TS Inter Exams: విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం.. ఇంటర్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
Telangana Inter Exams: తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Telangana Inter Exams : తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ పరీక్షలను ఆపలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది. చివరి నిమిషంలో ఇంటర్ పరీక్షల్లో తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. ఈ నెల 25 నుంచి జరగాల్సిన తెలంగాణ ఇంటర్ మొదటి పరీక్షలు రద్దు చేయాలంటూ.. రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం శుక్రవారం అత్యవసర విచారణ చేపట్టింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ప్రమోటైన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దంటూ న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఈ నెల 25 నుంచి పరీక్షలు ఉండగా పిటిషన్ వేస్తే ఎలా అంటూ ప్రశ్నించింది. చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని సూచించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని.. విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్షలను వాయిదా వేయలేమని స్పష్టంచేసింది. దీంతో పిటిషనర్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో 25 నుంచి ఇంటర్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అధికారులు పరీక్షలను నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు తరుపున న్యాయవాది మాట్లాడుతూ.. విద్యార్థులు కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు కూడా రాయలేదని, వచ్చే ఏడు కూడా ఏవైనా అవాంతరాలు వచ్చి ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలు కూడా రాయలేకపోతే ఈ విద్యార్థుల నైపుణ్యాలను ఎలా పరిగణించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవు కావున.. సోమవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో చివరి నిమిషంలో తాము జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు పేర్కొంది.
Also Read: