Munugode Bypoll: టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ నామినేషన్.. మునుగోడులో భారీ ర్యాలీ..
కూసుకుంట్ల ప్రభాకర్ ప్రభాకర్ వెంట మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో..

మునుగోడు ఉపఎన్నికలో నామినేషన్ల సందడి కొనసాగుతోంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ నామినేషన్ వేయనున్నారు. ప్రభాకర్ వెంట మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఈ నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్నారు. బంగారి గడ్డ నుంచి చండూరు ఆర్వో ఆఫీసు వరకు టీఆర్‌ఎస్ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరోవైపు మునుగోడులో ఇప్పటి వరకూ 32 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతి సైతం నామినేషన్ దాఖలు చేశారు.
ఇదిలావుంటే.. శుక్రవారంతో మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ పూర్తికానుంది. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన, 17వ తేదీన నామినేషన్ల విత్ డ్రా ఉండనుంది. వచ్చే నెల 3వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ ఆరవ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదే రోజు ఫలితాలను వెలువరించనున్నారు ఎన్నికల అధికారులు.
భవిష్యత్తు ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక గీటురాయిగా మారుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు అదే తరహాలో భావిస్తుండటంతో తమ సర్వ శక్తులను ఒడ్డి మునుగోడు ఓటర్ల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నికను తెలంగాణ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయవర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే.. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చుతూ నిర్ణయంతీసుకున్న తర్వాత జరుగుతున్న ఎన్నిక కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
