Telangana: వలపుల రాణి.. ఎంతటి వారైనా.. ఆమె వలలో చిక్కుకోవాల్సిందే..!

మాయలేడీ మహిళా హోంగార్డు బ్లాక్ మెయిల్ చేయడం కొత్తేమి కాదంటున్నారు పోలీసులు. తాజాగా బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి వస్తున్న నిజాలు..!

Telangana: వలపుల రాణి.. ఎంతటి వారైనా.. ఆమె వలలో చిక్కుకోవాల్సిందే..!
Woman Arrest
Follow us
G Sampath Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Dec 06, 2024 | 10:28 AM

మంచి ఉద్యోగం చేస్తోంది. గౌరవమైన ప్రాంతం.. అంతవరకు ఓకే. డబ్బుపై వ్యామోహం ఉద్యోగం వర్కవుట్‌ కాలేదేమో.. చీటింగ్‌కి తెరలేపింది. వలపు వలతో కొత్త అవతారమెత్తింది. అత్యాశకు పోయి చివరికి ఊచలు లెక్కపెడుతోంది. మహా మహా మాయగాళ్లే ఔరా అనేలా…కథ స్క్రీన్‌ప్లే నడిపిందా కిలేడీ.

చూట్టానికి మామూలుగా ఉంది కానీ మహా కిలాడి. పేరు అనూష. మహిళా హోంగార్డు కాస్త.. కి’లేడీ’గా మారింది. బ్లాక్ మెయిల్‌తో మోసాలకు పాల్పడింది. వేములవాడ టెంపుల్ రిటైర్డ్ ఉద్యోగి ఆమె వలలో పడి నిండా మునిగిపోయాడు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో కిలాడి హోంగార్డును అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. ఆ తర్వాతే అసలు విషయాలు బయటపడ్డాయి.

ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహిళా హోంగార్డు అనూష రూటే సపరేటు అన్నట్లుగా ఉంది. వేములవాడకు వచ్చే భక్తులకు రక్షణగా నిలువాల్సిన హోంగార్డు, బ్లాక్ మెయిల్‌తో మోసాలకు తెరలేపింది. తన భర్త ఆరోగ్యం సరిగా లేదని డబ్బున్న వాళ్ళను వలలో వేసి అందినంత దోచుకునే పనిలో నిమగ్నమయ్యింది. చివరకు వేములవాడ టెంపుల్ రిటైర్డ్ ఉద్యోగి శేఖర్, ఈ మాయ లేడీ హోంగార్డు వలలో పడ్డాడు. తన భర్త ఆరోగ్యం బాగులేదని అతని వద్ద నుంచి 3 లక్షల 50 వేల రూపాయలు అప్పుగా తీసుకుంది మహిళా హోంగార్డు. ఆరు నెలల్లో తిరిగి ఇస్తానని చెప్పిన ఆ మాయ లేడీని అప్పు డబ్బులు అడిగితే బ్లాక్ మెయిల్‌కు పాల్పడింది.

మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్..!

మహిళా హోంగార్డు అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వాలని శేఖర్ అడుగగా బ్లాక్ మెయిల్ కు పాల్పడింది. శేఖర్ ఫోటోను మార్ఫింగ్ చేసి పెళ్లి పత్రిక తయారు చేసింది. అతను తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారంతో బ్లాక్ మెయిల్ చేస్తూ ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఫోటోలను పెళ్లి పత్రికను బయటపెడుతానని బెదిరించింది. ఆ పోటోలు బయటకు వస్తే పరువు పోతుందని భయపడిన శేఖర్ ఐదు లక్షల రూపాయలు మాయలేడీ హోంగార్డుకు ముట్టజెప్పాడు. ఇలా అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులు డిమాండ్ చేసి అందినకాడికి దండుకునే పనిలో నిమగ్నమైంది. తాజాగా మరో రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరించింది. విసిగిపోయిన శేఖర్ వేములవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహిళా హోంగార్డు అనూషను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

గతంలో ఒకరిని ఇలాగే మోసం..

మాయలేడీ మహిళా హోంగార్డు బ్లాక్ మెయిల్ చేయడం కొత్తేమి కాదంటున్నారు పోలీసులు. గతంలో వేములవాడకు చెందిన ఒక వ్యక్తి వద్ద 40 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిందని పోలీసులు తెలిపారు. అప్పట్లో కేసు నమోదు అయిందని వేములవాడ సిఐ వీర ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగి శేఖర్ ఫిర్యాదుతో అనూషపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మహిళా హోంగార్డు బ్లాక్ మెయిల్ తో మోసపోయిన వారు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని సిఐ కోరారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..