ఆకలితో చనిపోయిన గణిత శాస్త్రవేత్త..!

అతనొక తత్వవేత్త... ప్రపంచంలోనే మేటి గణిత శాస్త్రవేత్త.. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తికి చివరాంకంలో దుర్భరస్థితిలో తిండి తినలేక మరణించాడు.

ఆకలితో చనిపోయిన గణిత శాస్త్రవేత్త..!
Follow us

|

Updated on: Oct 26, 2020 | 4:41 PM

అతనొక తత్వవేత్త… ప్రపంచంలోనే మేటి గణిత శాస్త్రవేత్త.. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వ్యక్తికి చివరాంకంలో దుర్భరస్థితిలో తిండి తినలేక మరణించాడు. అతను ఇతరులను నమ్మలేక ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అతనే కుర్ట్‌ గాడెల్‌.. ఓ గణిత శాస్త్రంలో ఉద్దండుడిగా పేరు సంపాదించిన ఆయన్ను చాలా మంది అరిస్టాటిల్‌తో పోల్చారు. 20వ శతాబ్దంలో ఎన్నో ఆవిష్కరణలకు ఆయన ఆలోచనలు, విశ్లేషణలు ఉపయోగపడ్డాయి. ఆస్ట్రియా-హంగేరీకి చెందిన కుర్ట్‌ 1906 ఏప్రిల్‌ 28న జన్మించారు. గణితంలో మాస్టర్‌ డిగ్రీ సంపాదించిన ఆయన అమెరికాలో వివిధ యూనిర్సిటీల్లో పనిచేశారు. అమెరికా పౌరసత్వం సంపాదించుకొని అక్కడే స్థిరపడ్డారు. గణితశాస్త్రంలో ఆయన చేసిన కృషికిగాను ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. ఆయన పేరుపైనే థియరట్రికల్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో విశేష కృషి చేసిన వారికి ఏటా గాడెల్‌ ప్రైజ్‌ ఇస్తున్నారు. ఇదిలావుంటే, 70 ఏళ్లు వచ్చినా ఎంతో ఆరోగ్యంగా, చలాకీగా ఉన్న కుర్ట్‌ కడుపు మాడ్చుకొని అర్థాకలితో కన్నుమూశాడు. తినడానికి డబ్బులు లేక కాదండోయ్‌.. వడ్డించే వారిపై ఆయనకు నమ్మకం లేక.

కుర్ట్‌ గాడెల్‌కు వయసు మీద పడుతున్న కొద్దీ మానసిక ఇబ్బందులు అధికమయ్యాయి. ఎవరైనా తనకు విషం పెట్టి చంపేస్తారేమోనని భయపడేవారు. దీంతో వీధుల్లో అమ్మే ఆహార పదార్థాలు తినడం మానేశారు. హోటళ్లు, బంధువుల ఇళ్లలో కూడా ఒక్క ముద్ద కూడా స్వీకరించేవాడు కాదు. కేవలం ఆయన భార్య అడెలె చేసిన వంట.. ఆమె చేతులతో వడ్డిస్తేనే తినేవారు. అలా కొన్నాళ్లు సాగింది.

కాగా, 1977లో అడెలె అనారోగ్యానికి గురైంది. ఆరు నెలలపాటు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. ఆమె వంట చేసే స్థితిలో లేకపోవడంతో కుర్ట్‌ ఏకంగా భోజనం చేయడం మానేశారు. బంధువులు, పనివాళ్లు వండిపెట్టినా కుర్ట్‌ తినడానికి నిరాకరించారు. చివరకు బాగా నీరసించి ఆకలి చావు కొని తెచ్చుకున్నారు. చివరికి కడుపు మాడ్చుకుని 1978 జనవరి 14న ప్రిన్స్‌టన్‌ ఆస్పత్రిలో చేరి కన్నుమూశారు. మృతి చెందినప్పుడు ఆయన వయసు 71 ఏళ్లు కాగా.. అప్పుడు ఆయన బరువు కేవలం 25 కిలోలు మాత్రమే. ఆయన భార్య అడెలె అనారోగ్యం నుంచి కోలుకున్నా.. మూడేళ్లకే ఆమె కూడా మృతి చెందింది.