అబ్బబ్బ.. వారానికి రెండు సార్లైనా తినండి మావ.. చేపల గురించి ఇది తెలిస్తే గిన్నెలు ఊడ్వాల్సిందే..
చేపలు ఉత్తమ పోషకాలతో నిండిన ఆహారం. ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు గుండె, మెదడు ఆరోగ్యానికి కీలకం. ఇవి జ్ఞాపకశక్తిని పెంచి, డిప్రెషన్ తగ్గించి, కొన్ని క్యాన్సర్లను నిరోధించగలవు. ఎముకలు, పళ్లకు బలం చేకూర్చి, రక్తవృద్ధికి తోడ్పడతాయి. వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు చేపలు తినడం వల్ల అనేక అద్భుతమైన లాభాలు పొందవచ్చు.

నాన్ వెజ్ ఆహారంలో చేపలు అత్యంత ప్రాముఖ్యత కలిగినవి. వీటిలో ఉత్తమ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.. ఇవి మన శరీర ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. గుండె జబ్బులతో బాధపడుతున్నవారు, అలాగే ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. చేపలలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు పిల్లల పెరుగుదలకు అత్యవసరం. అంతేకాదు, ఇవి గుండె జబ్బులు రాకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చేపల కొవ్వు ద్వారా విటమిన్లు ఎ, డి, ఇ, కె మన శరీరానికి అందుతాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్ ఎ కన్నా చేపలలోని విటమిన్ ఎ తేలిగ్గా శరీరానికి లభిస్తుంది. చేపల కాలేయంలో ఉండే విటమిన్ డి ఎముకల పెరుగుదలకు, ఆహారంలో ఉన్న కాల్షియంను స్వీకరించడానికి, వినియోగానికి చాలా అవసరం. గట్టి ఎముకలు, పళ్లకు ఫ్లోరిన్ అత్యవసరం, ఇది చేపలలో లభిస్తుంది.
సముద్రపు చేపలలో అయోడిన్ అధికంగా ఉంటుంది. ఇవి ఇనుము, కాల్షియం, జింక్, భాస్వరం, ఫ్లోరిన్ వంటి ఖనిజాలను శరీరానికి బాగా ఉపయోగపడే రూపంలో అందిస్తాయి. రక్త వృద్ధికి హిమోగ్లోబిన్ అవసరం, ఇందుకు ఇనుము బాగా తోడ్పడుతుంది. ఇది చేపలలో విరివిగా లభిస్తుంది. వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు చేపలు తీసుకుంటే మనకు అనేక అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
వయసు మీద పడడం వల్ల సహజంగానే మతిమరుపు వస్తూ ఉంటుంది. కొందరికి ఇది తీవ్రతరమై అల్జీమర్స్‌కు కూడా దారి తీస్తుంది. అలాంటి సమస్య ఉన్నవారు చేపలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చని 2016లో పలువురు అమెరికన్ సైంటిస్టులు చేపట్టిన ఓ పరిశోధనలో వెల్లడైంది. చేపలను తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు.
చేపలను బాగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ఓ అధ్యయన వివరాలను ప్రచురించారు. చేపలలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు రక్తంలో ఉండే ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. చేపలను తరచూ తినడం వల్ల వాటిల్లో ఉండే డోపమైన్, సెరటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన కూడా తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది.
చేపలలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అలాగే పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ తదితర క్యాన్సర్లు రాకుండా ఉంటాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ఓ అధ్యయన వివరాలను ప్రచురించారు. స్త్రీలలో రుతుక్రమం సరిగ్గా ఉండాలన్నా, ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ విధంగా చేపలు సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి.
లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
