Telangana Integration Day: విచ్ఛిన్నకర శక్తుల నుంచి తెలంగాణను కాపాడుకోవాలి.. ఎనిమిదేళ్లలో ఎన్నో చేశాం.. సీఏం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎనిమిదేళ్ల తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని.. తెలంగాణ ప్రజల సంక్షేమానికి ఎన్నో పథకాలు రూపకల్పన చేశామన్నారు తెలంగాణ సీఏం కె.చంద్రశేఖర్ రావు. తెలంగాణ జాతీయ..

Telangana Integration Day: విచ్ఛిన్నకర శక్తుల నుంచి తెలంగాణను కాపాడుకోవాలి.. ఎనిమిదేళ్లలో ఎన్నో చేశాం.. సీఏం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana CM KCR
Follow us
Amarnadh Daneti

| Edited By: Ravi Kiran

Updated on: Sep 17, 2022 | 3:59 PM

Telangana Integration Day: ఎనిమిదేళ్ల తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని.. తెలంగాణ ప్రజల సంక్షేమానికి ఎన్నో పథకాలు రూపకల్పన చేశామన్నారు తెలంగాణ సీఏం కె.చంద్రశేఖర్ రావు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తొలుత జాతీయ పతకాన్ని ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాచరిక వ్యవస్థ నుంచి తెలంగాణ ప్రజలు స్వాతంత్య్రం పొందడడంలో కృషి చేసిన, దేశ స్వాతంత్య్రోద్యమంలో పాలుపంచుకున్న మహానీయులందరినీ స్మరించుకుంటూ.. తెలంగాణ సాధన.. తెలంగాణ వచ్చిన తర్వాత సాధించిన ఫలితాలను వివరిస్తూ కేసీఆర్ ప్రసంగం సాగింది. యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని.. అందుకే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఇటీవల భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా, ప్రతి హృదయంలో భారతీయతా భావన ఉప్పొంగేలా 15 రోజులపాటు అద్భుతంగా జరుపుకున్నామని.. దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలనూ నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

మహానీయులను స్మరిస్తూ: తెలంగాణ వీరుల గురించి కేసీఆర్ ప్రస్తావిస్తూ.. ఆదిలాబాద్ అడవుల్లో తుడుం మోత మోగించి, అడవిబిడ్డలను ఒక్కటి చేసి, జల్ జంగల్ జమీన్ కోసం సింహగర్జన చేసిన ఆదివాసి యోధుడు కొమరం భీమ్ సాహసాన్ని సగర్వంగా తలుచుకోవాలన్నారు. భూస్వాముల ఆగడాలకు బలైన దొడ్డి కొమురయ్య అమరత్వాన్ని వినమ్రంగా గుర్తు చేసుకుందామన్నారు. తన వందల ఎకరాల సొంత భూమిని పేద ప్రజలకు పంచిన త్యాగశీలి, రైతాంగ పోరాటానికి తిరుగులేని నాయకత్వాన్ని అందించిన వీరాగ్రేసరుడు, మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నెహ్రూ కన్నా అత్యధిక మెజారిటీని సాధించిన మహా నాయకుడు రావి నారాయణరెడ్డికి ఈసందర్భంగా ఘనమైన నివాళులర్పించాలని పేర్కొన్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో రాజకీయాల్లో అడుగిడి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ను స్థాపించి, పివి నరసింహారావు వంటి ఎంతోమంది నాయకులను తీర్చిదిద్దిన స్వామి రామానంద తీర్థను స్మరించుకోవాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ పల్లెల్లో గ్రంథాలయ స్థాపనను యజ్ఞంలా నిర్వహిస్తూ, కఠోరమైన జైలు శిక్షలకు వెరవకుండా మొక్కవోని ధైర్యంతో పోరాడిన సర్దార్ జమలాపురం కేశరావు, వట్టికోట ఆళ్వార్ స్వామిల కృషిని కేసీఆర్ ప్రశంసించారు.

భూపోరాటాలకు గొప్ప ప్రేరణనిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిని ఆవాహన చేసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఐలమ్మ పోరాటానికి దన్నుగా నిలిచి, ఉద్యమాన్ని మలుపు తిప్పిన వ్యూహకర్త, వందలాది ఎకరాల తన సొంత భూమిని పేదలకు పంచిన మానవతావాది, మచ్చలేని మహానాయకుడు భీంరెడ్డి నర్సింహారెడ్డిని సవినయంగా స్మరించుకుందామని పిలుపునిచ్చారు కేసీఆర్ ఇలా ఎంతో మంది తెలంగాణ యోధుల పేర్లను కేసీఆర్ స్మరించుకున్నారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ఆకాంక్ష.. సాధన: 1956లో దేశంలో జరిగిన రాష్ట్రాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా.. తెలంగాణ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ-ఆంధ్రలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుండి తెలంగాణ ప్రజలలో తాము మోసపోయామని, దోపిడీకి గురువుతున్నామనే ఆందోళన గూడు కట్టుకుందన్నారు. ఇరుప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదని, సఖ్యత ఏర్పడలేదని తన ప్రసంగంలో కేసీఆర్ పేర్కొన్నారు. అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్దకాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడిందని, సమస్యను పరిష్కరించాల్సిన ఆనాటి కేంద్రప్రభుత్వం అందుకు భిన్నంగా సాచివేత ధోరణిని అవలంభించిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు భయపడినట్లుగానే సమైక్య రాష్ట్రంలో అన్నిరంగాల్లో దారుణమైన వివక్ష అమలైందని, ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష క్రమేపీ బలపడుతూ వచ్చిందన్నారు.

2001లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి తానే స్వయంగా సారథ్యం వహించి, ఉద్యమశంఖం పూరించానని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలందరినీ ఒక్కటిచేసి, 14 ఏళ్లు అవిశ్రాంత పోరాటాన్ని నడిపించానన్నారు. లక్ష్య సాధన కోసం మరణం అంచులదాకా వెళ్లేందుకు సిద్ధపడ్డానని చెప్పారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం అంతకంతకూ తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం దిగివచ్చిందని, ప్రజా ఉద్యమం ఆశించిన గమ్యాన్ని ముద్దాడిందన్నారు. 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని తెలిపారు. తెలంగాణ ఏవిధంగా ఉండాలని ఇక్కడి ప్రజలు స్వప్నించారో, సంభావించారో.. అదేవిధంగా నేడు తెలంగాణ అన్నిరంగాల్లోనూ అగ్రగామి రాష్ట్రంగా పురోగమిస్తోందన్నారు.

ఎనిమిదేళ్లలో అభివృద్ధి: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకున్న ఉద్దీపన చర్యల ఫలితంగా వ్యవసాయం విస్తరించడమేగాకుండా, వ్యవసాయోత్పత్తులు కనీవినీ ఎరుగని స్థాయిలో పెరిగిపోయాయని కేసీఆర్ తెలిపారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత కేవలం ఆరునెలల వ్యవధిలోనే అన్నిరంగాలకు 24 గంటలు నిర్విరామంగా, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో అన్నిరంగాలకూ 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం ఇక్కడి ప్రజలకు ఎంతో గర్వకారణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన నిర్విరామ కృషి ఫలితంగా నేడు రాష్ట్రంలో దాదాపు కోటి ఎకరాలకు సాగునీటి సదుపాయం కలిగిందన్నారు. గురుకుల ఆవాసీయ విద్యలో దేశంలో తెలంగాణదే అగ్రస్థానం అని గుర్తుచేశారు. వైద్య ఆరోగ్యరంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని తెలిపారు. ప్రతి జిల్లాకు ఒక వైద్య కాలేజీ ఏర్పాటు చేసే యజ్ఞం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో మరో 2 వేల పడకలను ప్రభుత్వం అదనంగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించిందని తెలిపారు. వీటితోపాటు పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు – పల్లె దవాఖానాలు చక్కని సేవలందిస్తున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హరిత నిధిని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం నూతన ఒరవడిని సృష్టించిందని తెలిపారు. ప్రశాంతమైన, సురక్షితమైన, ప్రగతిశీల వాతావరణం ఉన్నచోటనే పారిశ్రామిక అభివృద్ధి పరుగులు తీస్తుందని, అందుకు నిజమైన నిదర్శనం మన తెలంగాణ రాష్ట్రమని కేసీఆర్ ఉద్ఘాటివంచారు.

విచ్ఛిన్నకర శక్తులతో జాగ్రత్త: సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్రం ప్రగతిబాటలో పయనిస్తున్న తరుణంలో మతతత్వ శక్తులు తమ వికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఏ దేశమైనా, ఏ సమాజమైనా తన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ, వాటిలోని మంచి చెడులను అర్ధం చేసుకుంటూ అప్రమత్తంగా ముందడుగు వేయాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు కేసీఆర్. ఒకనాడు జరిగిన ఏమరుపాటు వల్ల తెలంగాణ 58 సంవత్సరాలు శాపగ్రస్త జీవితం అనుభవించిందని చెప్పారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని కేసీఆర్ ఆరోపించారు. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధంలేని ఈ అవకాశవాదులు ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం.. తన బుద్ధి కుశలతను ప్రదర్శించి స్వరాష్ట్రాన్ని సాధించుకుందని, అదే క్రియాశీలతను, బుద్ధి కుశలతను మరోమారు చూపించాలని పిలుపునిచ్చారు. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట, భ్రష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాలని, ఈ విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం కల్లోలంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నానంటూ కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

భారత జాతి జాగృతి కోసం, అభ్యున్నతి కోసం మనవంతు దోహదం చేద్దామని తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను అంటూ శాంతి మంత్రం సహనావవతు సహనౌ భునక్తు శ్లోకాన్ని చెప్పి.. జైహింద్.. జై తెలంగాణ నినాదంతో తన ప్రసంగాన్ని ముగించారు కేసీఆర్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..