AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parenting: నాన్న మొదటి హీరో.. పిల్లల ప్రవర్తన, భవిష్యత్తుపై తండ్రి ప్రభావం ఎంత?

పిల్లలకు వారి నాన్నే మొదటి హీరో. ఇంటి వాతావరణం ఆరోగ్యకరంగా ఉంటేనే, పిల్లల మానసిక ఆరోగ్యం కూడా బలంగా ఉంటుంది. ప్రత్యేకించి, తండ్రి ఇంట్లో ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మాట్లాడుతారు అనే అంశాలు పిల్లల మనసులో లోతుగా నాటుకుపోతాయి. తండ్రి అంటే కేవలం ..

Parenting: నాన్న మొదటి హీరో.. పిల్లల ప్రవర్తన, భవిష్యత్తుపై తండ్రి ప్రభావం ఎంత?
Father (2)
Nikhil
|

Updated on: Dec 06, 2025 | 11:23 AM

Share

పిల్లలకు వారి నాన్నే మొదటి హీరో. ఇంటి వాతావరణం ఆరోగ్యకరంగా ఉంటేనే, పిల్లల మానసిక ఆరోగ్యం కూడా బలంగా ఉంటుంది. ప్రత్యేకించి, తండ్రి ఇంట్లో ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మాట్లాడుతారు అనే అంశాలు పిల్లల మనసులో లోతుగా నాటుకుపోతాయి.

తండ్రి అంటే కేవలం సంపాదించే వ్యక్తి మాత్రమే కాదు, ఇంట్లో విలువలు, నైతికత, ధైర్యం, క్రమశిక్షణ వంటివన్నీ పిల్లలు ఆయన దగ్గరి నుంచే నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే, పిల్లల ఎదుగుదల, వారి భవిష్యత్తు నిర్మాణం ప్రధానంగా తండ్రి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో తండ్రి ఎలా ఉండాలి? నిపుణుల సలహా ఏంటి?

మాటల కంటే ప్రవర్తనే ముఖ్యం

పిల్లలు మాటల కంటే ముందు ప్రవర్తననే గమనించి, నేర్చుకుంటారు. తండ్రి ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన తన కోపాన్ని ఎలా అదుపు చేసుకుంటున్నాడు, ఎలాంటి సందర్భాలలో సహనంతో ఉంటున్నాడు వంటి విషయాలను వారు చాలా నిశితంగా పరిశీలిస్తారు. అవే పద్ధతులను అనుకరించడానికి కూడా ప్రయత్నిస్తారు. అంతేకాకుండా, నిజాయితీ, బాధ్యత, దయ, సమయపాలన, క్రమశిక్షణ వంటి లక్షణాలు కూడా చిన్నప్పటి నుంచే తండ్రిని చూసి పిల్లలు అలవర్చుకునే అవకాశం ఉంది.

ఆత్మవిశ్వాసం అవసరం

పిల్లలు ఏదైనా చిన్న పని చేసినా, దానికి తండ్రి ప్రశంసించినప్పుడు వారు చాలా సంతోషిస్తారు. ఆ అభినందన వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అలా కాకుండా, వారు చేసే ప్రతి పనిలో తప్పులు వెతకడం, విమర్శించడం చేస్తే, పిల్లలు భయపడే స్వభావాన్ని ఎక్కువగా అభివృద్ధి చేసుకుంటారు. ఇది వారి వ్యక్తిత్వ వికాసాన్ని దెబ్బతీస్తుంది.

కోపం, అరుపుల ప్రభావం

ఇంట్లో ప్రతి చిన్న విషయానికీ తండ్రి కోపం చూపించడం, గట్టిగా అరవడం, కొట్టడం లాంటివి చేస్తే, దాని ప్రభావం పిల్లలపై తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల వారిలో భయం, అసురక్షిత భావం పెరుగుతాయి. అంతేకానీ, హింసను చాలా సాధారణ విషయంగా భావించి, వారు కూడా భవిష్యత్తులో ఇతరులతో అలాగే ప్రవర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా మగ పిల్లలు తండ్రి నుంచి ఆ ప్రవర్తనను అనుకరించాలని చూస్తారు. అదే విధంగా, తండ్రి తమ తల్లిని గౌరవంగా చూస్తే, పిల్లలు కూడా పెద్దయ్యాక మహిళలను గౌరవించడం, ఇంటి పనుల్లో సహాయం చేయడం, ప్రేమతో మాట్లాడటం వంటి మంచి అలవాట్లను నేర్చుకుంటారు.

పిల్లలకు ఆదర్శంగా ఉండేందుకు, ప్రతి తండ్రి కచ్చితంగా కొన్ని పద్ధతులను పాటించాలి.

  •  పిల్లలతో కఠినంగా కాకుండా, వారిలో ధైర్యం నింపే విధంగా ప్రేమతో మాట్లాడాలి.
  •  పిల్లల ముందు కోపం, అసహనం, అసభ్యకర పదజాలం వాడటం వంటివి చేయకూడదు. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి.
  •  తల్లిని గౌరవించడం.. ఇది పిల్లలకు నేర్పగలిగే గొప్ప పాఠం. పిల్లలు కుటుంబాన్ని ఎలా చూడాలి, ఇతరులతో ఎలా మెలగాలి అనే విషయాన్ని తండ్రి ద్వారా నేర్చుకుంటారు.
  •  మంచి అలవాట్లు పాటించాలి. పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం వంటి మంచి అలవాట్లు నేర్చకోవాలంటే, ముందుగా తండ్రే వాటిని పాటించాలి.
  •  సమయం కేటాయించాలి. ఎంత పనిలో నిమగ్నమై ఉన్నా కూడా, తండ్రి కచ్చితంగా పిల్లల కోసం కొంచెం సమయం కేటాయించడం తప్పనిసరి.

తండ్రి ప్రవర్తన పిల్లల జీవితంలో శాశ్వతమైన ముద్ర వేస్తుంది కాబట్టి, ప్రతి తండ్రీ తమ ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండాలి.