Telangana: మొక్కజొన్న పొలంలో ఆ ప్లెక్సీలు పెట్టిన రైతు.. దెబ్బకు కోతులన్నీ పరార్…
కుక్కలున్నాయ్ జాగ్రత్త.. నగరంలో ఎన్నో ఇళ్ల ముందు కనిపించే బోర్డులు ఇవి. ఇప్పుడు కొత్తగా.. కోతులొస్తాయ్ జాగ్రత్త అంటున్నాయి పల్లెలు. అడవుల్లో ఉండాల్సిన వానర దండు.. పల్లెబాట పట్టి రైతులకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. మనుషులపైనా దాడులు చేస్తున్నాయి. గ్రామాల్లో తిష్ట వేసి స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా వస్తున్న వానరదండు దెబ్బకు.. ఎక్కడ చూసినా కిష్కిందకాండే. దీంతో పండించిన పంటను కాపాడుకునేందుకు రైతులు వినూత్న మార్గాలను అన్వేశిస్తున్నారు.

రైతులకు కోతుల బెడద తప్పడం లేదు. వనంలో ఉండాల్సిన వానరాలు జనావాసాలు, పంట పొలాల మధ్య తిరుగుతూ, రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే ఓ రైతు తన మొక్కజొన్న పంటను కాపాడుకోవడానికి వినూత్న రీతిలో ఆలోచించాడు. కొండ ముచ్చుల ప్లెక్సీలను ఏర్పాటు చేసి, తన పంటను కాపాడుకుంటున్నాడు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ళ గ్రామానికి చెందిన సంపత్ అనే రైతు మొక్కజొన్న పంటను సాగు చేశాడు. పంట చేతి కొచ్చిన సమయంలో పదుల సంఖ్యలో వానరాలు వచ్చి మొక్కజొన్న పంటను నాశనం చేస్తున్నాయి. అయితే తన పంటను కోతుల బారి నుండి కాపాడుకునేందుకు కొండముచ్చుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ బ్యానర్లు తయారు చేయించాడు. ఆ బ్యానర్లను మొక్కజొన్న పంట చుట్టూ ఏర్పాటు చేశాడు. దీంతో వానరాల బెడద తగ్గిందని రైతు సంపత్ తెలిపాడు.
సంపత్ వినూత్న ఆలోచన పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంపత్ తెలివిని చూసిన మరికొంత మంది రైతులు కూడా కొండముచ్చు బ్యానర్లను తయారు చేయించే పనిలో పడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
