Watch Video: మహిళా పీఈటీ టీచర్ పైత్యం.. బాత్రూం డోర్లు పగులగొట్టి విద్యార్థినులు స్నానాలు చేస్తుండగా వీడియో చిత్రీకరణ! రోడ్డెక్కి నిరసన
క్రమశిక్షణ పేరుతో గురుకుల మహిళా పీఈటీ టీచర్ విద్యార్థినులపై కర్కషంగా వ్యవహరించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పీఈటీ టీచర్ జ్యోత్స్న బారి నుంచి తమను రక్షించాలని కోరుతూ విద్యార్థినులు గురువారం తెల్లవారుజూమున 5 గంటల సమయంలో పాఠశాల గోడదూకి సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి..
సిరిసిల్ల, సెప్టెంబర్ 13: క్రమశిక్షణ పేరుతో గురుకుల మహిళా పీఈటీ టీచర్ విద్యార్థినులపై కర్కషంగా వ్యవహరించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పీఈటీ టీచర్ జ్యోత్స్న బారి నుంచి తమను రక్షించాలని కోరుతూ విద్యార్థినులు గురువారం తెల్లవారుజూమున 5 గంటల సమయంలో పాఠశాల గోడదూకి సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న పీఈటీ టీచర్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుతూ నినాదాలు చేశారు.
తంగళ్లపల్లి మండలం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో గత ఐదేళ్లుగా జ్యోత్స్న పీఈటీగా విధులు నిర్వహిస్తుంది. బదిలీ అయినప్పటికీ కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని మరీ ఇక్కడే కొనసాగుతోంది. గురుకుల పాఠశాలలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. విద్యార్థినులను బూతులు తిడుతూ దాడి చేస్తోందని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఇద్దరు బాలికలు బాత్‌రూమ్‌లలో స్నానం చేస్తున్నారు. అయితే ప్రార్థన సమయంలో ఆలస్యంగా స్నానాలు చేస్తున్నారన్న నెపంతో పీఈటీ టీచర్ జ్యోత్స్న బాత్‌రూమ్‌ల తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించింది. అనంతరం స్నానం చేస్తున్న విద్యార్ధులను తన ఫోన్‌లో వీడియో తీసి, కర్రతో చితకబాదింది.
Sircilla, Telangana: Students at a residential school protested against a PT teacher who allegedly filmed them while bathing. The protest ended after authorities assured action, and an investigation is underway pic.twitter.com/xWIDoklXxT
— IANS (@ians_india) September 12, 2024
దీంతో ఆగ్రహించిన గురుకుల విద్యార్థినులు పాఠశాల గోడ డూకి రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రహదారిపై ఆందోళన చేస్తున్న సంగతి తెలుసుకున్న సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, తంగళ్లపల్లి ఎస్సై డి సుధాకర్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. దీంతో బాలికలు పాఠశాల గేటు ఎదుట బైఠాయించి మళ్లీ ఆందోళనకు దిగారు. దీంతో పలు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని బాలికలకు మద్దతుగా నిలిచారు. రంగంలోకి దిగిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా హుటాహుటిన గురుకుల పాఠశాలకు చేరుకుని.. జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్‌తో మాట్లాడి పీఈటీ జ్యోత్స్నను విధుల నుంచి తొలగించారు. అనంతరం సదరు మహిళా పీఈటీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సీఐ మొగిలిని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పీఈటీ టీచర్ జ్యోత్స్నపై కేసు నమోదు చేశారు.