అల్లు అర్జున్
అల్లు అర్జున్..ఐకాన్ స్టార్..నేషనల్ అవార్డ్ విన్నర్.. దేశంలో అత్యధిక పారితోషికం పోషిస్తున్న నటుల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. తెలుగు సినీ చరిత్రలో 70 ఏళ్లుగా మనకు కాకుండా పోయిన ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్ అందుకున్నారు. 1982 ఏప్రిల్ 2న చెన్నైలో జన్మించిన సినీ నిర్మాత అల్లు అరవింద్, నిర్మల దంపతులకు అల్లు అర్జున్ జన్మించారు. తన 20వ ఏట తన కుటుంబం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యే వరకు అల్లు అర్జున్ చైన్నైలోని పెరిగారు. తన తాతయ్య ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య నటనా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు వారి స్వస్థలం. 2011లో స్నేహా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు అయాన్, కుమార్తె అర్హా ఉన్నారు.
కెరీర్ తొలినాళ్లలో చైల్డ్ ఆర్టిస్ట్, డ్యాన్సర్‌గా పనిచేసిన అల్లు అర్జున్.. 2003లో గంగోత్రి మూవీతో తెరంగేట్రం చేశారు. ఆర్య, బన్నీ, దేశముదురు, పరుగు తదితర చిత్రాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఆర్య 2, వేదం, జులాయి, రేసు గుర్రం, S/o సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, డీజే: దువ్వాడ జగన్నాధం, అలా వైకుంఠపురములో చిత్రాలు టాలీవుడ్ ఆడియన్స్‌లో అతని పట్ల క్రేజ్‌ను మరింత పెంచాయి.
అల్లు అర్జున్ కెరీర్‌ను కొత్త మలుపుతిప్పిన చిత్రం పుష్ప: ది రైజ్ (2021). ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారారు. తెలుగులో ఆల్ టైమ్ హై కలెక్షన్స్ సాధించిన మూవీలలో ఒకటిగా ఇది రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి ఉత్తమ జాతీయ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నాడు. జాతీయ చలనచిత్ర అవార్డుతో పాటు ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మూడు నంది అవార్డులు కూడా అందుకున్నాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 పై ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.