చావే దిక్కు అంటూ భార్య బాధిత కుటుంబం ఆవేదన.. సంచలనం రేపుతున్న యువతి వీడియో!

హైదరాబాద్‌ మహానగరానికి చెందిన ఓ యువతి తన అన్న తరపున సోషల్‌ మీడియాలోకి వచ్చి సమాజాన్ని, న్యాయ వ్యవస్థను ప్రశ్నించింది. పది రోజుల వివాహ బంధం వల్ల.. ఐదేళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్న తన అన్నకు.. అతుల్‌ సుభాష్‌లా సూసైడ్‌ చేసుకోవడమే దిక్కా అని అడుగుతోంది ఆ యువతి.

చావే దిక్కు అంటూ భార్య బాధిత కుటుంబం ఆవేదన.. సంచలనం రేపుతున్న యువతి వీడియో!
Wifevictims
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 10, 2025 | 8:29 PM

మొన్న బెంగళూరులో టెకీ అతుల్ సుభాష్.. నిన్న ఢిల్లీ ఓ కేఫ్ యజమాని పునీత్ ఖురానా.. ఆ తర్వాత గుజరాత్‌లో సురేశ్ సథాదియా, ఇలా భార్య బాధితుల వరుస ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇవి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. భార్య బాధితుల గోడును ప్రపంచానికి చాటుతున్నాయి. 498-A కేసులతో నలిగిపోతున్న భార్య బాధితులు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నాయి. లేటెస్టుగా ఈ సెగ తెలుగు నేలకు తాకింది. ఓ యువతి తన గోడును వీడియో ద్వారా ప్రపంచానికి వెళ్లబోసుకుంది. తన వదిన పెట్టిన కేసులతో ఐదేళ్లుగా తమ కుటుంబ సభ్యులమంతా నరకం చూస్తున్నామని ఆ మహిళ వాపోయింది.

ఈ కాలంలో భార్యాభర్తలు కనీసం పదేళ్లు కలిసుండడం పెద్ద అచీవ్‌మెంట్‌గా మారుతోంది. పెళ్లైన మొదట్లోనే ఒకరినొకరు తిట్టుకోవడం.. చిన్న గొడవలను పెద్దవి చేసుకుని విడాకులకు వెళ్లడం పరిపాటిగా మారాయి. అయితే, అన్ని కేసుల్లో భర్తే నిందితుడా? అన్ని కుటుంబ వివాదాల్లో భర్తే రాక్షసుడా? కుటుంబ కథా చిత్రమ్‌లో భర్త ఎప్పుడు విలనేనా? మా గోడు కూడా వినండి అంటూ కొందరు భార్య బాధితులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. గత ఏడాది సంచలనం రేపిన.. అతుల్‌ సుభాష్‌ సూసైడ్‌.. ఓ కేస్‌ స్టడీగా మారుతోంది. అతుల్‌ సుభాష్‌ ఆత్మహత్యతో ఎంతోమంది భార్యాబాధితులు వెలుగులోకి వస్తున్నారు.

ఓ హైదరాబాద్‌ యువతి తన అన్న తరపున సోషల్‌ మీడియాలోకి వచ్చి సమాజాన్ని, న్యాయ వ్యవస్థను ప్రశ్నించింది. పది రోజుల వివాహ బంధం వల్ల.. ఐదేళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్న తన అన్నకు.. అతుల్‌ సుభాష్‌లా సూసైడ్‌ చేసుకోవడమే దిక్కా అని అడుగుతోంది ఆ యువతి. 2019లో హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌, రాజమండ్రికి చెందిన అమ్మాయిని వివాహమాడాడు. పెళ్లై పదిరోజుల గడవక ముందే ఆ అమ్మాయి అత్తారిల్లు విడిచి రాజమండ్రి వెళ్లిపోయింది. అక్కడ భర్తపై 498-A కేసు పెట్టడంతో.. ఆయనతోపాటు వారి కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. ఆ అమ్మాయి తమ ఇంట్లో ఉన్న పదిరోజులు కూడా విచిత్రంగా ప్రవర్తించి అందరిని తిట్టి.. తన భర్తను సైతం వేధించి వెళ్లిపోయిందంటూ బాధితుడి చెల్లి సోషల్‌ మీడియాలో ఆవేదనతో కూడిన వీడియోని పోస్ట్‌ చేసింది.

మ్యాట్రిమోనీలో చూసి మంచి అమ్మాయి అనుకుని తన అన్న పెళ్లి చేసుకున్నాడని.. ఐదేళ్ల నుంచి కోర్టుల చుట్టూ తిరగడమే కానీ, ఆమె ఒక్క రోజు కూడా కేసు విచారణకు హాజరుకాలేదని ఆ యువతి చెప్పింది. ఈ 498-A కేసు.. ఫాల్స్‌ కేసు అంటున్న ఆ యువతి.. తన అన్న ఐదేళ్లుగా మానసిక వేదన అనుభవిస్తున్నాడని వాపోయింది. తన తల్లిదండ్రులపైనా కేసు పెట్టడం వల్ల వారి ఆరోగ్యం క్షీణించినట్లు బాధితుడి చెల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు క్రిమినల్‌ కేసు ఉండడం వల్ల తన విలువైన కెరీర్‌ దెబ్బతిన్నదని, మంచి చదువులు చదివినా.. కనీసం పాస్‌పోర్టు కూడా రావడం లేదంది. ఇలాంటి కేసులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారించాలని, రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తోంది బాధితుడి చెల్లి. లేకుంటే అతుల్‌ సుభాష్‌ లాంటి మరెంతోమంది బాధితులు సూసైడ్‌ చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

మొన్న టెకీ అతుల్ సుభాష్.. నిన్న కేఫ్ యజమాని పునీత్ ఖురానా.. తర్వాత గుజరాత్‌తో సురేశ్ సథాదియా.. ఇలా భార్యాబాధితుల వరుస ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలను కొందరు దుర్వినియోగం చేస్తూ.. భర్త, అత్తింటివాళ్లను తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అతుల్‌ సుభాష్‌, 2019లో నిఖితను వివాహం చేసుకున్నారు. 2021లో నిఖిత బెంగళూరులో భర్తను విడిచిపెట్టి కొడుకుతో సహా పుట్టింటికి చేరింది. ఆపై భర్త, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. కేసు విచారణ కోసం అతుల్‌.. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పురలోని ఫ్యామిలీ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో మానసికంగా, శారీరకంగా అలసిపోయిన అతుల్‌ సుభాష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే క్రమంలో తన భార్య, ఆమె కుటుంబం ఏ స్థాయిలో మానసికంగా వేధించిందో పేజీల కొద్దీ రాసిన సూసైడ్‌ లేఖ, 90 నిమిషాల నిడివితో తీసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది. కొడుకును అడ్డుపెట్టుకుని తన భార్య ఆర్థికంగా తనను దోచుకుందని.. న్యాయస్థానంలోనూ తనకు అన్యాయం జరిగిందని, ఇంకా తన వల్ల కాకనే ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు.

ఈ ఘటన తర్వాత.. లక్షల మంది మెన్‌టూ తోపాటు జస్టిస్‌ ఈజ్‌ డ్యూ, జస్టిస్‌ ఫర్‌ అతుల్‌ అంటూ సోషల్‌ మీడియాలో ఉద్యమ చేపట్టారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ తర్వాత ఢిల్లీలోని ఫేమస్ వుడ్‌‌బాక్స్ కేఫ్‌‌ ఓనర్ పునీత్ ఖురానా కూడా తన భార్య మణిక పహ్వా వేధిస్తోందంటూ వీడియో రిలీజ్‌ చేసి సూసైడ్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత గుజరాత్‌, తమిళనాడులో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఓ యువతి విడుదల చేసిన వీడియోతో…మరోసారి భార్యాబాధితుల విషయం హాట్‌ టాపిక్‌గా మారింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..