CM Revanth Reddy: మీరు వెళతారా నన్ను రమ్మంటారా.. జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్!

జిల్లాల కలెక్టర్ల సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కలెక్టర్లదేనని, వారి పనితీరే ప్రభుత్వ పనితీరుకు కొలమానం అని అన్నారు.

CM Revanth Reddy: మీరు వెళతారా నన్ను రమ్మంటారా.. జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్!
Cm Revanth Reddy In Collectors Conference
Follow us
Prabhakar M

| Edited By: Balaraju Goud

Updated on: Jan 10, 2025 | 8:18 PM

రిపబ్లిక్ డే… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రూషియల్ డే కాబోతోంది. ఏడాది పాలన విజయోత్సవాల్ని వైభవంగా జరుపుకున్న రేవంత్ ప్రభుత్వానికి.. ఇది నెక్ట్స్‌ వెర్షన్ కాబోతోంది. రైతుభరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. ఇందిరమ్మ ఇళ్లు.. ఇలా అనేక పథకాలకు ఈనెల 26ను ముహూర్తంగా పెట్టుకుని.. ముందుకెళ్తున్న సీఎం రేవంత్.. ఆ పథకాల అమలును కూడా సీరియస్‌గా తీసుకున్నారు. అందులో భాగమే.. శుక్రవారం(జనవరి 10) జరిగిన కలెక్టర్ల సదస్సు.

కొత్త పథకాల అమలుపై దిశానిర్దేశం చేయడమే ఎజెండాగా సచివాలయంలోని ఏడో అంతస్తులో కలెక్టర్లతో భేటీ ఆయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కూడా సరిగ్గా మానిటర్ చేయలేరా.. కనీసం ఫీల్డ్ విజిట్ చేయాలన్న కామన్‌సెన్స్ కూడా లేదా.. మరీ ఇంత అలసత్వమా..? అని కలెక్టర్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారుడి వరకు చేరాలంటే ఈ పనితీరు సరిపోదన్నారు. మీరు మారాలి.. అంటూ స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా… చెడ్డపేరు వచ్చినా కలెక్టర్ల పెర్ఫామెన్సే కీలకం కనుక.. కొత్త పథకాల అమలుపై దిశానిర్దేశం కోసం కలెక్టర్లకు స్పెషల్ క్లాస్ తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

కులగణన సర్వే ప్రగతిపై అభినందనలు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కులగణన సర్వే 96 శాతం పూర్తి చేయడంపై జిల్లా కలెక్టర్లను సీఎం అభినందించారు. “ప్రజల కోసం కష్టపడటం కలెక్టర్ల కర్తవ్యం. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి, సమస్యలను ప్రత్యక్షంగా అర్థం చేసుకుని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది,” అని ఆయన పేర్కొన్నారు. “మేము గతంలోనే క్షేత్రస్థాయి పర్యటనల ఆదేశాలు ఇచ్చాం. కానీ, కొంతమంది ఇంకా ఆఫీసుల్లోనే కూర్చునే పని చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాలయాపన చేయకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించి అనర్హులను గుర్తించాలి,” అని సీఎం రేవంత్ అన్నారు.

ప్రతిష్టాత్మక పథకాలకు ప్రిపరేటరీ వర్క్

జనవరి 11 నుండి 15 లోగా ప్రతిష్టాత్మక పథకాల అమలుకు కావలసిన ప్రిపరేటరీ వర్క్ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. జనవరి 26 న ప్రభుత్వం పేదల కోసం కొన్ని ముఖ్యమైన పథకాలను ప్రారంభించబోతోందని ప్రకటించారు. ఇందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల వ్యవస్థను మరింత పటిష్టం చేయడంపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. తెలంగాణలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలి. వన్ రేషన్ వన్ స్టేట్ విధానాన్ని తీసుకురాబోతున్నామని సీఎం చెప్పారు.

అనర్హులకు సంక్షేమం కట్టడికి చర్యలు

ముఖ్యంగా రైతు భరోసా అమలు కలెక్టర్లకు బిగ్ ఛాలెంజ్ కాబోతోంది. వ్యవసాయానికి యోగ్యమైన భూములన్నింటికీ ఎకరానికి ఏటా 12వేల రూపాయలు ఇవ్వాలన్నది కేబినెట్ నిర్ణయం. రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, మైనింగ్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలకు ఇచ్చిన భూముల్ని ఎలా వేరు చేయాలి.. అనే అంశంపై చర్చ జరిగింది. కోటీ 39లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ దగ్గర ఇప్పటికే ఓ లెక్కుంది. వెరసి, అనర్హులకు రైతు భరోసా ఇవ్వొద్దని, అనర్హులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలన్న సీఎం, “భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తిస్తుంది,” అని స్పష్టం చేశారు. అలాగే.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో భూమిలేని రైతు కూలీలకు ఈనెల 26 నుంచి ఏటా 12 వేల రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం. ఈ పథకం కోసం కౌలు రైతుల జాబితా ఎలా సిద్ధం చేయాలో కలెక్టర్లతో చర్చించారు సీఎం రేవంత్‌రెడ్డి. భూమి లేని పేద రైతు కూలీ కుటుంబాలు రాష్ట్రంలో సుమారు 11 లక్షలు ఉన్నారన్నది ఒక ప్రాధమిక అంచనా.

సమగ్ర తనిఖీలతో చర్యలు

జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ జరగనుంది. ఇందుకోసం ఈనెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరించబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కూడా కలెక్టర్ల సదస్సులో చర్చ జరిగింది. కొత్త కార్డుల కోసం సుమారు పది లక్షల కుటుబాల నుంచి దరఖాస్తులు రావచ్చని తెలుస్తోంది. అటు.. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. త్వరలో ల‌బ్దిదారుల ఎంపిక పూర్తి చేసి ఇండ్ల నిర్మాణం చేపట్టాలన్నది ప్రభుత్వం ఆలోచన. కొత్త పథకాల అమలులో అలసత్వం వహిస్తే తీవ్ర చర్యలుంటాయని సీఎం హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ కొందరు అధికారులు బీఆర్‌ఎస్ జమానాలో ఉన్నట్టే భావిస్తున్నారని, వాళ్లపై నజర్ పెట్టాల్సి ఉందని రేవంత్‌రెడ్డి సూచించారట. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి సదస్సు ముగింపు సందర్భంగా ముఖ్యమైన హెచ్చరికలు చేశారు. జనవరి 26 తరువాత తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని, నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ హెచ్చరించారు.

సామాజిక సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలలో ఒక్కసారి ప్రభుత్వ హాస్టల్స్‌ను సందర్శించి, రాత్రి బస చేయాలని సీఎం సూచించారు. మహిళా అధికారులు బాలికల హాస్టల్స్‌కు వెళ్లి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపాలన్నారు. సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూనే, వారి పనితీరును మెరుగుపరచాలని సూచించారు. సంక్షేమ పథకాలు పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడం లక్ష్యమని, ఆ మార్పును సాధించేందుకు కలెక్టర్లు మరింత కృషి చేయాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..