AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vasalamarri : సంబరపడిపోతోన్న వాసాలమర్రి.. అధినేత ఎంట్రీతో ఇక తమ గ్రామ రూపురేఖలు మారనున్నాయని ఆనందం

వాసాలమర్రి మురిసిపోతుంది. అధినేత రాక నేపథ్యంలో సంబురపడుతోంది. ఇక తమ గ్రామ రూపురేఖలు మారనున్నాయని సంతోషం వ్యక్తం చేస్తోంది. సీఎం రాక కోసం

Vasalamarri : సంబరపడిపోతోన్న వాసాలమర్రి.. అధినేత ఎంట్రీతో ఇక తమ గ్రామ రూపురేఖలు మారనున్నాయని ఆనందం
Kcr Vasalamarri
Venkata Narayana
|

Updated on: Jun 22, 2021 | 12:17 PM

Share

CM KCR visit to Vasalamarri : వాసాలమర్రి మురిసిపోతుంది. అధినేత రాక నేపథ్యంలో సంబురపడుతోంది. ఇక తమ గ్రామ రూపురేఖలు మారనున్నాయని సంతోషం వ్యక్తం చేస్తోంది. సీఎం రాక కోసం మామిడి తోరణాలు కట్టింది. స్వాగత ఏర్పాట్లు సిద్ధం చేసింది. మొత్తంగా స్వాగతం పలికేందుకు ముస్తాబైంది. స్వాగతం.. సుస్వాగతం.. ప్రియతమ అభిమాన నేత.. తెలంగాణ సీఎం కేసీఆర్ గార్కి అంటోంది వాసాలమర్రి.

జిల్లా కేంద్రం భువనగిరికి 22 కిలో మీటర్లు దూరం. తుర్కపల్లి మండల కేంద్రానికి 3 కిలో మీటర్లు, భువనగిరి-గజ్వేల్‌ జాతీయ రహదారిపైనే ఉన్నా అభివృద్ధిలో అతీగతీ లేదు. నిధుల లేమియో తెలియదు, పాలకుల చిన్నచూపో అర్థం కాదు కాని.. హైవే పైనే ఉన్నా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. అటు వైపు వెళ్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిలో పడింది. గతేడాది అక్టోబర్‌ 31న జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక భవనాన్ని ప్రారంభించి తిరుగు ప్రయాణంలో వాసాలమర్రి వద్ద కొద్దిసేపు ఆగారు సీఎం కేసీఆర్‌. ఊరి సమస్యలపై స్థానిక ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

మరుసటి రోజు గ్రామస్తులను ఫాంహౌజ్‌కు పిలిపించుకుని మాట్లాడిన సీఎం కేసీఆర్‌.. సంబంధిత శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడి వాసాలమర్రి గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పది, పదిహేను రోజుల్లో వాసాలమర్రికి వచ్చి గ్రామస్థులతో సహపంక్తి భోజనం చేస్తానని మాటిచ్చారు. అయితే కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో సీఎం పర్యటనకు బ్రేక్‌ పడింది.

తాజాగా.. వాసాలమర్రి సర్పంచ్‌ పోగుల ఆంజనేయులుకు ఫోన్‌ చేసిన సీఎం కేసీఆర్‌ మంగళవారం రాబోతున్నట్లు ప్రకటించారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాలని సూచించారు. గ్రామస్థులందరికీ తానే భోజనాలు ఏర్పాటు చేయిస్తా, అందరం కలిసి సహపంక్తి భోజనాలు చేద్దామని చెప్పారు. గ్రామ అభివృద్ధిపై సమాలోచనలకు సభ ఏర్పా టు చేసుకుందామన్నారు. అందుకు అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు.

వాసాలమర్రిలో 494 గృహాలు ఉండగా 100కు పైగా మాత్రమే పక్కా గృహాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీకి కొత్తభవనం నిర్మించాల్సి ఉంది. డ్వాక్రా మహిళలకు సొంత భవనం ఏర్పాటు చేయాలి. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో.. ప్రతీ రోజు నగరాలకు పనుల కోసం వెళ్తున్నారు కార్మికులు. గ్రామంలో కోతులు విపరీతంగా ఉన్నాయి. వాటి బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.

సీఎం రాక నేపథ్యంలో 4 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. గ్రామస్తులతో సీఎం కేసీఆర్ గ్రామసభ నిర్వహించనున్నారని అంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. గ్రామస్తుల సమక్షంలో గ్రామసభలో గ్రామాభివృద్ధికి అవసరమైన ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి చెప్తున్నారు.

ఇచ్చిన మాట కోసం వస్తున్న అధినేత రాకతో గ్రామానికి మహర్దశ పట్టనుందని గ్రామస్తులు మురిసిపోతున్నారు. అయితే ఎలాంటి ప్రణాళిక రచించబోతున్నారు? గ్రామ రూపురేఖలు ఎలా మారనున్నాయి అంశంపై సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Read also : Vasalamarri visit : దత్తత గ్రామంలో ఇవాళ సీఎం కేసీఆర్ పర్యటన, గ్రామస్తులందరితో కలిసి భోజన కార్యక్రమం, బహిరంగ సభ