Telangana Politics: దుమ్ముదుమారం.. అదానీపై కేసుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం..
అదానీపై కేసుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అదానీతో ఒప్పందాలపై KTR విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు PCC చీఫ్ మహేష్ గౌడ్. చట్టానికి లోబడి ఉన్న ఒప్పందాలే ముందుకు వెళ్తాయని.. రాహుల్‌గాంధీ మాటే.. తమ మాట అన్నారు.
అమెరికాలో అదానీపై అవినీతి కేసు నమోదు కావడం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలియకుండానే అదానీతో ఒప్పందం జరిగిందా అని ప్రశ్నించారు కేటీఆర్. ప్రతీ రోజు అదానీని విమర్శిస్తున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో ఒప్పందాలపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో ఒకనీతి అన్నట్లు కాంగ్రెస్ తీరుందని విమర్శించారు కేటీఆర్.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదానీకి రెడ్ కార్పెట్ వేసి.. 12 వేల 400 కోట్ల ఒప్పందాలు చేసుకుందని కేటీఆర్ వివరించారు. హైకమాండ్‌కు తెలిసే ఇదంతా జరిగిందా అని ప్రశ్నించారు. బడాభాయ్ ఆదేశంతో చోటా భాయ్ అమలు చేశారని ఆరోపించారు. లాభాపేక్షతోనే స్కిల్ యూనివర్సిటీకి అదానీ 100కోట్ల విరాళం ఇచ్చారన్నారు కేటీఆర్. లాభం లేకుండా ఏ వ్యాపారి డబ్బులు ఇవ్వరని రాహుల్ గాంధీయే చెప్పారన్నారు.
తెలంగాణలో అదానీ ఒప్పందాలపై పునరాలోచిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్. అదానీకి ఇప్పటివరకు ఇంచు జాగా కూడా ఇవ్వలేదన్నారు. అంబానీ అయినా, అదానీ అయినా.. చట్టానికి లోబడి ఉన్న ఒప్పందాలే ముందుకు వెళ్తాయని స్పష్టం చేశారు. విరాళం అనేది ఎవరిచ్చినా తీసుకుంటామన్న మహేష్‌కుమార్ గౌడ్.. అవేం రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్లవని చెప్పారు.
న్యూయార్క్ కోర్టులో అదానీపై కేసుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది. అయితే అదానీతో ఒప్పందాలపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..