Afghanistan Crisis: అమెరికా అనాలోచిత నిర్ణయం.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన.. మరి భారత్ పరిస్థితి ఏంటి?
గాంధార దేశంగా భారతీయులు పిలుచుకునే అఫ్గానిస్తాన్..నేడు విషాద గాంధార స్వరాలాపనతో రోధిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జోయ్ బైడెన్ తాను ఆగమేఘాల మీద తీసుకున్న మిలిటరీ బలగాల ఉపసంహరణ నిర్ణయాన్ని సమర్థించుకోనీగాక.. అది తొందరపాటు నిర్ణయమే...
Afghanistan Crisis worries entire Globe: గత వారం, పది రోజులుగా ఏ మీడియా చూసినా.. ఏ న్యూస్ పేపర్ చదివినా అఫ్గానిస్తాన్ వార్తలే అధికంగా వుంటున్నాయి. తాలిబన్ల పెత్తనంలో బతకలేమంటూ.. బతుకు జీవుడా అంటూ దేశం విడిచిపోయేందుకు యత్నిస్తున్న వేలాది మంది పడుతున్న పాట్లను చూసి.. పాపం అనుకోని మనిషి వుండకపోవచ్చు. బతుకు భయంతో ఎలాగోలా దేశం దాటిపోతే చాలు బాబూ అనుకుంటూ.. విమానం టైర్ల మీద కూర్చునేందుకు దుస్సాహసం చేసి, ప్రాణాలు కోల్పోయిన అఫ్గానీలను చూసి అందరి మనస్సులు చలించిపోయాయి. లిమిటెడ్ ప్యాసెంజర్ల కంటే ఒక్కరిని కూడా అదనంగా అనుమతించని విమానాల్లో లెక్కకు మించి ప్రయాణీకులు జర్నీ చేసిన ఉదంతం చూశాం. అమెరికన్ మిలిటరీ విమానంలో ఏకంగా 823 మంది ప్రయాణం చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పాలు కూడా దొరకని పసిపిల్లలు… మూతబడ్డ షాపులు… బ్యాంకులు… ఎప్పుడెవరు దాడి చేస్తారో, ఎక్కడ దాక్కోవాలో తెలియని ప్రజలు… స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయిన మహిళలు.. ఇలా ఎవరినీ చూసినా హృదయ విదారక పరిస్థితే. ఉన్నదంతా వదిలేసి పిల్లా జెల్లాతో పారిపోతే చాలని విమానాశ్రయంలో పరుగులు తీస్తున్న అఫ్గానీలు… సాయుధ తాలిబన్ల పహారాలో స్మశాన నిశ్శబ్దం. 50 లక్షల మందికి నివాసమైన అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఈ దృశ్యాలను చూస్తే, గుండె కలుక్కుమంటుంది. దేశంలో మూడు కోట్ల 80 లక్షల ప్రజలుంటే.. వారందరికీ లక్షలోపే వున్న తాలిబన్లంటే భయం. వారు గతంలో చూపిన నరకాన్ని గుర్తు చేసుకుని వణికిపోతున్నారు. అపురూప కళా, సంస్కృతులకు నెలవైన అఫ్గానిస్తాన్ ఎప్పుడు నెత్తుటి నేలగా మారుతుందోనన్న భయాందోళన. గాంధార దేశంగా భారతీయులు పిలుచుకునే అఫ్గానిస్తాన్..నేడు విషాద గాంధార స్వరాలాపనతో రోధిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జోయ్ బైడెన్ తాను ఆగమేఘాల మీద తీసుకున్న మిలిటరీ బలగాల ఉపసంహరణ నిర్ణయాన్ని సమర్థించుకోనీగాక.. అది తొందరపాటు నిర్ణయమే అని చెప్పక తప్పదు. మిలిటరీ ఉపసంహరణ, అఫ్గాన్ ప్రభుత్వ వైఫల్యం, ఆ దేశ సైనికుల అవినీతి, అసమర్థత, అంతర్జాతీయ సమాజం నిర్లిప్తత ఇలా కారణాలేవైతేనేం.. నేడవి అఫ్గానీల పట్ల శాపంగా మారాయి. దేశం కాని దేశాలకు ఉత్త చేతులతో వెళ్ళి ఏదో ఒకలా బతికితే చాలంటూ పారిపోయేలా చేశాయి. అఫ్గాన్‌ను అప్పనంగా ఉగ్రవాద మూక తాలిబన్లకు అప్పగించాయి. అమెరికాపై తాలిబన్ల దాడితో అహం దెబ్బ తిన్న అగ్రరాజ్యం ‘తీవ్రవాదం పోరు’ అంటూ ఇరవై ఏళ్ళ క్రితం మొదలెట్టిన పనికి ఇప్పుడు అర్థం లేకుండా పోయింది. 3 లక్షల కోట్ల డాలర్ల ఖర్చు, వేలాదిగా మిలిటరీ లాస్ ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరైపోయాయి.
ఏదో ఒకనాడు అమెరికా, నాటో దళాల ఉపసంహరణ జరగాల్సిందే. కానీ తాను ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా.. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నెలన్నర కాలంలోనే అనూహ్యంగా అఫ్గాన్ నుంచి అమెరికన్ మిలిటరీ దళాల ఉపసంహరణకు బైడెన్ ప్రకటన చేశారు. చేయడమే కాదు.. అందుకు షెడ్యూలును కూడా ప్రకటించేశారు. దాంతో తాలిబన్లకు తమ దురాక్రమణకు కావాల్సినంత సమయం దొరికింది. అఫ్గాన్ భవితకు ఏర్పాట్లు చేయకుండానే, అక్కడి సిటిజెన్ల రక్షణకు రంగం సిద్దం చేయకుండానే.. తాలిబన్లను నియంత్రించే మెకానిజాన్ని డెవలప్ చేయకుండానే.. ఎలాగోలా అఫ్గాన్ నుంచి తమ దళాలు వెనక్కి వచ్చేస్తే చాలన్నట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రవర్తించారు. ఒక రకంగా చెప్పాలంటే బైడెన్ ది స్ట్రాటెజికల్ మిస్టేక్. ఆ తప్పిదం ఇప్పుడు ఓ మానవ సంక్షోభానికి దారి తీసింది. అంతర్జాతీయంగా అమెరికాకు మకిలినంటించింది. అఫ్గానీయులకు తిప్పలు మిగిల్చింది. 2020 ఫిబ్రవరిలో దోహాలో తాలిబన్లతో అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందంలో అనేక లోపాలున్నాయి. అమెరికా గత అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఆ నిర్ణయాన్నే కొత్త ప్రెసిడెంట్ బైడెన్ సైతం కొనసాగించడం అఫ్గాన్‌లో అస్థిరతకు కారణమైంది. తాజా పరిణామాలతో విహారయాత్ర నుంచి హుటాహుటిన తిరిగొచ్చిన బైడెన్ తప్పంతా తాలిబన్లతో పోరాడకుండా లొంగిపోయిన అఫ్గాన్ ప్రభుత్వానిదే అన్నట్టు మాట్లాడారు. తమకెలాంటి ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోవాల్సింది, పోరాడాల్సింది అఫ్గానీయులే అంటూ నమ్మబలికారు.
ప్రజాస్వామ్యం పోయి, తాలిబన్ల చేతిలోకి అఫ్గాన్ రావడం సహజంగానే భారత్ లాంటి శాంతికాముక దేశాలకు నచ్చదు. కానీ పాక్, చైనా, టర్కీ లాంటివి కొత్త పాలనలో స్వప్రయోజనాలను వెతుక్కుంటున్నాయి. ఇరవై ఏళ్ళ క్రితంతో పోలిస్తే, ఇప్పుడు తాలిబన్లు మారిపోయారంటున్నారు. కానీ, వారి మాటలే తప్ప చేతలు మారాయా.. మారతాయా అన్నది డౌటే. ప్రపంచం తమను గుర్తించాలని కోరుతున్న తాలిబన్లు ఎవరికీ హాని చేయబోమంటున్నారు. అందరికీ క్షమాభిక్ష పెడతామంటున్నారు. కానీ, అదే సమయంలో కఠినమైన, మహిళల హక్కులను హరించే షరియత్‌ను అమలు చేసి తీరతామంటున్నారు. మహిళలు ఉద్యోగం చేసుకోవచ్చు కానీ, హిజాబ్ కంపల్సరీ అంటున్నారు. పక్కన మగ తోడు లేకుండా రోడ్డెక్క వద్దంటున్నారు. ఇప్పటికే వివిధ ప్రావిన్స్‌లలో తాలిబన్ పోరాట యోధులనిచ్చి పెళ్ళి అనే ముసుగులో, మహిళల లైంగిక బానిసత్వానికి తెర తీసినట్టు కథనాలు వస్తున్నాయి. వీధుల్లో మహిళల పోస్టర్లు, సెలూన్లకు నల్లరంగులు పూస్తున్నారు. టీవీలో వినోదం స్థానంలో ఇస్లాం మత బోధనలు ప్రారంభమయ్యాయి. స్వేచ్ఛకు సంకెళ్ళు పడ్డ ఈ వార్తలే ఇకపై అఫ్గాన్ నుంచి వినాలి. అది చేదు నిజం.
నిజానికి, తాలిబన్ల గత పాలనకు అమెరికా దళాలు చరమగీతం పాడిన 2001 నాటికీ, ఇప్పటికీ అఫ్గాన్ చాలా పురోగతి సాధించింది. ఒకప్పుడు అక్కడ ఆడపిల్లల చదువులే నిషిద్ధమైతే, ఇప్పుడు విద్యార్థుల్లో వాళ్ళు 39 శాతానికి పెరిగారు. అఫ్గాన్ జీడీపీ 4 బిలియన్ డాలర్ల నుంచి 20 బిలియన్ డాలర్లకు చేరింది. సగటు ఆయువు 56 నుంచి 65 ఏళ్ళకు పెరిగింది. అఫ్గాన్ అభివృద్ధిలో భారత్ ఇప్పటికి 3 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. మన నుంచి ఆ దేశానికి 80 కోట్ల డాలర్ల మేర ఎగుమతులు జరుగుతున్నాయి. తాలిబన్ల విజృంభణతో ఇవన్నీ నిలిచిపోయే పరిస్థితి. అఫ్గాన్ అభివృద్ధికీ, పునర్నిర్మాణానికీ కట్టుబడిన భారత ప్రభుత్వం ఇరకాటంలో పడింది. తాలిబన్లను పూర్తిగా దూరం పెట్టి, భౌగోళికంగా కీలకమైన ప్రాంతాన్ని పాక్, చైనాల ఇష్టారాజ్యంగా వదిలేయలేం. అలాగని తీవ్రవాద మూకలతో చర్చించలేం. ఈ సందిగ్ధంలో ఖతార్ లాంటి సన్నిహిత దేశాల సాయం తీసుకోవాలి. అఫ్గాన్ పునర్నిర్మాణంలో భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగేలా చూసుకోవడం కొంత తెలివైన పని.
అఫ్గాన్ తాజా పరిణామాలపై పాకిస్తాన్, చైనా, రష్యా, టర్కీ లాంటి దేశాలు తాత్కాలికంగా ఆనందించవచ్చు గాక.. కానీ సమీప భవిష్యత్తులో ఆయా దేశాలకు తాలిబన్లు కంటగింపుగా మారే పరిస్థితి తథ్యం. తమ అడుగులకు మడుగులొత్తే వరకే పాకిస్తాన్ అంటే తాలిబన్లు ప్రేమాభిమానాలు చూపుతారు. ఆ తర్వాత పశ్చిమ పాకిస్తాన్ లోతుపాతులన్నీ తెలిసిన తాలిబన్లు.. వాటిని ఉగ్ర స్థావరాలుగా మార్చడం ఖాయం. ఇటు తాలిబన్లను గుర్తిస్తామంటూనే చైనా అప్పుడే కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తోంది. తీవ్రవాద సంస్థల స్వర్గధామంగా అఫ్గానిస్తాన్‌ని మార్చేస్తామంటే ఊరుకునేది లేదని వారం రోజుల క్రితమే చైనా తాలిబన్లను హెచ్చరించింది. ఇటు టర్కీ.. అటు రష్యాలు సైతం అమెరికా వైఖరిని ఎండగట్టేందుకు ప్రస్తుతానికి తాలిబన్లకు మద్దతు పలుకుతున్నాయి. కానీ.. దీర్ఘకాలంలో వీరి వైఖరి మారే అవకాశాలు పుష్కలం. ఇక మన దేశం విషయానికి వస్తే.. ఇండియా ఇప్పుడు గతంలో మాదిరిగా లేదు. 1996లో తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్నప్పటి ఇండియాకు.. ప్రస్తుతం ఇండియాకు చాలా తేడా వుంది. అదేసమయంలో కశ్మీర్ వంటి ఏరియాలో తీవ్రవాద కలాపాలను 70, 80 శాతం నియంత్రించగలుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఇండియాలో చిచ్చు రేపే అవకాశం తాలిబన్లకు మన దేశం ఇవ్వబోదనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాంటప్పుడు తాలిబన్ల విషయంలో భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న విశ్లేషణలు ప్రచురితం అవుతున్నాయి. ఏది ఏమైనా ఒక్క అమెరికా అనాలోచితంగా వేసిన అడుగు.. తీసుకున్న నిర్ణయం ఇపుడు యావత్ ప్రపంచం తప్పుపడుతోంది. దీని పర్యవసనాలపై ఆందోళన చెందుతోంది.