Telangana: పట్టపగలు రెచ్చిపోయిన దొంగలు.. రెప్పపాటులో స్కూటీ డిక్కీలో రూ.8 లక్షలు మాయం..!
జహీరాబాద్ పట్టణంలో దొంగలు పక్కా ప్లాన్‌తో భారీ చోరీకి పాల్పడ్డారు. తూముకుంట గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి అనే వ్యక్తి, భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం పట్టణంలోని ఎస్‌బీఐ (SBI) హైవే బ్రాంచ్ నుండి 8 లక్షల రూపాయలను డ్రా చేశాడు. ఆ నగదును తన స్కూటీ డిక్కీలో పెట్టుకుని తహసిల్దార్ కార్యాలయానికి..

సంగారెడ్డి, మార్చి 17: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే నిమిషాల వ్యవధిలో ఎనిమిది లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం తెచ్చుకున్న డబ్బు దొంగల పాలవ్వడంతో బాధితుడు కన్నీరుమున్నీరు అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..
జహీరాబాద్ పట్టణంలో దొంగలు పక్కా ప్లాన్‌తో భారీ చోరీకి పాల్పడ్డారు. తూముకుంట గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి అనే వ్యక్తి, భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం పట్టణంలోని ఎస్‌బీఐ (SBI) హైవే బ్రాంచ్ నుండి 8 లక్షల రూపాయలను డ్రా చేశాడు. ఆ నగదును తన స్కూటీ డిక్కీలో పెట్టుకుని తహసిల్దార్ కార్యాలయానికి బయలుదేరాడు. అయితే బ్యాంక్ వద్దే మాటు వేసిన ఇద్దరు దొంగలు నర్సింహారెడ్డిని బైక్ పై వెంబడించారు. బాధితుడు తహసిల్దార్ కార్యాలయం వద్ద స్కూటీ ఆపి లోపలికి వెళ్లగానే.. అదను చూసి దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు.
ఒకరు నడుచుకుంటూ వెళ్లగా, మరొకరు బైక్ పై వచ్చి అత్యంత వేగంగా స్కూటీ డిక్కీ తెరిచి నగదు బ్యాగుతో ఉడాయించారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ టీవీ (CCTV) కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. పట్టపగలు, రద్దీగా ఉండే ప్రభుత్వ కార్యాలయ ఆవరణలోనే ఈ స్థాయిలో చోరీ జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో నగదుతో వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




