Telangana: చనిపోయిన వానరానికి అంతిమ సంస్కారాలు..గొప్ప మనసు చాటుకున్న గ్రామస్తులు..!
మనిషి మరణిస్తే కుటుంబ సభ్యులు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహిస్తారు. బంధుమిత్రులు, చుట్టుపక్కలవారు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొని ఆ వ్యక్తికి అంతిమ వీడ్కోలు పలుకుతారు. ఇది మానవ ధర్మం. ఈమధ్యకాలంలో పెంపుడు జంతువులు చనిపోయినా వాటి యజమానులు అభిమానంతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండటం మనం చూస్తున్నాం..

కన్న తల్లిదండ్రులనే పట్టించుకోని ఈ రోజుల్లో వానరానికి అంత్యక్రియలు చేసి మానవత్వం చాటుకున్నారు ఈ గ్రామస్తులు. మనుషులకు మాదిరిగానే కర్మకాండలు చేస్తారో.. అలాగే వానరానికి కూడా చేసి పెద్ద మనసు చేసుకున్నారు. ఈ ఘటన గురించి తెలుసు కోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..!
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన మాధవరపు శ్రీను ఇంటికి కొన్ని రోజుల క్రితం అనారోగ్యం బారిన పడిన వానరం వచ్చింది. దీంతో వానరాన్ని చూసి చలించిన శ్రీను వానరానికి వెటర్నరీ వైద్యులను పిలిపించి వైద్యం చేయించాడు. చికిత్స పొందుతూ 3వ రోజు వానరం చనిపోయింది. దీంతో గ్రామస్తులంతా పాడె కట్టి, డప్పు చప్పుళ్లతో శవయాత్ర చేశారు. అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులంతా కలిసి మనుషులకు మాదిరిగానే దశదినకర్మలు.. వానరానికి కూడా చేశారు. దశదినకర్మలో భాగంగా గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆంజనేయుడికి ప్రతిరూపంగా భావించే గ్రామస్తులు వానరానికి అంత్యక్రియలు, దశదినకర్మలు చేశారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
