AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిపి, షుగర్ కంట్రోల్‌కు ‘3 గంటల సూత్రం’.. 13 గంటల ఉపవాసంతో ఇన్సులిన్ మ్యాజిక్!

చాలామంది రాత్రి 10 లేదా 11 గంటలకు భోజనం చేసి వెంటనే పడుకుంటారు. దీనివల్ల శరీరంలోని సహజ జీవ గడియారం దెబ్బతింటుంది. నిద్రపోయే సమయంలో శరీరం విశ్రాంతి తీసుకోవాలి, కానీ ఆలస్యంగా తినడం వల్ల జీర్ణక్రియ కొనసాగి రక్తపోటు పెరుగుతుంది. నిద్రకు కనీసం మూడు గంటల ముందే భోజనం ముగించడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.

బిపి, షుగర్ కంట్రోల్‌కు ‘3 గంటల సూత్రం’.. 13 గంటల ఉపవాసంతో ఇన్సులిన్ మ్యాజిక్!
Early Dinner Benefits.jpg
Nikhil
|

Updated on: Mar 18, 2026 | 7:40 AM

Share

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం వంటివి ప్రతి ఇంట్లోనూ సాధారణమైపోయాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఈ సమస్యలతో పోరాడుతున్నారు. అయితే, మనం తినే ఆహారంలో మార్పులు చేయకుండానే, కేవలం ‘తినే సమయాన్ని’ మార్చడం ద్వారా ఈ రెండింటినీ నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలోని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

పరిశోధనలో తేలిన నిజాలు..

నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు 36 నుండి 75 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిపై ఈ అధ్యయనం చేశారు. వీరికి నిద్రకు మూడు గంటల ముందే భోజనం ముగించి, రాత్రిపూట 13 నుండి 16 గంటల పాటు ఉపవాసం ఉండాలని సూచించారు. దీనివల్ల వారిలో ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించాయి. రాత్రి సమయంలో వీరి రక్తపోటు సుమారు 3.5% మేర తగ్గింది. హార్ట్ రేట్ 5% వరకు తగ్గి, గుండె పనితీరు మెరుగుపడింది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి రావడమే కాకుండా, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగింది. ఇది డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తుంది.

ఎలా పాటించాలి?

మీరు రాత్రి 10 గంటలకు నిద్రపోతారనుకుంటే, రాత్రి 7 గంటల లోపే భోజనం పూర్తి చేయాలి. భోజనం తర్వాత లైట్ల వెలుతురు తగ్గించి, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండటం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది. రాత్రిపూట పప్పు, పనీర్, సలాడ్ లేదా గ్రిల్ చేసిన చికెన్ వంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం. రాత్రిపూట ఎక్కువ సేపు ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ తగ్గి, మెటబాలిజం సమతుల్యం అవుతుంది.

షిఫ్ట్ డ్యూటీలు చేసే వారికి ఇది కొంచెం కష్టమైనా, సాధారణ వ్యక్తులు ఈ చిన్న అలవాటును మార్చుకోవడం ద్వారా గుండె జబ్బుల ముప్పు నుండి తప్పించుకోవచ్చు. వీకెండ్స్‌లో కూడా ఇదే నిద్ర సమయాన్ని పాటించడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

మనం ఏమి తింటున్నాం అనే దానికంటే, ‘ఎప్పుడు తింటున్నాం’ అనేది మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. నిద్రకు మూడు గంటల ముందు భోజనం ముగించడం అనే చిన్న మార్పుతో మీ రక్తపోటు, చక్కెర స్థాయిలను సహజంగానే నియంత్రించుకోవచ్చు.

Follow Us