక ఆసక్తి ఉంది. కారణం.. ఇరాన్, పాకిస్తాన్‌లకు ఉన్న వాణిజ్య మార్గాలు ఆ మూడు ప్రాంతాల నుంచే వెళ్తుంటాయి. తద్వారా ఆ మార్గాల్లో చాలా డబ్బు సంపాదించవచ్చు. కాగా, అష్రఫ్ గనీ పాలనలో తాలిబన్లకు వ్యతిరేకంగా షేర్జాయ్ పని చేశాడు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారడంతో.. షేర్జాయ్ ప్లేట్ ఫిరాయించాడు. తాజాగా తాలిబన్లకు మద్దతు పలికాడు. ఆఫ్గనిస్తాన్ బుల్‌ డోజర్‌గా పేరొందిన షేర్జాయ్.. ప్రస్తుతం ఇస్లామిక్ ఎమిరేట్స్ వైపునకు మళ్లాడు.

సీఐఏ మాజీ ఏజెంట్ వార్లార్డ్ అయిన గుల్ ఆఘా షేర్జాయ్.. 2003 వరకు కాందహార్, నంగర్ హార్ ప్రాంతాలకు గవర్నర్ గా పని చేసి ప్రజల మెప్పు పొందాడు. 2001లో నాటో బలగాలకు నేతృత్వం వహించిన అమెరికాకు సాయం అందించాడు. తాలిబాన్లను తరిమికొట్టడానికి గుల్ ఆఘా షేర్జాయ్ అమెరికాకు మద్దతు ప్రకటించాడు. దక్షిణ ప్రావిన్స్ కాందహార్లో సీఐఏతో కలిసి తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరు సాగించాడు. అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ మొదట అధికారంలోకి రాకముందు కాందహార్ ప్రావిన్స్ గవర్నర్‌గా పని చేశాడు. 2001లో తాలిబాన్‌ అధికారం కోల్పోయేవరకూ షేర్జాయ్ కాందహార్ బయటే ఉన్నాడు. తాలిబాన్లు వెళ్లాక మళ్లీ కాందహార్ చేరుకుని గవర్నర్ పదవిలో కొనసాగారు. సీఐఏకు, అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌కు షేర్జాయ్ అత్యంత సన్నిహితంగా మెలిగాడు. 2005 నుంచి 2013 వరకూ నంగర్‌హార్ గవర్నర్ గా పని చేశాడు.

సీన్ రివర్స్.. తాజాగా తాలిబన్ల కాబూల్ ఆక్రమణతో బుల్‌ డోజర్ వ్యవహారం మారింది. ఆఫ్గనిస్తాన్‌ను ఆక్రమించిన నేపథ్యంలో షేర్జాయ్‌ మద్ధతు కోరుతూ తాలిబన్లు పలు దఫాలు చర్చలు జరిపారు. తమకు సహకరించాలని తాలిబన్లు కోరారు. తాలిబన్ల ప్రతిపాదనకు బుల్ డోజర్ ఒప్పుకున్నారు. తాలిబాన్ పట్ల విశ్వాసంతో ఉంటానని తాజాగా ప్రమాణం కూడా చేశారు. కాగా, గుల్ ఆఘా షేర్జాయ్ తమ ప్రభుత్వంలో భాగం అవుతున్నట్లు తాలిబన్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

అయితే, ఆప్ఘన్ బుల్ డోజర్ కాస్తా తాలిబన్ బుల్ డోజర్ మారడం పట్ల ఆ దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుల్ ఆఘా షేర్జాయ్ గవర్నర్ ఉన్న సమయంలో ప్రావిన్సుల్లో పర్యటించేవారు. ప్రజల సమస్యలు పరిష్కరించే వారు. రోడ్ల నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేశారు. మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ నెట్‌వర్క్ క్రియేషన్ పట్ల ఆసక్తి చూపేవారు.

బుల్ డోజర్ పేరు ఎందుకంటే.. గుల్ ఆఘా షేర్జాయ్ కు ఓ ప్రైవేటు కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఉంది. దాని ద్వారా రోడ్లు వేయించేందుకు హెవీ వెహికల్స్ ఉపయోగించే వాడు. అలా గుల్ ఆఘా షేర్జాయ్ రోడ్ల నిర్మాణాలకుగాను పెద్ద పెద్ద వెహికల్స్ వినియోగించేవాడు. అందులో బుల్ డోజర్లు ఉండేవి. రోడ్ల నిర్మాణం గురించి ప్రజలు అడగడమే ఆలస్యం బుల్ డోజర్లు పంపేవాడు. అలా ఆయనకు ‘బుల్ డోజర్’ అనే పేరొచ్చింది. అంతేకాదు.. ఆఫ్గనిస్తాన్లో 2014లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ ఆయన గుర్తు ‘బుల్ డోజరే’. అప్పుడు ప్రజల పక్షాన ఉన్న గుల్ ఆఘా షేర్జాయ్.. ఇప్పుడు తాలిబన్ల పక్షాన చేరడంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా తాలిబన్లు విడుదల చేసిన వీడియోలో గుల్ ఆఘా షేర్జాయ్ మాట్లాడాడు. ఇస్లాం ఎమిరేట్ అమీర్-ఉల్-మొమీనిన్ తరఫున ఆఫ్గనిస్తాన్‌ను నిర్మించే బుల్ డోజర్ అవుతానని షేర్జాయ్ ప్రకటించాడు.

సంగీతం అంటే ఇష్టం.. షేర్జాయ్‌కు సంగీతం అంటే చాలా ఇష్టం. చాలా సార్లు పాటలు కూడా పాడేవారు. షేర్జాయ్ పాడిన “రాకా జామ్ రాకా జామ్” అనే ఒక పష్తో పాట విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ పష్తో పాట చాలా మందికి ఫేవరెట్.

Also read:

Hyderabad: తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఇంటెలిజెన్స్ బ్యూరో అడిషనల్ డీజీగా అనిల్ కుమార్..

Trivikram Srinivas: ఆ సినిమా చూసిన తర్వాతే సుశాంత్‌ను నా సినిమాలోకి తీసుకున్నా.. త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్

Adilabad: అడవి తల్లుల గోస.. ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం.. టీవి9 వరుస కథనాలకు స్పందన..