AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు కొనే తేనె అసలైనదేనా? ఈ 4 చిన్న పరీక్షలు చేసి కల్తీ తేనెను చిటికెలో గుర్తించేయండి

ప్రకృతి మనకు ప్రసాదించిన వాటిలో అమృతంతో సమానమైనది తేనె. దీని రుచి మాత్రమే కాదు, ఇందులో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, నేటి మార్కెట్‌లో స్వచ్ఛమైన తేనెను గుర్తించడం కూడా ఒక పెద్ద సవాలుగా మారింది.

మీరు కొనే తేనె అసలైనదేనా? ఈ 4 చిన్న పరీక్షలు చేసి కల్తీ తేనెను చిటికెలో గుర్తించేయండి
Honey Purity Test.jpg
Nikhil
|

Updated on: Mar 18, 2026 | 7:05 AM

Share

పాలల్లో నీళ్లు కలిపేసినట్టు ప్రకృతిలో లభించే ప్రతి దానినీ కల్తీ చేసేస్తున్నారు చాలా మంది. ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న తేనెను కూడా కల్తీ చేస్తున్నారు. లాభాల కోసం చాలామంది వ్యాపారులు తేనెలో చక్కెర పాకం, బెల్లం నీరు లేదా ఇతర రసాయనాలను కలుపుతున్నారు. దీనివల్ల తేనెలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ వంటి పోషకాలు నశించిపోతాయి. మరి మనం కొనే తేనె అసలైనదా? లేక కల్తీదా? అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

తేనె స్వచ్ఛతను పరీక్షించడం చాలా ముఖ్యం, ఎందుకంటే కల్తీ తేనె వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలగకపోగా, శరీరానికి హాని జరుగుతుంది. సాధారణ వినియోగదారులు కూడా సులభంగా గుర్తించగలిగే నాలుగు ముఖ్యమైన పద్ధతులు ఇక్కడ ఉన్నాయి.

  • నీటి పరీక్ష- ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ తేనెను వేయండి. దాన్ని అస్సలు కలపకూడదు. స్వచ్ఛమైన తేనె చిక్కగా ఉంటుంది కాబట్టి అది నేరుగా గ్లాసు అడుగుభాగానికి చేరుకుని ఒక ముద్దలా పేరుకుపోతుంది. ఒకవేళ ఆ తేనె నీటిలో వేయగానే త్వరగా కరిగిపోయినా లేదా నీటిలో కలిసిపోయినా, అందులో చక్కెర పాకం లేదా ఇతర పదార్థాలు కలిశాయని అర్థం చేసుకోవాలి.
  • వేడి చేసే పరీక్ష- తేనెను ఒక చిన్న పాత్రలో వేసి సుమారు 30 సెకన్ల పాటు వేడి చేయండి. స్వచ్ఛమైన తేనె వేడి చేసినప్పుడు కెరమెలైజ్ అవుతుంది, అంటే కొంచెం చిక్కగా మారి మంచి వాసన వస్తుంది. కానీ, కల్తీ తేనెలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల అది వేడి చేయగానే నురగలు రావడం, బుడగలు రావడం లేదా త్వరగా మాడిపోవడం జరుగుతుంది.
  • ఆకృతి పరీక్ష – చాలామంది తేనె గడ్డకడితే అది కల్తీ అని భావిస్తారు, కానీ అది తప్పు. స్వచ్ఛమైన తేనెలో ఉండే ‘గ్లూకోజ్ ఆక్సిడేజ్’ అనే ఎంజైమ్ వల్ల కాలక్రమేణా అందులోని తేమ తగ్గి తేనె స్ఫటిక రూపంలోకి మారుతుంది. ఒకవేళ మీరు కొన్న తేనె నెలల తరబడి అలాగే పల్చగా, ఎటువంటి మార్పు లేకుండా ఉంటే అది ప్రాసెస్ చేయబడిన లేదా కల్తీ చేయబడిన తేనె అయి ఉండవచ్చు.
  • నురగ పరీక్ష- కొద్దిగా తేనె తీసుకుని అందులో రెండు చుక్కల వెనిగర్ కలపండి. స్వచ్ఛమైన తేనె సహజంగానే ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి వెనిగర్‌తో ఎటువంటి ప్రతిచర్య జరపదు. ఒకవేళ తేనె నురగలా వచ్చినా లేదా పొంగినా, అందులో రసాయనాలు లేదా ఇతర పదార్థాలు కలిశాయని నిర్ధారించుకోవచ్చు.

మార్కెట్‌లో దొరికే రంగురంగుల ప్యాకింగ్‌లను చూసి మోసపోకుండా, పైన చెప్పిన ఒకటి రెండు పరీక్షలను కలిపి చేయడం ద్వారా స్వచ్ఛమైన తేనెను గుర్తించవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం కోసం కల్తీ లేని ప్రకృతి సిద్ధమైన తేనెను మాత్రమే వాడండి.

Follow Us