CM K C R: నేడు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ..భారీగా పార్టీ సభ్యత్వం పెంచాలని నేతలకు పిలుపు
జాతీయ పార్టీగా ఏర్పడ్డాక తెలంగాణలో సైతం ఇప్పుడున్న సభ్యత్వం సరిపోదని, భారీగా పార్టీ సభ్యత్వం పెంచాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు కేసీఆర్. బయటి రాష్ట్రాల నుంచి కూడా మంచి స్పందన ఉందని.. పార్టీ పెట్టిన వెంటనే ఆదరణ లభిస్తుందని ఊహిస్తున్నారు..
టిఆర్ఎస్ పార్టీ తీరు ఇప్పటి వరకూ ఒకెత్తు. ఇకపై మరొక ఎత్తు. ఇక నుంచి కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితమై.. ఇక్కడి ఎన్నికలతో సరి పెట్టే పరిస్థితి లేదు. దేశ వ్యాప్తంగా పట్టున్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ తన కార్యకలాపాలను మొదలు పెట్టనుంది. దీంతో గులాబీ కేడర్ లో రానున్న మార్పు చేర్పులేంటి? లాభాలేంటి? నష్టాలేంటి? ఇప్పటి వరకూ ప్రాంతీయ పార్టీగా ఉన్న.. టీఆర్ఎస్ జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి సారించడంతో.. పార్టీ అంతర్గత వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. మాములుగా అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే వ్యూహాలు రచించి.. తర్వాత వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గట్టి ప్రయత్నం చేసి.. ఆ గెలుపోటములతో సరిపెట్టాల్సిన గులాబీ లీడర్లకు.. ఇకపై దేశ వ్యాప్తంగా వచ్చే ప్రతి ఎన్నికా ప్రతిష్టాత్మకమే.
ఎందుకంటే కొత్త పార్టీ బీఆర్ఎస్ ఏపీ- తెలంగాణ- మహారాష్ట్ర- కర్ణాటక.. రాష్ట్రాలను టార్గెట్ చేసి.. అక్కడ తమకు గెలుపు అవకాశాలున్న వంద సీట్లను గుర్తించారు. వీటిలో యాభై నుంచి అరవై సీట్లను గెలిచేలా కసరత్తు మొదలు పెట్టనున్నారు. పార్టీ ప్రకటనతో పరిధిని తెలంగాణ నుంచి మార్చి దేశవ్యాప్తం చేయనున్నారు. ఈ మేరకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసి తీర్మానం చేస్తారు. ఈ తీర్మానంపై 283 మంది సంతకాలు చేస్తారు. రేపటి నుంచే జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆరో తేదీన ఈ పత్రాలతో ఢిల్లీ వెళ్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక.. డిసెంబరు 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఉప ఎన్నిక నాటికి మునుగోడులో మూడూ జాతీయ పార్టీలే తలపడనున్నాయి.
మహారాష్ట్రలో మరఠ్వాడా ప్రాంతం, కర్ణాటకలోని తెలుగు ప్రాంతాలు, బెంగళూరు వంటి నగరాల్లోనూ పార్టీకి తప్పక ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు కేసీఆర్. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని, రాష్ట్రంలో ఉన్న అభివృద్ది మరెక్కడా లేదని. ఈ వాణిని.. దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ గెలుపు అవకాశమున్న ప్రాంతాల్లో తీసుకెళ్లాలన్నది కేసీఆర్ సూచన. తెలంగాణ అభివృద్ధి, ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమం గురించి ప్రచారం చేస్తే.. తగిన జనాదరణ లభిస్తుందని భావన. రైతాంగ సంక్షేమం, దళిత సంక్షేమమే ప్రధాన అజెండాలుగా ఉంటాయంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్.
జాతీయ పార్టీగా ఏర్పడ్డాక తెలంగాణలో సైతం ఇప్పుడున్న సభ్యత్వం సరిపోదని, భారీగా పార్టీ సభ్యత్వం పెంచాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు కేసీఆర్. బయటి రాష్ట్రాల నుంచి కూడా మంచి స్పందన ఉందని.. పార్టీ పెట్టిన వెంటనే ఆదరణ లభిస్తుందని ఊహిస్తున్నారు గులాబీ దళాధిపతి. పార్టీ నేతలకు జాతీయ స్థాయిలో కూడా అవకాశాలు వస్తాయని.. వివిధ రాష్ట్రాల్లో పార్టీ తరఫున ఇన్‌చార్జులుగా పనిచేసే అవకాశం లభిస్తుందనీ. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైతే గవర్నర్ అవకాశాలు సైతం వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు కేసీఆర్. పార్టీలోని కీలక నేతలకు ఏయే బాధ్యతలు అప్పగించాలన్న దానిపైనా ఇప్పటికే చర్చించారు గులాబీ దళాధిపతి.
ఇలా దేశ వ్యాప్తంగా పార్టీ విస్తరణపై చర్చించడం మాత్రమేకాకుండా.. ఒక కార్యాచరణ మొదలు పెట్టి.. ఇటు స్టేట్ తో పాటు అటు సెంట్రల్ లోనూ పాగా వేయాలని చూస్తోంది కేసీఆర్ లోని జాతీయ నాయకత్వం. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కి ప్రత్యామ్నంగా బీఆర్ఎస్ ను విస్తరించాలన్నది కేసీఆర్ ఆలోచన. ఈ దిశగా ఉన్న అవకాశాలన్నిటినీ పరిశీలించాలన్నది ఒక ఎత్తుగడ. ఇటు పార్టీ కేడర్ కి కూడా చేతి నిండా పని ఇచ్చినట్టు అవుతుంది. అటు కాలం ధర్మ కలిసి వస్తే.. వారికి వివిధ రకాల పార్టీ, ప్రభుత్వ పదవులు సైతం వచ్చే అవకాశముంటుంది. ఈ దిశగా తన శ్రేణులను ఉత్సామ పరుస్తూ.. కొత్త పార్టీని కొత్త పుంతలు తొక్కించేలా వ్యూహ రచనలు చేస్తున్నారు దేశ్ కీ నేత కేసీఆర్.
మరిన్ని తెలంగాణ వార్తాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..