Telangana: కోటి మంది మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. రెండు దశల్లో పంపిణీ..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ స్కీమ్ ప్రారంభానికి అంతా రెడీ అయ్యింది. నవంబర్ 19న సీఎం రేవంత్ దీనిని ప్రారంభించనున్నారు. కోటి మంది మహిళలకు కోటి చీరలు అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రెండు దశల్లో చీరలను పంపిణీ చేయనున్నారు. సిరిసిల్ల చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ, స్థానిక పరిశ్రమకు మద్దతునిస్తుంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరలు పంపిణీకి అంతా సిద్ధమైంది. ఈ కార్యక్రమం నవంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన కోటి మంది మహిళలకు కోటి చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పథకం అమలుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ చీరల తయారీలో ప్రభుత్వం సిరిసిల్ల చేనేత కార్మికులకు అగ్రస్థానం కల్పించారు. దీని ద్వారా స్థానిక చేనేత పరిశ్రమకు జీవం పోసినట్టయింది. అయితే ఉత్పత్తిలో కొంత ఆలస్యం కారణంగా, ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది.
పంపిణీ షెడ్యూల్
మొదటి దశ
ప్రారంభం: నవంబర్ 19, ఇందిరా గాంధీ జయంతి . గడువు: డిసెంబర్ 9 లోపు గ్రామాల్లో పంపిణీ పూర్తి చేయాలి.
రెండో దశ
ప్రారంభం: మార్చి 1, 2026. గడువు: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటికి పట్టణాల్లో పంపిణీని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
నాణ్యత తగ్గొద్దు..
సీఎం రేవంత్ రెడ్డి చీరల నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. అలాగే పంపిణీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండేలా చూసేందుకు టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. ఈ పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కార్యక్రమం ఇలా?
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నెక్లెస్ రోడ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత ఈ చీరల పంపిణీ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సీఎం గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడతారు.
నేతన్నలకు అండగా..
ఇందిరమ్మ చీరలు పథకంలో భాగంగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లోని చేనేత కార్మికుల సంఘాలు ఇందిర మహిళా శక్తి చొరవ కింద ఈ చీరలను తయారు చేస్తున్నాయి. కేవలం సిరిసిల్లలోనే దాదాపు 131 నేత యూనిట్లు ఈ ఉత్పత్తి ఆర్డర్‌లను పొందాయి. మొత్తంగా ఈ చీరల తయారీ ప్రక్రియలో దాదాపు 6,900 మంది నేత కార్మికులు పాల్గొంటున్నారు. ఈ చీరల కోసం సుమారు 4.24 కోట్ల మీటర్ల ఫాబ్రిక్ అవసరం అవుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




