Adilabad: అడవి తల్లుల గోస.. ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం.. టీవి9 వరుస కథనాలకు స్పందన..

Adilabad: అడవి తల్లుల ప్రసవ వేదన, వాగు కష్టాలతో ఆదివాసీలకు నరకయాతన అంటూ టీవి9 ప్రసారం చేసిన వరుస కథనాలకు ఆదిలాబాద్ జిల్లా అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది.

Adilabad: అడవి తల్లుల గోస.. ఎట్టకేలకు కదిలిన యంత్రాంగం.. టీవి9 వరుస కథనాలకు స్పందన..
Agency
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 24, 2021 | 10:12 PM

Adilabad: అడవి తల్లుల ప్రసవ వేదన, వాగు కష్టాలతో ఆదివాసీలకు నరకయాతన అంటూ టీవి9 ప్రసారం చేసిన వరుస కథనాలకు ఆదిలాబాద్ జిల్లా అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కునికస గ్రామానికి వెళ్లి మృతురాలు గర్భిణి రాజుబాయి కుటుంబ సభ్యులను పరామర్శించింది జిల్లా అధికార యంత్రాంగం. మారుమూల గిరిజన ఏజేన్సీ గ్రామానికి వాగులు దాటుతూ వెళ్లి ఆదివాసీల కష్టాలను దగ్గర నుండి తెలుసుకున్నారు కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటిడిఏ భవేష్ మిశ్రా టీమ్. వాగుల కష్టాల కారణంగా నరకయాతన అనుభవిస్తున్న గర్భిణి‌ స్ర్తీల వెతలను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ సిక్తా పట్నాయక్. ఆదివాసీల కష్టాలను చూసి చలించిపోయిన కలెక్టర్ సిక్తాపట్నాయక్ వీలైనంత త్వరగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ నడక దారి కష్టాలకు, గిరిజన తల్లుల ప్రసవ వేదనకు చెక్ పెడుతానని హామీ ఇచ్చారు. గిరిజ‌న ఏజేన్సీ గ్రామాలకు రహదారి మార్గాలు లేకపోవడంతో ఆదివాసీ బిడ్డలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళుతానని తెలిపారు.

వాగు దాటి ఆదివాసీల గోడు వినేందుకు.. వాగు ఉప్పొంగడంతో గర్భిణీ‌ రాజుబాయి పురిటి నొప్పులతో బాదపడుతూ వాగు దాటలేక.. సరైన సమయంలో చికిత్స అందక మృతి చెందడం విషాదకరం అన్నారు కలెక్టర్ సిక్తా. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటూ ఆదివాసీలకు హామీ ఇచ్చారు. త్వరలోనే గాదిగూడా, కునికస మద్యలో రోడ్డు నిర్మాణం, మరమ్మతులు చెపడుతామని, ఏజేన్సీ ఆసుపత్రుల్లో డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు కలెక్టర్ సిక్తా పట్నాయక్. ఏజేన్సీ కొలం గ్రామాలలో నిండు గర్భిణి లకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మృతురాలు రాజుబాయి కుటుంబానికి 25 వేల చెక్కును అందించిన కలెక్టర్ గిరిజన గ్రామాల్లో గర్భిణీలపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించారు.

ప్రతి సోమవారం గర్భిణీల వైద్యకోసం.. కలెక్టర్ వెంట గాదిగూడ కునికస గ్రామాన్ని పర్యటించిన ఐటిడిఏ పీవో భవేష్ మిశ్రా ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా ఆదివాసీ ఏజేన్సీ గ్రామాల్లో ప్రత్యేక టీమ్‌ లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఆరోగ్య సిబ్బందితో కలిసి సూచనలు సలహాలు ఇచ్చేందుకు ప్రతి సోమవారం ఐటిడిఏలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని గిరిజనులకు హామీ ఇచ్చారు. 6 నుండి 7 నెలల గర్భిణీలకోసం ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి ప్రతి ఏజేన్సీ గ్రామాల్లో గర్భిణీలు, సహాయకులకు కౌన్సిలింగ్ ఇచ్చి.. గర్భిణీ స్త్రీల మరణాలు, వాగు కష్టాల వల్ల ఇబ్బందులు ఎదురవకుండా చూస్తామని తెలిపారు. కునికస గ్రామంలో ఐటిడిఏ ద్వారా వీలైనంత త్వరగా రోడ్డు, వంతెన నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. గాదిగూడా కునికస రోడ్డు మంజూరు అయినప్పటికి అటవీశాఖ ఆంక్షల వల్ల ఆగిపోయిందని త్వరలోనే ఆ సమస్యను‌ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.

ఏజేన్సీ పరిధిలో వాగుల మధ్య జలదిగ్భందంలో ఉండే గ్రామాల్లోని గర్భిణీలు, బాలింతల విషయంలో ప్రతి సోమవారం మానిటరింగ్ సెల్ ద్వారా ఆరోగ్య విషయాలను ఆరా తీసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎట్టకేలకు జిల్లా అధికారులు రవాదారి కష్టాలను దాటి, వాగుల్లో అతి కష్టం మీద ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు చేరుకుని‌ తమ బాధలను విన్నందుకు హర్షం వ్యక్తం చేశారు ఆదివాసీలు. వీలైనంత త్వరగా ఈ వాగుల కష్టాల నుండి బయటపడేయాలని అధికార యంత్రాంగం తమ బాధలను అర్థం చేసుకోవాలని కోరారు ఆదివాసీలు.

(నరేష్ స్వేన, టీవి9 కరస్పాండెంట్, ఉమ్మడి ఆదిలాబాద్)

Videos:

Also read:

Corruption: గ్రామపంచాయతీ కార్యాలయంలోనే సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ వాటాలు.. సీసీ కెమెరాతో బండారం బట్టబయలు.

LIC Arogya Rakshak: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే పాలసీ.. ఒక్కపాలసీతో ఇంట్లో వారందరికి బెనిఫిట్స్‌..!

Hyderabad: టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై అట్రాసిటీ కేసు.. కారణమేంటంటే..