AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR Meeting: ఎర్రవల్లి ఫాంహౌజ్ వేదికగా మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర మంతనాలు..!

ఈ అత్యవసర సమావేశంలో ఏం చర్చిస్తున్నారు.? రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడీ మీటింగ్ ఓ హాట్‌టాఫిక్. TRS శ్రేణులు, ప్రజలే కాదు.. ప్రతిపక్షాల చూపూ ఎర్రవల్లివైపే ఉంది.

CM KCR Meeting: ఎర్రవల్లి ఫాంహౌజ్ వేదికగా మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర మంతనాలు..!
Cm Kcr
TV9 Telugu
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 19, 2022 | 4:52 PM

Share

CM KCR Meets Ministers: తెలంగాణ(Telangana)లో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి.. ఒకవైపు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ(BJP) ఆపరేషన్‌ ఆకర్ష్ షురూ చేసింది. మరోవైపు, హైదరాబాద్‌(Hyderabad)తో సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇటీవల వరుస ఐటీ దాడుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు(K.Chandrashekar Rao) మంత్రులతో అత్యవసర సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులు ఫాంహౌజ్‌కు రావాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అర్జంట్ కాల్స్ రావడంతో.. వాళ్లంతా హుటాహుటిన ఎర్రవెల్లి వెళ్లారు. అందుబాటులో ఉన్న దాదాపు 12 మంది మంత్రులు కేసీఆర్ సమావేశానికి వెళ్లారని తెలుస్తోంది. మెదక్ జిల్లా పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు.. తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని సీఎం ఫాంహౌజ్‌కు చేరుకున్నారు. మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డిలున్నారు. ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ సమావేశానికి వెళ్లారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మరి ఈ అత్యవసర సమావేశంలో ఏం చర్చిస్తున్నారు.? రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడీ మీటింగ్ ఓ హాట్‌టాఫిక్. TRS శ్రేణులు, ప్రజలే కాదు.. ప్రతిపక్షాల చూపూ ఎర్రవల్లివైపే ఉంది. ఎందుకంటే ముందస్తుపై జోరుగా చర్చ, ఊహాగానాలు నడుస్తున్న సమయాన ఈ ఎమర్జెన్సీ మీటింగ్ జరుగుతోంది. అందుకే ఔట్‌కమ్‌ ఏం వస్తుందన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సాధారణంగా పరిపాలనా పరమైన ఇష్యూస్‌ అయితే ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహిస్తారు CM కేసీఆర్. పొలిటికల్ అంశాలైతే ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు జరిగే మీటింగ్ మాత్రం కచ్చితంగా సమ్‌థింగ్ స్పెషల్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మంత్రులతోపాటు ఉన్నతాధికారులు కూడా హాజరవడం అనేక చర్చలకు తావిస్తోంది.

ప్రస్తుతానికి రాష్ట్రంలో ముందస్తుపై ఎప్పుడూ లేని విధంగా చర్చ నడుస్తోంది. విపక్షాలన్నీ వరుసబెట్టి ఇదే మాట చెబుతున్నాయి. 2018 వ్యూహాన్నే మరోసారి కేసీఆర్ అమలు చేస్తారని భావిస్తున్నాయి. అదే నమ్ముతున్నాయి. మరి కేసీఆర్ ఆలోచన ఏంటి అన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్‌. ఈ నేపథ్యంలోనే ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో జంబో బడ్జెట్ ప్రవేశపెట్టారు. సంక్షేమపథకాలకు ఓ రేంజ్‌లో కేటాయింపులు చేశారు. ముఖ్యంగా దళితబంధుకు గత బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయిస్తే.. ఈసారి ఏకంగా 17,700 కోట్లు కేటాయించారు. అలాగే, అసెంబ్లీ వేదిగా జంబో నోటిఫికేషన్ సైతం ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకేసారి 80వేలకు పైగా పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తే… ముందస్తు ముచ్చట పక్కా అన్న విశ్లేషణలు బలంగా తెరపైకి వస్తున్నాయి.

ఇక, ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో ముఖ్య అంశం రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్‌ కిషోర్‌. ఈ మధ్య ఎర్రవల్లిలో రెండు రోజులపాటు మకాం వేసి సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చించారు. పీకే ఇచ్చిన ఇన్‌పుట్స్‌తోపాటు.. నియోజకవర్గాలు, ఎమ్మెల్యేల పనితీరు, స్కీమ్‌ల వారీగా చేయించిన సర్వేలను సీఎం కేసీఆర్, మంత్రుల ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న సంక్షేమ పథకాలు సరిపోతాయా? లేక కొత్తగా మెగా పథకాలు ఏమైనా తీసుకురావాలా? అన్న అంశాలపై అందరి అభిప్రాయాలు తీసుకున్నారని సమాచారం. ఓవరాల్‌గా మంత్రులతోపాటు..ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే మీటింగ్‌గా దీన్ని భావిస్తున్నారు. అంటే ఇప్పటికిప్పుడు అసెంబ్లీ రద్దు లాంటి నిర్ణయాలేమీ ఉండకపోయినా.. కచ్చితంగా ఇది మాత్రం ముందస్తు దిశగా జరిగిన ఓ సన్నాహక సమావేశంగానే చెప్పుకోవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి..

అటు ఐటీ దాడులపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుండగా.. సీఎం కేసీఆర్‌ మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది. దీంతో ఈ అత్యవసర సమావేశంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇంత అర్జెంట్‌ గా మంత్రులను కేసీఆర్‌ కలవడానికి గల కారణం ఏంటని దానిపై చర్చిస్తూ.. అనేక అనుమానాలు తెరపైకి తెస్తున్నారు విశ్లేషకులు. కేంద్రంపై యుద్ధం.. జాతీయ రాజకీయాలు అని తిరుగుతున్న కేసీఆర్‌.. మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన చేశారని అంటున్నారు. అంతేగాకుండా.. సిరిసిల్ల జిల్లాలో బీజేపీ, టీఆర్ఎస్ దాడులు.. తాజా పరిస్థితిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. అదీగాక ఐటీ దాడులు జరగడంతో కేంద్రం తమపై సైలెంట్‌ యుద్ధం మొదలు పెట్టిందా? అనే అనుమానంతో కేసీఆర్‌ మంత్రులతో భేటీ అయ్యారా? అనే సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

అయితే, సాధారణంగా తాము టార్గెట్ చేసిన పార్టీ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం బీజేపీకి అలవాటే అనే అభిప్రాయం ఉంది. కేంద్ర సంస్థల ద్వారా దాడులు చేయించి కోలుకోలేని దెబ్బ కొడుతుందనే విమర్శలు ఉన్నాయి. అయితే, గతంలోనే ముఖ్యమంత్రి పార్టీ క్యాడర్‌ను హెచ్చరించడం జరిగింది. కేంద్ర నిఘా సంస్థలు ఎక్షణానైనా దాడి చేయవచ్చు. అప్రమత్తంగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఐటీ రెయిడ్స్ జరిగిన కేఎన్‌ఆర్ కన్‌ స్ట్రక్షన్స్ అనే సంస్థ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులకు పని చేస్తోంది. కేఎన్‌ఆర్ సంస్థ పేరు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా.. టీఆర్‌ఎస్‌ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఐటీ దాడులు జరగడంతో.. టీఆర్‌ఎస్‌ పై బీజేపీ ఫోకస్‌ చేసిందనే వార్తలు వస్తున్నాయి. అటు, ఐటీ దాడులపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుండగా.. సీఎం కేసీఆర్‌ మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

Read Also…..  

Telangana Jobs: తెలంగాణ సచివాలయంలో 250 అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

Nalgonda: వీడిన మిస్టరీ.. కారును కాలువలోకి తోసేసింది వారే.. వెలుగులోకి కీలక విషయాలు