AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టిఫిన్ తినాల్సిన పనే లేదు.. జస్ట్ 5 నిమిషాల్లోనే సూపర్ ఫుడ్.. ఒక్క కప్పు తింటే చాలు..

జొన్న అంబలి, జొన్న పిండితో తయారుచేసే ఓ పాతకాలపు ఆరోగ్యకరమైన వంటకం. ఇది శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియాను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సులభంగా తయారుచేసే ఈ అంబలి బరువు తగ్గాలనుకునే వారికి, అలాగే అన్ని వయస్సుల వారికీ అల్పాహారంగా లేదా రాత్రి భోజనంగా అనువైనది. కడుపుకు చలువ చేసి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.

టిఫిన్ తినాల్సిన పనే లేదు.. జస్ట్ 5 నిమిషాల్లోనే సూపర్ ఫుడ్.. ఒక్క కప్పు తింటే చాలు..
Jowar Malt
Shaik Madar Saheb
|

Updated on: Mar 18, 2026 | 9:11 AM

Share

జొన్న జావ (Jowar Malt) పోషకాల గని.. ఇది శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. అందుకే.. జొన్న జావ ప్రతిరోజూ తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొంటున్నారు. వాస్తవానికి జొన్నల్లో ఇందులో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ B3 (నియాసిన్) వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. ఈ సంప్రదాయ పానీయం.. జొన్న జావ (Jonna Java) ను శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జావను తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు దూరమవుతాయని పేర్కొంటున్నారు. జొన్న జావ..  బరువు తగ్గడానికి, డయాబెటిస్ నియంత్రణకు, ఎముకల బలానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడే ఒక సూపర్ ఫుడ్.. అని ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. జొన్నపిండి, నీరు – మజ్జిగతో సులభంగా 5 నిమిషాల్లో తయారుచేసుకునే ఈ జావ, వేసవిలో ఒంటికి చలవ చేసి శక్తినిస్తుంది.

వాస్తవానికి జొన్న జావ లేదా జొన్న అంబలి అనేది జొన్న పిండితో తయారుచేసే ఒక పాతకాలపు, ఆరోగ్యకరమైన వంటకం. ఇది శరీరానికి అవసరమైన మంచి బ్యాక్టీరియాను పుష్కలంగా అందిస్తుంది. అల్పాహారంగా లేదా రాత్రి భోజనంగా ఏ వయసు వారైనా దీనిని తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా జొన్న అంబలిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి, ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

జొన్న అంబలి – జావ తయారీకి కావలసినవి:

ఒక కప్పు జొన్న పిండి

ఐదు కప్పుల నీరు (ఉడికించడానికి)

రెండు కప్పుల నీరు (పిండి కలపడానికి)

అర లీటరు మజ్జిగ

రుచికి సరిపడా ఉప్పు

జొన్న జావ తయారీ విధానం:

ముందుగా, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఐదు కప్పుల నీటిని పోసి మరిగించాలి. ఈలోపు, మరొక గిన్నెలో ఒక కప్పు జొన్న పిండిని తీసుకుని, ఒక కప్పు నీటిని కలిపి ఉండలు లేకుండా బాగా కలుపాలి. తర్వాత ఇంకొక కప్పు నీటిని కలిపి పిండిని కొద్దిగా పల్చగా చేయాలి. పిండి ఉండ కట్టకుండా ఉండటానికి ఈ విధంగా నీటితో కలపడం ముఖ్యం.

నీళ్లు బాగా మరిగిన తర్వాత, ఫ్లేమ్‌ను తగ్గించి, కలిపి పెట్టుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ గరిటెతో నిరంతరం కలుపుతూ ఉండాలి. అడుగున అంటుకోకుండా ఉండటానికి మధ్యమధ్యలో కలుపుతూ, ఐదు నిమిషాల పాటు చిక్కబడే వరకు ఉడికించాలి. రవ్వతో అంబలి చేసేటట్లయితే, ఒక గ్లాసు రవ్వకు ఆరు గ్లాసుల నీళ్లు పోసి, రవ్వ మెత్తగా ఉడికే వరకు సమయం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అంబలి ఉడికిన తర్వాత స్టవ్ ఆపివేసి, రెండు నిమిషాల పాటు కలుపుతూ పక్కన పెట్టాలి. దీనికి ఉల్లిపాయ, మజ్జిగను యాడ్ చేసుకోని తాగవచ్చు..

పులియబెట్టే ప్రక్రియ:

ఉడికించిన జావను శుభ్రమైన మట్టికుండలో పోసి, మూత పెట్టి ఆరు నుండి ఏడు గంటలు లేదా రాత్రంతా పులియనివ్వాలి. మట్టికుండలో పులియబెట్టడం వల్ల మంచి బ్యాక్టీరియా మరింత సమృద్ధిగా అభివృద్ధి చెందుతుంది. రాత్రంతా పులియబెట్టిన తర్వాత, ఉదయం జావ గట్టిగా జున్నులా తయారవుతుంది. దీనిని గరిటెతో ఉండలు లేకుండా బాగా కలిపి మెత్తగా చేసుకోవాలి.

మెత్తగా చేసుకున్న జావలో అర లీటరు మజ్జిగను సగం సగం పోస్తూ బాగా కలుపాలి. ఇంకా పల్చగా కావాలంటే ఎక్కువ మజ్జిగ కలుపుకోవచ్చు. మధ్యమధ్యలో ఉండలు ఉంటే, పెరుగు చిలికే దానితో బీట్ చేసుకోవచ్చు. చివరగా, రుచికి సరిపడా చాలా కొద్దిగా ఉప్పును కలిపి బాగా కలుపాలి. అంతే, పోషక విలువలు నిండిన జొన్న అంబలి సిద్ధం.

ఆరోగ్య ప్రయోజనాలు:

రాత్రంతా పులియబెట్టడం వల్ల జొన్న అంబలిలో ప్రొబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) అధికంగా అభివృద్ధి చెందుతాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడతాయి. చెడు బ్యాక్టీరియాతో పోరాడటానికి శరీరాన్ని బలంగా ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి అల్పాహారం లేదా రాత్రి భోజనం. వేసవిలో శరీరంలోని వేడిని తగ్గించి, కడుపులో చల్లగా, హాయిగా ఉండేలా చేస్తుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర కలిపి తీసుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుంది.

జొన్న జావను ఉదయం లేదా రాత్రి వేళల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు.. ఉదయాన్నే తీసుకుంటే.. ఇక టిఫిన్ కూడా తీనాల్సిన అవసరం ఉండదు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us