Telangana: డిఫెన్సివ్ డ్రైవింగ్‌తో ప్రమాదాలకు చెక్.. డ్రైవర్లకు డీజీపీ కీలక సూచనలు..
ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతిని తప్పక పాటించాలని డీజీపీ సూచించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే.. ఇతరుల తప్పుల వల్ల జరిగే ప్రమాదాలను కూడా ముందే గుర్తించి, తప్పించుకునే ఒక మెళకువ. డీజీపీ ఆదేశాల మేరకు వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతపై భారీ అవగాహన కార్యక్రమాలు మొదలుకానున్నాయి.

చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేసింది. ఎన్నో కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయి తల్లడిల్లుతున్నాయి. అయితే టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఓఆర్ఆర్, హైవేల మీద వెళ్లే వేగం ఇలాంటి రోడ్లపై కూడా కొనసాగించడం ప్రమాదాలకు దారితీస్తుంది అని ఆయన హెచ్చరించారు. రోడ్డుపై ఉన్న పరిస్థితిని బట్టి స్పీడ్ నియంత్రణ తప్పనిసరి అన్నారు. ఎదురుగా వచ్చే వాహనం వేగం, రోడ్డు వెడల్పు, మలుపు తీవ్రత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాహనం నడపాలన్నారు. రోడ్డులో మలుపు ఉన్నప్పటికీ, అది ప్రమాదం అయ్యేంత ఘాటు కాదు అని డీజీపీ వివరించారు.
ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్‌పై అవగాహన పెంచుకోవాలని డీజీపీ తెలిపారు. రోడ్డు భద్రత పట్ల నిర్లక్ష్యం ప్రాణాలతో ఆడుకోవడమేనని అన్నారు. స్పీడ్ కంట్రోల్ మాత్రమే కాకుండా సెన్స్ కంట్రోల్ కూడా అవసరం అని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్రవ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమాలను వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్లు డీజీపీ వెల్లడించారు. ప్రతి డ్రైవర్‌కు సేఫ్టీ ప్రాథమిక బాధ్యత అని.. నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోతే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. చేవెళ్ల ఏసీపీనే ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలిపారు. దర్యాప్తు అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారు.
అసలు డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్ అంటే ఏంటి..?
రోడ్డుపై ప్రతి డ్రైవర్‌కి స్పీడ్ మీద కంట్రోల్ అవసరమే కానీ.. అంతకంటే ముఖ్యమైనది సిట్యువేషన్‌పై కంట్రోల్. అదే డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్ అని అంటారు నిపుణులు. రోడ్డు మీద మన తప్పు కాకపోయినా, ఇతరుల తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతాయి. అలాంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించి తప్పించుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. వాహనం నడిపేటప్పుడు ఎదురుగా ఉన్న రిస్క్‌లను ముందుగానే అంచనా వేసి, వాటిని నివారించడానికి ముందస్తు చర్యలు తీసుకోవడం డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్. ఇది కేవలం డ్రైవింగ్ టెక్నిక్ కాదు మైండ్‌సెట్. అంటే నా వల్ల ఎవరికీ ప్రమాదం జరగకూడదు, ఎవరి వల్లా నాకూ జరగకూడదు అనే ఆలోచనతో డ్రైవ్ చేయడం.
ముఖ్యమైన అంశాలు ఇవే..
దూరం పాటించడం: ముందు వాహనం వెనుక కనీసం 3 సెకన్ల దూరం ఉండాలి. హఠాత్తుగా బ్రేక్ వేసినా ప్రమాదం జరగదు.
అంచనా వేయడం: ఇతర వాహనదారులు ఏం చేయబోతున్నారో మీకో అంచనా ఉండాలి. ఉదాహరణకు.. ఎదురుగా వచ్చే వాహనం సడన్‌గా లైన్ మార్చవచ్చు, దానికీ మీరు రెడీగా ఉండాలి.
సేఫ్ స్పీడ్: హైవేలో 100 కిమీ వేగం సరిపోతుంది కానీ గ్రామీణ రోడ్లలో అది ప్రమాదకరం. రోడ్డుస్థితిని బట్టి వేగం మార్చడం డిఫెన్సివ్ డ్రైవింగ్‌లో కీలకం.
మిర్రర్స్ వాడకం: రియర్ వ్యూ, సైడ్ మిర్రర్లను తరచూ చెక్ చేయడం ద్వారా వెనుక జరిగే పరిస్థితులను గమనించవచ్చు.
ముందుగానే సిగ్నల్స్ : లైన్ మార్చేటప్పుడు లేదా టర్న్ తీసుకునేటప్పుడు ముందుగానే ఇండికేటర్ ఇవ్వడం.. చిన్న పనే అయినా పెద్ద ప్రమాదం నివారిస్తుంది.
అలసట, ఫోన్, మద్యానికి నో: డిఫెన్సివ్ డ్రైవర్ ఎప్పుడూ పూర్తి అవగాహనలో ఉండాలి. మానసికంగా డిస్ట్రాక్ట్ అయినప్పుడు రెస్పాండ్ అయ్యే సమయం తగ్గిపోతుంది.
ట్రాఫిక్ పెరుగుతున్న ఈ కాలంలో ప్రతి వాహనదారుడు సేఫ్‌గా డ్రైవ్ చేస్తేనే ప్రమాదాలు తగ్గుతాయి. కానీ అందరూ అలాగే డ్రైవ్ చేయరని మనకి తెలుసు. అందుకే ఇతరుల తప్పులను కూడా ముందుగానే అంచనా వేసి రక్షించుకోవడం, మన వాహనంలో ఉన్నవారిని రక్షించడం అవసరం. అదే డిఫెన్సివ్ డ్రైవింగ్‌లో మెయిన్ థీమ్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
