తెలంగాణ కాంగ్రెస్‌లో మరో చిచ్చు.. ముగ్గురు సీనియర్ నేతలపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు
తెలంగాణ కాంగ్రెస్‌లో మరో చిచ్చు రేగింది. పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఒక వర్గం... మరో వర్గంపై పైచేయి సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో చిచ్చు రేగింది. పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఒక వర్గం… మరో వర్గంపై పైచేయి సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఈ గ్రూప్ వార్‌లో ఇప్పుడు కొత్తగా అద్దంకి దయాకర్(Addanki Dayakar) పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డిపై అద్దంకి దయాకర్ ఆరోపణలు చేశారు. వీరు ముగ్గురిపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ పెద్దలందరికీ ఫిర్యాదు చేశారు. తనను రాజకీయంగా అంతం చేయడానికి ఈ ముగ్గురూ కలిసి కుట్ర చేశారంటూ సోనియాకు రాసిన లేఖలో ఆయన ఆరోపించారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో తన ప్రత్యర్ధులను ప్రోత్సహిస్తున్నారని అద్దంకి దయాకర్ ఆరోపించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్‌గా పోటీచేసిన వడ్డేపల్లి రవిని మళ్లీ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఆనాడు రాహుల్‌గాంధీ చెప్పినా లెక్కచేయని రవిని మళ్లీ ఎలా పార్టీలోకి తీసుకొస్తారని అద్దంకి దయాకర్ ప్రశ్నిస్తున్నారు.
2018 ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తాను ఓడిపోవడానికి వడ్డేపల్లి రవే కారణమని అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఆ ఎన్నికల్లో వడ్డేపల్లికి 2,700 ఓట్లు రాగా, తాను కేవలం 1800 ఓట్లతో ఓడిపోయానని గుర్తుచేస్తున్నారు. నాటి ఎన్నికల్లో తనను ఓడించేందుకు టీఆర్‌ఎస్‌తో డీల్ కుదుర్చుకుని, కాంగ్రెస్ రెబల్‌గా రవి పోటీచేశాడని అంటున్నారు. అలాంటి వ్యక్తిని మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు అద్దంకి దయాకర్.
Also Read..
Indian Defence budget: ప్రైవేట్ కంపెనీల నుండి ఆయుధాల కొనుగోలు.. కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం..