Water Sports: పిల్లలకు పండుగే.. తెలంగాణలో మొదటి వాటర్ స్కూల్.. శిక్షణ తీసుకునేందుకు అర్హులు ఎవరంటే..
తెలంగాణలో మెుదటి వాటర్ స్కూల్ పారంభమైంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి), యాచ్ క్లభ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ స్కూల్ నడవనుంది. కయాకింగ్, సెయిలింగ్, విండ్..
తెలంగాణలో మెుదటి వాటర్ స్కూల్ పారంభమైంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి), యాచ్ క్లభ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ స్కూల్ నడవనుంది. కయాకింగ్, సెయిలింగ్, విండ్ సర్ఫింగ్, స్డాంట్ అప్ పాడిల్ బొర్డింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ ఈవెంట్‌లలో శిక్షణ ఇవ్వనున్నారు. ఎనిమిదేళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు శిక్షణ కోసం చేరొచ్చు. హైదరాబాద్‌లోని దుర్గం చెరువులో ఈ వాటర్ స్కూల్ ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో తొలి వాటర్ స్కూల్ ను ప్రారంభించింది. ఆధునిక క్రీడా పరికరాలను ఈ స్కూల్‌లో ఏర్పాటుచేశారు. ఆయా క్రీడా విభాగాల్లో నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నారు. వాటర్ స్పోర్ట్స్ లో రాణించాలనుకునే వారికోసం ఒకరకమైన శిక్షణ, వినోద క్రీడగా వచ్చే వారి కోసం వేర్వేరేగా శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. జాతీయ, ఆసియా, ఒలింపిక్స్ స్థాయి వరకూ ఈ వాటర్ స్కూల్‌లో శిక్షణ ఇస్తారు. రానున్న రోజుల్లో లైఫ్-సేవింగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడంతోపాటు కయాకథాన్, హైడ్రాథాన్ వంటి ఈవెంట్‌లను నిర్వహించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈనెల 19వ తేదీ శనివారం సాయంత్రం దుర్గం చెరువు వద్ద పలువురు చిన్నారులు వివిధ వాటర్ స్పోర్ట్స్‌తో ఉత్సాహంగా తిరుగుతూ కనిపించారు. పెద్దలు కూడా పాల్గొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ పిల్లలు వాటర్ స్టోర్ట్స్ లో పాల్గొంటే.. అక్కడకు వచ్చిన వారు పిల్లలను ప్రోత్సహించారు. చాలా మంది తల్లిదండ్రులు వాటర్ స్కూల్‌లోని సౌకర్యాలను ప్రశంసిస్తున్నారు. అక్కడ ఉన్న భద్రతా చర్యలను మెచ్చుకున్నారు. తమ పిల్లలకు వాటర్ స్పోర్ట్స్‌లో నైపుణ్యం పెరగాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన వాటర్ స్కూల్‌తో ఔత్సహికులు పెద్ద ఎత్తున వస్తారని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కయాకింగ్ కోసం, ఒక్కో సెషన్‌కు రూ. 1,400, ఐదు సెషన్‌లకు రుసుము రూ. 5,600, సర్ఫింగ్, స్టాండ్-అప్ పాడిల్ బోర్డింగ్‌కు ఒకే ధరను నిర్ణయించారు. సెయిలింగ్‌కు 12 సెషన్‌లకు రూ.9,500 ఫీజు తీసుకోనున్నారు.
హైదరాబాద్ దుర్గం చెరువులోని ఈ వాటర్ స్కూల్.. అన్ని వాటర్ స్పోర్ట్స్‌కు హబ్‌గా మారనుంది. ఆసియా, ఒలింపిక్ ఛాంపియన్‌లకు వెళ్లాలనుకునేవారికి శిక్షణ కోసం ఇది ఉపయోగపడనుందని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. ఔత్సాహికులు ఈ వాటర్ స్కూల్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఒలింపిక్ క్లాస్ లేజర్, ఇంటర్నేషనల్ 420 బోట్‌లపై కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలు ప్రపంచంలో ఎక్కడైనా ఉపయోగించేందుకు వీలుగా ఉంటాయని అధికారులు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..