AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana History: ఆ ఊర్లో ఎటు చూసిన ఆలయాలే.. నేల తవ్వినా గుడులే.. తెలంగాణలోని ఈ గ్రామం ఎక్కడంటే..!

Nagunur Temples: ఆ ఊరు ఒక్కటే కానీ.. నాలుగొందల ఆలయాలు. భూమి మీదే కాదు నేల కిందా ఆలయాలెన్నో లెక్క లేదు. ఒక్కక నంది విగ్రహాలే వంద బయట పడ్డాయంటే..

Telangana History: ఆ ఊర్లో ఎటు చూసిన ఆలయాలే.. నేల తవ్వినా గుడులే.. తెలంగాణలోని ఈ గ్రామం ఎక్కడంటే..!
Temples
Shiva Prajapati
|

Updated on: Sep 03, 2022 | 10:06 PM

Share

Nagunur Temples: ఆ ఊరు ఒక్కటే కానీ.. నాలుగొందల ఆలయాలు. భూమి మీదే కాదు నేల కిందా ఆలయాలెన్నో లెక్క లేదు. ఒక్కక నంది విగ్రహాలే వంద బయట పడ్డాయంటే.. అక్కడి పురాతన శిల్ప కళావైభవం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు? ఇంతకీ ఎక్కడుందా ఆలయ గ్రామం? ఆ పూర్తి వివరాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం..

కరీంనగర్ జిల్లా కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది నగనూర్ గ్రామం. ఈ గ్రామంలో సుమారు 400 ఆలయాలుండటం ఒక ప్రత్యేకత. ఈ ఊరుని మొదట నన్నూర్ గా తర్వాతి కాలంలో నగనూర్ గా పిలుస్తున్నారు ఇక్కడి వారు. ఎత్తైన కొండలున్న ఈ ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలించారనీ, కొండల మాటు నుంచి శతృవుల జాడ పసిగట్టేవారనీ చెబుతారు చరిత్రకారులు. ఎక్కడైతే కాకతీయుల పరిపాలన ఉంటుందో.. అక్కడ ఆధ్యాత్మిక శోభ పొంగిపొర్లుతుందని అంటారు. కాకతీయులు శివభక్తులు కూడా కావడంతో.. ఒకే ఆలయంలో మూడు శివలింగాల ప్రతిష్ట, ఆ లింగాలకు ఎదురుగా నందుల ప్రతిష్టాపన జరిగాయని చెబుతారు.

ఆలయాల ఎదుట ధ్వజ స్థంభాలు, నీటి కోసం కోనేర్లు, చేద బావులు, సైన్యం ఉండటానికి సొరంగ మార్గం.. ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారం ఇక్కడి ఆలయ ప్రాంగణం. దక్షిణాదిలో ఎర్రబండతో తయారు చేసిన ఆలయాలు ఇక్కడ మాత్రమే ఉండటం విశేషం. మూడు శివలింగాలు ఒకే చోట ప్రతిష్టించిన ఈ ఆలయంపేరు త్రికూట ఆలయం. ఈ పురాతన ఆలయం శిథిలావస్థలోకి చేరుకుంది. అయినా సరే ఇక్కడి ధ్వజస్థంభాలు, ఇతర రాళ్లు చెక్కు చెదరక పోవడం గమనించాల్సిన విషయం. ఈ గ్రామంలో ఇంటి నిర్మాణాల కోసం తవ్వకాలు చేస్తే.. ఏదో ఒక పురాతన ఆలయం ఆనవాళ్లు లభిస్తాయని చెబుతారు. కోనేరు, పురాతన బావులు వగైరా దర్శనమిస్తుంటాయని అంటారు ఇక్కడి వారు. ఇటీవల ఒక ఇంటి నిర్మాణం కోసం తవ్వగా.. పురాతన నంది విగ్రహం బయట పడ్డం విశేషం.

ఇవి కూడా చదవండి

ఇదొక్కటే కాదు.. ఇలాంటి ఎన్నో పురాతన వస్తువులు ఇక్కడ తరచూ దర్శనమిస్తూనే ఉంటాయి. దీనంతటికీ కారణమేంటని ఆరా తీయగా తెలిసిందేంటంటే.. ఈ ఆలయాల్లో కొన్ని నేల మీదే నిలబడగా, మరికొన్ని భూమిలోకి కుంగిపోయాయనీ అంటున్నారు. అందుకే ఎక్కడ తవ్వినా ఇలాంటి పురాతన ఆనవాళ్లు వెలుగులోకి వస్తున్నట్టు భావిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఇక్కడొక నంది విగ్రహం కింద నిధి నిక్షేపాలుంటాయన్న ఆశకొద్దీ తవ్వే యత్నం చేశారు కొందరు. కానీ, ఆ విగ్రహం ఎంతకీ బయటకు రాక పోవడంతో వదిలేశారు. దీంతో ఈ విగ్రహం ధ్వంసమైందని చెబుతున్నారు చరిత్రకారులు. ఈ గ్రామం అత్యంత పురాతనమైనది కావడం.. అందునా ఇలాంటి పురాతన విగ్రహాలుండటంతో గుప్త నిధుల తవ్వకాల ముఠా తరచూ ఇక్కడ తవ్వకాలు చేస్తోంది. దీంతో వీరి బెడద పడలేక పోతున్నామని వాపోతున్నారిక్కడి వారు.

కాగా, ఈ ప్రాచీన గ్రామానికింత విశిష్టత ఉంటే.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదనీ, ప్రభుత్వం ఈ గ్రామంపై దృష్టి సారిస్తే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దవచ్చని సూచిస్తున్నారు గ్రామస్తులు. అడగడుగునా ఆలయాలున్న ఊరు రాష్ట్రంలో ఇదొక్కటే. ఈ గ్రామాన్ని ఎలాగైనా సరే అభివృద్ధిలోకి తెస్తే.. మరో హంపీ అవుతుందని అంటున్నారు స్థానికులు. నగునూరు గ్రామం.. అపురూపమైన శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనం అని, ఈ పురాతన చరిత్రను ఎలాగైనా సరే భావి తరాలకు అందించాలని ఇక్కడి వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే, గుప్త నిధుల తవ్వకాలు చేసే ముఠాల నుంచి ఈ ఆలయ గ్రామాన్ని కాపాడి.. పరిరక్షించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు స్థానికులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..