పోలీస్ స్టేషన్‌లో ప్రేమ పంచాయతీ.. అక్కడే పురుగుల మందు తాగేసిన యువతి.. అసలేం జరిగిందంటే..?
Nirmal District News: పోలీస్ స్టేషన్‌లో అయినా న్యాయం జరుగుతుందనే నమ్మకంతో స్టేషన్ మెట్లెక్కిన యువతికి అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది. దీంతో చేసేదేమి లేక మనోవేదనకు గురై.. పోలీస్ స్టేషన్‌లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది ఆ ప్రియురాలు. అలర్ట్ అయిన పోలీసులు ఆ యువతిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి...

నిర్మల్ జిల్లా, సెప్టెంబర్ 18: ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. తీరా ప్రభుత్వ ఉద్యోగం రావడంతో మరో యువతితో పెళ్లికి సిద్దమయ్యాడు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు న్యాయం కావాలంటూ ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు నెలలుగా న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. తాజాగా ప్రియురాలితో సయోద్య కుదుర్చుకునేందుకు పోలీస్ స్టేషన్‌లో పంచాయితీకి సిద్దయ్యాడు ప్రియుడు. పోలీస్ స్టేషన్‌లో అయినా న్యాయం జరుగుతుందనే నమ్మకంతో స్టేషన్ మెట్లెక్కిన యువతికి అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది. దీంతో చేసేదేమి లేక మనోవేదనకు గురై.. పోలీస్ స్టేషన్‌లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది ఆ ప్రియురాలు. అలర్ట్ అయిన పోలీసులు ఆ యువతిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో జరిగింది.
నిర్మల్ జిల్లా కడెం మండలం మసాయి పేట్ గ్రామానికి చెందిన కుంటాల సుజాత అనే యువతి.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన సమీప బంధువు అయిన చందాల హరీష్‌తో ప్రేమలో పడింది. దాదాపు ఐదేళ్ల ప్రేమించుకున్న ఈ జంట.. హైదరాబాద్‌లో చదువుకుంటూ సహజీవనం కూడా చేసింది. ఇంతలోనే ప్రియుడికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఇక పెళ్లి పక్కా అని సంతోషించింది యువతి సుజాత. కానీ సర్కారీ నౌకరీ రాగానే ఫ్లేట్ పిరాయించిన హరీష్ మరో యువతితో పెళ్లికి సిద్దమయ్యాడు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ మూడు నెలల క్రితం హరీష్ ఇంటి ఎదుట నిరసనకు దిగింది యువతి సుజాత. ఆ రోజు నుండి న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. అయితే తాజాగా యువకుడు సంధి కోసం ప్రియురాలిని ఇచ్చోడ పోలీస్ స్టేషనుకు పిలిపించి పంచాయితీ పెట్టించడంతో ఇక న్యాయం జరిగేలా కనిపించడం లేదని ఆత్మహత్య యత్నం చేసింది యువతి సుజాత.
ఈ ఇద్దరి ప్రేమ, పెండ్లి వ్యవహారంపై ఇచ్చోడ ఎస్ఐ గుగులోత్ నరేష్ ఆధ్వర్యంలో ఆదివారం ఇరువురు బంధువుల సమక్షంలో పంచాయతీ కొనసాగింది. అమ్మాయి తరుపున కుటుంబ సభ్యులు పెళ్లికి పట్టుపట్టగా.. అబ్బాయి కుటుంబ సభ్యులు ససేమీరా అనడంతో.. అంతలోనే సుజాత పోలీస్ స్టేషన్‌లోనే పురుగుల మందు సేవించడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. వెంటనే ఎస్సై నరేష్ బాధితురాలిని ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు సమాచారం. అయితే సివిల్ పంచాయతీ పోలీస్ స్టేషన్‌లో జరగడం.. న్యాయం జరగట్లేదని ప్రేమికురాలు ఆత్మహత్య యత్నానికి పాల్పడటం జిల్లాలో సంచలనంగా మారింది.
కాగా, ప్రియుడు హరీష్‌కు పోస్టల్ శాఖలో ఉద్యోగం రావడంతో సుజాతతో.. హరీష్ కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లికి గతంలోనే ససేమీరా అన్నారు. ఈ ఏడాది మార్చి నెలలోనే న్యాయం చేయాలంటూ ప్రియుడు హరీష్ ఇంటి ముందు బైటాయించి ఆందోళనకు దిగింది. మూడు నెలలు నిరవదిక నిరసన చేపట్టడంతో హరీష్ కుటుంబ దిగొచ్చింది. ఏడాది క్రితమే ప్రియుడు హరీష్ ఇంట్లో ఇరు కుటుంబాల పెద్దలు పంచాయతీ జరిపించారు.. అయినా ఫలితం లేకపోవడం.. ప్రియుడి తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగి కావడం.. పలు మార్లు పంచాయితీలు జరిపినా అబ్బాయి కుటుంబం ససేమీరా అనడంతో సుజాత ఇక న్యాయం జరగదని ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..