మూడు దేశాల్లో నాలుగు పేర్లతో ప్రవహించే ఏకైక నది ఇదే..!
ఒకే నది..మూడు దేశాల సరిహద్దులు దాటుతూ.. నాలుగు పేర్లతో ప్రవహిస్తుంది. ఒక్కో చోట ఒక్కో పేరుతో సుదీర్ఘంగా సాగే ఆ అద్భుత ప్రవాహమే బ్రహ్మపుత్ర నది. దాదాపు 2,900 కిలోమీటర్ల పొడవున ప్రవహించే ఈ నది ఆసియాలోనే అతిపెద్ద నదులలో ఒకటి. ఆ స్పెషల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..

ఒకే నది..మూడు దేశాల సరిహద్దులు దాటుతూ.. నాలుగు పేర్లతో ప్రవహిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఒక్కో చోట ఒక్కో పేరుతో సుదీర్ఘంగా సాగే ఆ అద్భుత ప్రవాహమే బ్రహ్మపుత్ర నది. దాదాపు 2,900 కిలోమీటర్ల పొడవున ప్రవహించే ఈ నది ఆసియాలోనే అతిపెద్ద నదులలో ఒకటి. సంస్కృతంలో ‘బ్రహ్మపుత్ర’ అంటే బ్రహ్మదేవుని కుమారుడు అని అర్థం. హిందూ పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని అంశతో ఇది ఉద్భవించిందని నమ్ముతారు. అంతే కాకుండా మన దేశంలో పురుష నదిగా గుర్తింపు పొందిన ఏకైక ప్రవాహం గానూ దీనికి ప్రత్యేక స్థానం ఉంది.
ఒకే నది.. పేర్ల మార్పుకు కారణం ఏంటంటే ?
కాగా ఒకే నదికి వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లు ఉండటానికి ప్రధాన కారణం స్థానిక భాషలు, సంస్కృతి, చరిత్ర అని చెబుతున్నారు. ఆయా ప్రాంతాల ప్రజలు తమ భాషా సంప్రదాయాలకు అనుగుణంగా నదికి పేర్లు పెట్టుకున్నట్టు చరిత్ర స్పష్టం చేస్తుంది. హిమాలయాల్లో మొదలై మూడు దేశాల ప్రజల జీవనంతో ముడిపడి బంగాళాఖాతంలో కలిసే బ్రహ్మపుత్ర నది.. కేవలం ఒక నది లాగా మాత్రమే కాకుండా.. మూడు దేశాలను కలిపే సహజ జలమార్గం లాగా కూడా ప్రసిద్ది చెందింది. ఈ నదిని ఎక్కడ ? ఏ పేరుతో పిలుస్తారు అనే విషయాలు మీకోసం ప్రత్యేకంగా..
ఎక్కడ ? ఏ పేరుతో పిలుస్తారంటే..?
టిబెట్..
బ్రహ్మపుత్ర నది టిబెట్‌లోని హిమాలయ ప్రాంతంలో, మానస సరోవరం సమీపంలోని అంగ్సీ హిమానీనదం పరిసరాల్లో జన్మిస్తుంది. టిబెట్‌లో ప్రవహించే సమయంలో దీనిని ‘యార్లుంగ్ త్సాంగ్పో’ (Yarlung Tsangpo) అని పిలుస్తారు. ఎత్తైన పీఠభూముల మీదుగా తూర్పు దిశగా సాగే ఈ ప్రవాహం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ప్రవహించే ప్రధాన నదుల్లో ఒకటిగా నిలుస్తుంది.
అరుణాచల్‌ప్రదేశ్..
టిబెట్ నుంచి ముందుకు సాగే ఈ నది భారత్‌లోకి అరుణాచల్‌ప్రదేశ్ ద్వారా ప్రవేశిస్తుంది. ఇక్కడ దీనిని ‘సియాంగ్’ (Siang) లేదా ‘దిహాంగ్’ (Dihang) అని పిలుస్తారు. పర్వతాలు, లోయల మధ్య వేగంగా, ఉధృతంగా ప్రవహించే ఈ నది అరుణాచల్‌ప్రదేశ్ ప్రకృతి అందాలకు ప్రత్యేక ఆకర్షణగా మారుతుంది. కొండ ప్రాంతాల నుంచి మైదానాల వైపు సాగుతూ ఇది అస్సాంలోకి చేరుకుంటుంది.
అస్సాం..
అస్సాంలోకి ప్రవేశించిన తర్వాత సియాంగ్ నదికి దిబాంగ్, లోహిత్ వంటి ఉపనదులు కలుస్తాయి. అక్కడి నుంచి దీనికి అధికారికంగా ‘బ్రహ్మపుత్ర’ (Brahmaputra) అనే పేరు స్థిరపడుతుంది. అస్సాం భౌగోళిక, వ్యవసాయ, ఆర్థిక జీవనంలో ఈ నది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపాల్లో ఒకటైన మజులి కూడా ఈ నదీ వ్యవస్థలోనే ఏర్పడింది.
బంగ్లాదేశ్..
అస్సాం నుంచి ప్రయాణాన్ని కొనసాగించే బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ దీనిని ‘జమునా’ (Jamuna) అని పిలుస్తారు. బంగ్లాదేశ్‌లో అనేక పాయలుగా విడిపోతూ విస్తారమైన నదీ వ్యవస్థగా కనిపిస్తుంది. అనంతరం గంగా నది ప్రధాన ప్రవాహమైన పద్మతో కలిసి ముందుకు సాగుతుంది. ఆ తర్వాత మేఘన నదీ వ్యవస్థతో కలుస్తూ చివరకు బంగాళాఖాతంలో కలిసిపోతుంది.
