AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మారిపోనున్న హైదరాబాద్ రూపురేఖలు.. కార్యరూపం దాల్చుతున్న ఫ్యూచర్ సిటీ మెట్రో..!

మెట్రో విస్తరణ పనులు వేగవంతమైనాయి.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లు డీపీఆర్ సిద్ధంచేసే పనుల్లో నిమగ్నమయ్యారు అధికారులు. ఇందులో భాగంగా ట్రాఫిక్ సర్వే, భూసామర్థ్యం, పర్యావరణంపై ప్రభావంపై అధ్యయన ప్రక్రియలు కొనసాగుతున్నాయి. సర్వేలో భాగంగా జరుగుతున్న టెస్ట్‌లు.. శాంపిల్ కలెక్షన్ కొనసాగుతున్న క్రమాన్ని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.

మారిపోనున్న హైదరాబాద్ రూపురేఖలు.. కార్యరూపం దాల్చుతున్న ఫ్యూచర్ సిటీ మెట్రో..!
Future City Metro Survey
Ashok Bheemanapalli
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 23, 2025 | 5:30 PM

Share

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ వరుసలో నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది కాలుష్యరహిత గ్రీన్ సిటీ గా ప్రపంచంలోనే అద్భుత నగరాల సరసన చేరాలన్నది ఆయన సంకల్పం. ఇందులో భాగంగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ సంస్థ హెచ్ఏండీఏ, టీజీఐఐసీ లతో కలిసి మెట్రో రైల్ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ విమానాశ్రయం నుండి త్వరితగతిన సులభంగా ఫ్యూచర్ సిటీకి చేరుకునే ప్రణాళిక ఉండాలన్నది ముఖ్యమంత్రి అభిమతం. ఈ ఆలోచనలు వాస్తవ రూపం దాల్చేందుకు కసరత్తు చేస్తున్నామని, దాదాపు పదిహేను వేల ఎకరాలలో విస్తరించనున్న భవిష్యనగరిని కాలుష్యరహిత నగరంగా రూపొందించడంలో, దానికి అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో కూడిన ఈ గ్రీన్ కారిడార్ ప్రముఖ పాత్ర వహిస్తుందని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

మెట్రో కారిడార్ సర్వే పనులను మెట్రో ఎండీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎయిర్ పోర్ట్ నుండి మీర్ ఖాన్ పేట్ లో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ డీపీఆర్ తయారీకి అనేక సూచనలు చేశారు. కొంగర కలాన్ దాటిన తరువాత ప్రస్తుతం రోడ్ లేకపోవడం వల్ల కాలినడకన కొండలు, గుట్టలు దాటుకుని ఆయన ఈ క్షేత్ర పర్యటన జరిపారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుంది. ఎయిర్ పోర్ట్ టెర్మినల్ నుండి మొదలై, కొత్తగా ఏర్పరచబోయే మెట్రో రైల్ డిపో పక్క నుండి ఎయిర్ పోర్ట్ సరిహద్దు గోడ వెంబడి ఎలివేటెడ్ మార్గంగా మన్సాన్ పల్లి రోడ్డు గుండా 5 కిలోమీటర్లు ముందుకు సాగాక పెద్ద గొల్కోండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ కి చేరుతుందని మెట్రో ఎండీ తెలిపారు. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా బహదూర్ గుడా లో ఉన్న దాదాపు 1000 నుండి 1500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడేలా బహదూర్ గుడా, పెద్ద గోల్కొండలలో రెండు మెట్రో స్టేషన్లను అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుండి తుక్కుగూడ ఎగ్జిట్ మీదుగా రావిర్యాల్ ఎగ్జిట్ వరకు దాదాపు 14 కిలోమీటర్ల పొడవున ఈ మెట్రో మార్గాన్ని ఎలివేటెడ్ మెట్రో మార్గంగా ఓఆర్ఆర్ లో మెట్రో రైల్ కి కేటాయించిన భాగంలో తక్కువ ఎత్తులో నిర్మిస్తామని ఆయన తెలిపారు.

రావిర్యాల్ ఎగ్జిట్ నుండి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపు 22 కిలోమీటర్లు కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగుడా, మీర్ ఖాన్ పేట్ వరకు హెచ్ఎండీఏ 100 మీటర్లు ( 328 అడుగులు) వెడల్పున నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్లు (72 అడుగులు) మెట్రో రైల్ కి కేటాయించింది. ఈ కేటాయించిన రోడ్ మధ్య స్థలంలో మెట్రో రైల్ కారిడార్ ‘ఎట్ గ్రేడ్’ (భూ తలంపై) మెట్రోగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ విశాల మైన రోడ్ మధ్య లో అదే లెవెల్ లో మెట్రో రైల్ ఉంటే దానికి ఇరువైపులా మూడు లేన్ల ప్రధాన రహదారి ఉంటుందని, మెట్రోను, ప్రధాన రహదారిని విభజిస్తూ ఆకర్షణీయమైన చెట్లను, గ్రీనరీని అభివృద్ధి చేస్తామని, ప్రధాన రహదారి కి ఇరువైపులా మరల రెండు సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.

తన గత అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఓఆర్ఆర్ నిర్మిస్తున్నప్పుడు ఓఆర్ఆర్ లో అంతర్భాగంగా భవిష్యత్ లో నిర్మించబోయే మెట్రో కి తగినంత స్థలాన్ని కేటాయించాలన్న అప్పటి తన ప్రతిపాదనను డాక్టర్ వైఎస్ఆర్ అంగీకరించి ఓఆర్ఆర్ లో 20 మీటర్లు మెట్రోకి కేటాయించడం జరిగిందని మెట్రో ఎండీ తెలిపారు. అప్పట్లో అనేక మంది ఓఆర్ఆర్, మెట్రో వంటి బృహత్ ప్రణాళికలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయని, అవి ఆచరణ సాధ్యం కాదని అపహాస్యం చేసినా, ఈ రోజు ఓఆర్ఆర్, మెట్రో రెండూ కూడా కార్యరూపం దాల్చాయని అయన చెప్పారు. వీటివల్ల హైదరాబాద్ ఒక అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెంది, ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను, పెట్టుబడులను ఆకర్షిస్తోందని; ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న మౌలిక వసతుల ప్రాజెక్టులతో హైద్రాబాద్ కు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మెట్రో ఎండీ అన్నారు.

ఏవిధంగా అయితే ప్రపంచంలో ప్రప్రథమంగా 22 వేల కోట్ల రూపాయలతో మెట్రో మొదటి దశను 69 కిలోమీటర్ల మేర పీపీపీ పద్ధతిన విజయవంతంగా పూర్తి చేశామో, అదే విధంగా ఈ ప్రణాళికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతతో కార్యరూపం దాల్చేలా హెచ్ఎండీఏ, టీజీఐఐసి, మెట్రో రైల్ సంస్థలు సంయుక్తంగా కృషి చేస్తాయని ఆయన అన్నారు. నార్త్ సిటీ లోని మేడ్చల్, శామీర్ పేట్ కారిడార్లతో పాటు, ఈ ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్ కూడా ఈ మార్చి నెలాఖరుకు పూర్తి చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి వీటిని సమర్పిస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేంయడి ..