SLBC టన్నెల్ దగ్గర కొనసాగుతున్న రెస్క్యూ.. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవి…
SLBC టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్‌ను అధికారులు ముమ్మరం చేశారు. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు NDRF, SDRF, సింగరేణి బృందాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఘటనాస్థలంలో అమాంతం బురద నీరు పెరిగి ఎలక్ట్రిసిటీ వ్యవస్థ దెబ్బతినడంతో చీకట్లు అలుముకున్నాయి. ఎయిర్ బ్లోయర్ ద్వారా గాలిని పంపుతున్న అధికారులు.. టన్నెల్‌లో విద్యుత్ మరమ్మతులు చేపట్టారు.

ఆపరేషన్ SLBC టన్నెల్‌లో భాగంగా.. లోకోమోటివ్ ట్రైన్ ద్వారా భారీ జనరేటర్‌ను సొరంగంలోకి పంపారు. దాని ద్వారా విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మట్టిని తవ్వే పరికరాలు, అండర్ వాటర్ స్కానర్‌తో రెస్క్యూ టీమ్‌లు సొరంగం లోపలికి వెళ్లాయి. టన్నెల్‌లో మట్టి, బురద నీరు ఎక్కువగా ఉండడంతో రెస్క్యూ టీమ్‌లు వెళ్లడానికి ఆటంకం ఏర్పడుతోందన్నారు నాగర్‌కర్నూల్ కలెక్టర్ సంతోష్. భారీ మోటార్లతో నీటిని బయటికి పంపిస్తున్నామని.. సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నామని ఆయన చెప్పారు.
SLBC టన్నెల్ దగ్గరకు చేరుకున్న మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు.. కాంట్రాక్టు ఏజెన్సీలు, రెస్క్యూ సిబ్బందితో భేటీ అయ్యారు. టన్నెల్ దగ్గర కొనసాగుతున్న సహాయక చర్యలను మంత్రులకు వివరించారు అధికారులు. ఎనిమిది మంది ప్రాణాలు రక్షించడమే తమ ప్రధాన లక్ష్యం అన్నారు మంత్రి ఉత్తమ్. టన్నెల్ పైనుంచి, పక్క నుంచి తవ్వేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆయన తెలిపారు.
SLBC టన్నెల్ కూలిన ప్రాంతంలో పైనుంచి తవ్వేందుకు ఉన్న అవకాశాలపై అధికారులతో సమీక్ష చేశారు. కొండపై నుంచి టన్నెల్‌లోకి చేరుకోవాలంటే సుమారు 450 మీటర్లు తవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. SLBC టన్నెల్‌లో పైకప్పు కూలడంతో మట్టి, బురద నీరు భారీగా చేరుకుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రెస్క్యూ టీమ్‌లు నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మట్టి, బురదనీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
సీఎం రేవంత్‌రెడ్డికి రాహుల్‌గాంధీ ఫోన్ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై మాట్లాడిన రాహుల్.. ప్రమాదం జరిగిన తీరు, సహాయక చర్యలపై ఆరా తీశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
