Telangana: పైసల కోసం ప్రియురాలి దిమ్మతిరిగే స్కెచ్.. లక్షల సొమ్ము కాజేసి విదేశాలకు పరార్!
ప్రేమ పేరిట ఓ యువతి ఆడిన నాటకానికి ఆ ప్రేమికుడి గుండె బద్దలైంది. మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు దండుకుంది. అనంతరం ఆ డబ్బులతో బంగారు ఆభరణాలు కొనుక్కొని, వాటితో విదేశాలకు ఉడాయించింది. అంతటితో ఆగకుండా ఆ యువకుడికి ఉన్న స్థిరాస్తిని కూడా రాసివ్వాలని, లేదంటే పెళ్లి చేసుకోనంటూ పదేపదే ఫోన్ చేసి వేధించసాగింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రియుడు ఆత్మహత్యకు..
తిమ్మాపూర్, మే19: ప్రేమ పేరిట ఓ యువతి ఆడిన నాటకానికి ఆ ప్రేమికుడి గుండె బద్దలైంది. మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు దండుకుంది. అనంతరం ఆ డబ్బులతో బంగారు ఆభరణాలు కొనుక్కొని, వాటితో విదేశాలకు ఉడాయించింది. అంతటితో ఆగకుండా ఆ యువకుడికి ఉన్న స్థిరాస్తిని కూడా రాసివ్వాలని, లేదంటే పెళ్లి చేసుకోనంటూ పదేపదే ఫోన్ చేసి వేధించసాగింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి తండ్రి ఫిర్యాదు చేయడంతో శనివారం ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
తిమ్మాపూర్‌కు చెందిన మాదన నాగరాజు డీ ఫార్మసీ చదువుతూ.. గతేడాది కోయంబత్తూర్‌లో ఇషా ఫౌండేషన్‌లో పనిచేయసాగాడు. అక్కడే వైజాగ్‌కు చెందిన ప్రియాంక అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అనతి కాలంలోనే ప్రేమగా మారింది. అనంతరం కోన్నాళ్లకు ఆస్ట్రేలియాకు వెళ్లింది. తనకు డబ్బులు పంపిస్తే ఇండియాకు వచ్చి మనువాడతానని చెప్పింది. దాంతో నాగరాజు ఆమె చెప్పిన విధంగా ఫోన్ పే ద్వారా రూ.లక్ష పంపాడు. అనంతరం ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ప్రియాంక నేరుగా తిమ్మాపూర్‌లోని నాగరాజు ఇంటికి వచ్చింది. పెళ్లికి ముందే యువతి ఇంటికి రావడాన్ని నాగరాజు కుటుంబసభ్యులు తప్పుబట్టారు. దీంతో ఇద్దరూ తిమ్మాపూర్‌లోనే ఓ అద్దె ఇంట్లో నెలరోజుల పాటు కలిసి ఉన్నారు.
ఈ క్రమంలో నాగరాజు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తనకున్న భాగస్వామ్యాన్ని వదులుకుని రూ.16 లక్షలు తీసుకుని.. ఆ మొత్తాన్ని ప్రియాంక తన సోదరి అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. ఆ తర్వాత వైజాగ్ వెళ్లి, ఆ డబ్బుతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి, అక్కడే మూడు నెలలపాటు ఇద్దరూ కలిసి ఉన్నారు. తర్వాత ఆమె బంగారు నగలు తీసుకుని ఆస్ట్రేలియాకు ఉడాయించింది. కొన్నాళ్లకు నాగరాజుకు యువతి ఫోన్ చేసి, తనను పెళ్లి చేసుకోవాలంటే అతని వాటా కింద వచ్చే రెండెకరాల భూమిని తన పేరుమీద రాసివ్వాలని చెప్పింది. అలా పలుమార్లు ఫోన్లు చేసి వేధించసాగింది. దీంతో మనస్తాపం చెందిన నాగరాజు ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. నాగరాజు తండ్రి మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రియాంకతోపాటు ఆమె సోదరి, శ్రీనివాస్‌రావు అనే మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.